"కరోనా సమయంలో ఓటీటీ వేదికలు సినిమా ప్రేక్షకుల సంఖ్యను పెంచాయి. అంతకుముందు సినిమాల్ని చూడనివాళ్లు మరో దారి లేక.. కరోనా సమయంలో చూడాల్సి వచ్చింది. వాళ్లందరికీ సినిమా మజా తెలిసింది కాబట్టి.. రేపు సినిమా బాగుందని తెలిస్తే కచ్చితంగా థియేటర్‌కు వెళతారు. ఆ ప్రభావం వచ్చే ఆగస్టు.. సెప్టెంబరు మాసాల్లో స్పష్టంగా కనిపిస్తుంది" అన్నారు నిర్మాత బన్నీవాస్. ఇటీవల ఆయన అల్లు అరవింద్ సమర్పణలో.. 'చావుకబురు చల్లగా' చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం ఈ శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా బన్నీవాస్ 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
కరోనా వల్ల గతేడాది విడుదల కావల్సిన సినిమాలు ఇప్పుడొస్తున్నాయి. ఒకొక్కవారం రెండు మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. ఇదివరకు సినిమా బాగుందంటే మూడో వారమూ వసూళ్లు పర్వాలేదు అనిపించే స్థాయిలో ఉండేవి. ఇప్పుడు ప్రారంభ వసూళ్లు, తొలి వారంతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
* "మా సంస్థ నుంచి వస్తున్న మరో మంచి చిత్రం 'చావు కబురు చల్లగా'. కల్ట్ కలర్ ఇచ్చే ఓ కుటుంబ కథ ఇది. భర్త చనిపోయిన ఓ యువతికీ, శవాలు తీసుకెళ్లే వాహనాన్ని నడిపే ఓ కుర్రాడికీ మధ్య సాగే ప్రేమకథ ఇది. ఇందులో తాత్వికత ఉంటుంది. దాన్ని చదువు రానివాళ్లకు కూడా అర్థమయ్యేలా దర్శకుడు కౌశిక్ చెప్పాడు. ఈ సినిమా చూశాక 'ఆర్.ఎక్స్.100' కార్తికేయ, ఈయన ఒకరేనా అని ఆశ్చర్యపోయేలా నటించాడు. క్లాస్ కథల్ని మాస్‌కు కూడా చేరువ చేయడమే లక్ష్యంగా మేం సినిమాల్ని చేస్తుంటాం. అదే మా విజయం.. దాన్నే నమ్ముతుంటాం".
* ఈ ఏడాది మా సంస్థ నుంచి ఆరు సినిమాల్ని విడుదల చేయాలి. అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', నిఖిల్ '18 పేజీస్', గోపీచంద్ - మారుతి కలయికలో 'పక్కా కమర్షియల్', హిందీ 'జెర్సీ', వరుణ్‌తేజ్ 'గని'తోపాటు అల్లు శిరీష్ సినిమా ఒకటుంది. ఇవి కాకుండా రాహుల్ రవీంద్రన్ ఒక కథ చెప్పాడు. కథానాయిక ప్రాధాన్యంతో కూడిన కథ అది. దాంతోపాటు శ్రీకాకుళం నేపథ్యంలో సాగే ఓ కథని ఓ కొత్త దర్శకుడు వినిపించాడు. ఆ రెండూ వచ్చే ఏడాది విడుదల కానున్నాయి’’.
ఇదీ చూడండి: లూసిఫర్ రీమేక్: ఏప్రిల్‌లో షూటింగ్.. ఆరు నెలల్లో పూర్తి!