బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్.. తమిళ దర్శకుడు అట్లీ కలిసి పనిచేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో త్వరలో ఓ చిత్రం పట్టాలెక్కనుందట. దీనికి 'సంకి' అనే పేరు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కింగ్ ఖాన్ పుట్టినరోజైన నవంబర్ 2న అధికారిక ప్రకటన వెలువరించనుంది చిత్రబృందం.
బాలీవుడ్ ఎంట్రీ..
గతంలో అట్లీ, షారుఖ్ కలుసుకున్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అప్పటి నుంచి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని కోలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. బాలీవుడ్‌కు అట్లీను తీసుకెళ్లాలని బాద్‌షా ప్రయత్నిస్తున్నాడట. విజయ్ సినిమా 'విజిల్' తర్వాత ఈ ప్రాజెక్టు మొదలుపెట్టాలని వీరిద్దరూ అనుకున్నట్లు సమాచారం.
షారుఖ్ తమిళ సినిమాలో నటించడం ఇదేమి తొలిసారి కాదు. 'హే రామ్' సినిమాలో కమల్ హాసన్ సోదరుడి పాత్రను పోషించాడు. దక్షిణాదిలో జరిగే పలు వేడుకలకు షారుఖ్ హాజరవుతుంటాడు. గతంలో ఇతడు తీసిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలో రజినీ పేరుతో పాట పెద్ద హిట్టయింది. దర్శకుడిగా అట్లీ విజయవంతంగా రాణిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన తీసిన నాలుగు సినిమాలు 'రాజా రాణి', 'తెరి', 'మెర్సల్', 'విజిల్' ప్రేక్షకాదరణ పొందాయి.