'పాత్రల ప్రభావం నటుల మీద పడుతుందా?' అని అడిగితే, కొందరి మీద పడుతుంది. విలన్ పాత్రలు ధరించే వాళ్లు బయట కూడా అలా క్రూరంగా ప్రవర్తిస్తారా? ప్రవర్తించిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా చిత్తూరు నాగయ్య 'పోతన' పాత్ర చేసిన తర్వాత పూర్తిగా రామభక్తులైపోయారు. వేమన పాత్రతో సాధు వర్తనం అలవాటు చేసుకున్నారు. "అంతకుముందు నాకు బాగా కోపం ఉండేది. తరువాత తగ్గిపోయింది" అని నాగయ్య ఓ సందర్భంలో చెప్పారు.
చిత్రాల్లో హీరోలు హీరోయిన్లను ప్రేమిస్తారు. బయట కూడా వాళ్లు ప్రేమించిన ఉదంతాలున్నాయి. సూర్యకాంతం గయ్యాళీ పాత్రధారి. మనసు మంచిదే అయినా బయట కూడా ఒక్కోసారి కోపం వచ్చి 'గయ్యాళీ'గా అరిచేవారు. ఒకసారి షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చి సారథి స్టూడియోలో ఉన్న క్యాంటీన్‌లో సాయంకాలానికి పకోడి చేయండి అని చెప్పారు.
సాయంత్రం అయ్యాక 'అందరికీ పకోడి తీసుకురా' అని సూర్యకాంతం.. ప్రొడక్షన్ వాళ్లకు చెప్పారు. అప్పుడు వాళ్లు 'పకోడి చేయలేదమ్మా - బజ్జీ చేశారట' అని చెప్పారు. ఇక చూడాలి ఆమె ప్రతాపం! ఆ క్యాంటీన్ అధికారి మీద తాటిచెట్టు ప్రమాణంలో లేచారు.
'చెప్పినప్పుడు చేస్తానని ఎందుకన్నావు? చెయ్యలేకపోతే నాకొచ్చి చెప్పాలా లేదా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యడం ఏంటి? ఈ బజ్జీలు నేను చేయమనలేదు. నేను డబ్బు ఇవ్వను. నీ యిష్టం వచ్చిన వాడికి చెప్పుకో, మరీ మాట్లాడావంటే, పెద్దవాళ్లతో చెప్పి నీ క్యాంటీన్ ఎత్తించేయగలను' అని విశ్వరూపం చూపించేసరికి క్యాంటీన్ అధికారి ఆమె కాళ్లమీద పడ్డాడు.