సామాజిక సేవా కార్యకమాల్లో చురుగ్గా ఉండే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్... తాజాగా మహారాష్ట్రలోని ఓ వరద ప్రభావిత గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. కొల్హాపుర్ జిల్లా పరిధిలోని ఖిద్రాపుర్ గ్రామస్థులకు అండగా నిలవనున్నట్లు ప్రకటించాడు.
ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు ఎలాన్ అనే సామాజిక సంస్థతో కలిసి నడుం బిగించాడు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
ఇటీవల మహారాష్ట్రలో వచ్చిన వరదల కారణంగా సంగ్లి, సతారా, కొల్హాపుర్ జిల్లాల్లోని అనేక గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా వందలాది మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారు.
బాలీవుడ్ తారలకు కొత్తేం కాదు..
బాలీవుడ్ తారలు ఇలా దాతృత్వం చాటుకోవడం కొత్తేం కాదు. గతంలో దీపికా పదుకొనే అంబెగావ్ అనే గ్రామాన్ని దత్తత తీసుకొంది. 2012లో షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, అమీర్ ఖాన్లు కూడా గ్రీన్థాన్ ప్రచారంలో భాగంగా కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు.