తాతయ్య నందమూరి తారక రామారావు పాత్రను పోషించలేనని... కథానాయకుడు ఎన్టీఆర్ మరోసారి స్పష్టం చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలు సందర్భాల్లో అతడు ఇదే విషయాన్ని చెప్పాడు. తాతయ్య నటనలోని హుందాతనం, ఆయన హావభావాల్ని అచ్చుగుద్దినట్లు పలికించడం సవాలుతో కూడుకున్న విషయమని గతంలోనే అన్నాడు. 'మహానటి' బయోపిక్‌లో ఎన్టీఆర్ పాత్ర పోషించమని అడిగినప్పుడు కూడా సున్నితంగా తిరస్కరించాడు తారక్.
ప్రస్తుతం బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటిస్తోన్న జయలలిత బయోపిక్ 'తలైవి'లో తారక్ నటించబోతున్నారని ఊహాగానాలు వచ్చాయి. భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో నటించేందుకు యంగ్‌టైగర్ సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే దర్శక, నిర్మాతలు ఎన్టీఆర్ పాత్రలో నటించమని ఆయన్ను కలిసిన విషయం నిజమేనని.. కానీ దాన్ని తారక్ తిరస్కరించారని తాజా సమాచారం. ఈ మేరకు కోలీవుడ్, బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకా ఈ వార్తలపై చిత్ర బృందం స్పందించలేదు.

'తలైవి' సినిమాకు ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో దివంగత ముఖ్యమంత్రి జయలలితగా కంగన, దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్‌గా అరవింద స్వామి నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం భరతనాట్యంతో పాటు పలు విద్యలు నేర్చుకొంది కంగనా. తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు.