ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీరామ్ లాగూ (92) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పుణెలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. మరాఠీ రంగస్థల నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఈయన 1927 నవంబర్ 16న మహారాష్ట్రలోని సతారాలో జన్మించారు.
మరాఠీలో అభిమానులు ఆయన్ని నట సమ్రాట్‌గా పిలుస్తుంటారు. ఆయన మంచి నటుడే కాదు డాక్టర్ కూడా. సినిమాల్లోకి రాకముందు ఈఎన్‌టీ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేశారు. దాదాపు 100పైగా హిందీ, మరాఠీ చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. మరాఠీలో 20పైగా నాటకాలకు దర్శకత్వం వహించారు. హిందీలో 'ఆహట్', 'పింజర', 'మేరా సాత్ చల్', 'హేరా ఫేరా', 'సామ్నా' వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సత్తా చాటారు.
శ్రీరామ్ లాగూ మృతి పట్ల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, మాజీ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్, సుశీల్ కుమార్ శిందే సంతాపం వ్యక్తం చేశారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">