'దబాంగ్ 3'లో సల్మాన్ ప్రేయసిగా నటించి మెప్పించింది యువ నటి సయీ మంజ్రేకర్. ప్రస్తుతం తెలుగులో 'మేజర్', 'గని' లాంటి రెండు విభిన్నమైన ప్రాజెక్ట్‌ల్లో భాగమయ్యారు. ఈ క్రమంలోనే ఆమె తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కెరీర్ ప్రారంభించిన కొత్తలో తన తండ్రి మహేశ్ మంజ్రేకర్ చెప్పిన మాటలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. టాలీవుడ్ హీరో బన్నీ అంటే ఎక్కువ ఇష్టమని తెలిపారు.
చిన్నప్పుడు మా అమ్మతో కలిసి ప్రతి శుక్రవారం తాజ్ హోటల్‌కు వెళ్లేదాన్ని. అక్కడ నాకెన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. 2008లో తాజ్ హోటల్‌పై ఉగ్రదాడి జరిగిందని తెలిసి అప్పట్లో ఎంతో బాధపడ్డా. ఇప్పుడు అదే కథతో తెరకెక్కుతోన్న 'మేజర్'లో నటించడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. భాషతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఇలాంటి పవర్‌ఫుల్ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. 'కథ నచ్చితే ఏ భాషా చిత్రాన్నైనా ఓకే చేసేయ్. భాషాపరమైన ఇబ్బందుల గురించి ఆలోచించవద్దు' అని కెరీర్ ఆరంభంలో నాన్న చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోను'
'తెలుగులో నాకు బన్నీ అంటే ఎంతో ఇష్టం. గత కొన్నిరోజుల నుంచి ఆయనతో కలిసి నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అవే నిజమైతే బాగుండని ఎదురుచూస్తున్నా. తెలుగులో అవకాశం రాగానే.. మొదట నేను చూసిన తెలుగు చిత్రం 'అల వైకుంఠపురములో'. ఆయన డ్యాన్స్, నటన చూసి ఫిదా అయిపోయా. ఆయనతో నటించే అవకాశం త్వరలోనే వస్తోందని భావిస్తున్నా' అని సయీ వివరించారు.