'హమ్ తుమ్ ఏక్ కమరేమే బంద్ హో'.. 'బాబీ' సినిమాలోని ఈ పాట వింటే మనకు గుర్తుకువచ్చే వ్యక్తి రిషీ కపూర్. కానీ ఈ పాట షూటింగ్ సమయంలోనే ఆయన తన జీవిత భాగస్వామి నీతూసింగ్‌ని తొలిసారి చూశారు. అలా వీరిద్దరూ 15 సినిమాల్లో కలిసి నటించి, సినీ ప్రియులను మెప్పించడమే కాకుండా నిజజీవితంలో ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే వీరి ప్రేమలో ఎన్నో గొడవలు, మరెన్నో మధురానుభూతులు. మరి వారి ప్రేమకు సంబంధించిన విశేషాల గురించి రిషీ కపూర్, నీతూసింగ్ ఒకానొక సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా తెలియజేశారు.
![Bollywood actor Rishikapoor reveals that his love story with his wife Neetusingh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7004980_bfh.jpg)
మొదట్లో రుసరుసలు..
''జహ్రీలా ఇన్సాల్', 'ఖేల్ ఖేల్ మే'.. చిత్రాల కోసం మొదటిసారి మేమిద్దరం కలిసి పనిచేశాం. అయితే ఈ రెండు సినిమాల్లో డింపుల్ నటించాల్సి ఉండగా.. ఆమెకు వివాహం కావడం వల్ల నన్ను తీసుకున్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్ సమయంలో నాకు, రిషీకి సరిగ్గా పడేది కాదు. ‘నీకు కాటుక పెట్టుకోవడం రాదు. డ్రెస్సింగ్ సెన్స్ లేదు’ అని ప్రతిసారీ ఏదో ఒకటి అంటుండేవాడు. దాంతో వెంటనే పేకప్ చేప్పేస్తే బాగుండు అని అనుకునేదాన్ని’ అని నీతూ చెప్పారు.
![Bollywood actor Rishikapoor reveals that his love story with his wife Neetusingh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7004980_ss.jpg)
తను ఎంత బాధపడుతుందో అప్పుడు అర్థమైంది
'మొదట్లో నీతూ అంటే నాకు బాగా కోపం ఉండేది. కారణమేంటో నాకు ఇప్పటికీ తెలియదు. బహుశా చిన్న వయసులోనే పెద్ద హీరోనయ్యాననే గర్వం కావచ్చు. అలా నీతూతో కలిసి దాదాపు డజను సినిమాల్లో నటించాను. దాంతో ఆమెతో సాన్నిహిత్యం బాగా పెరిగింది. అప్పడు కానీ నాకు అర్థం కాలేదు. నా మాటలకు నీతూ ఎంతో బాధపడుతుందో. ఎందుకంటే తను చాలా సున్నితమైన మనస్కురాలు. నా ప్రవర్తనలో మార్పుకు కారణం నీతూయే. రాజ్ కపూర్ కుమారుడుగా కాకుండా నేను నేనుగా ఎలా ఉండాలో అర్థమయ్యేట్టు చేసింది ఆమే' అని రిషీ కపూర్ తెలిపారు.
సిక్కు పిల్లా నువ్వు గుర్తుకు వస్తున్నావ్..
'చింటూ అందరబ్బాయిల్లానే సైట్ కొట్టేవాడు. షికార్లకు రమ్మనేవాడు. నేనూ ఏదో ఓ కారణం చెప్పి వెళ్లి తనను కలిసేదాన్ని. అలా ఒకానొక సమయంలో రిషీ స్పెయిన్ వెళ్లాడు. అదే సమయంలో నేను కభీకభీ షూటింగ్‌లో భాగంగా కశ్మీర్‌లో ఉన్నాను. దీంతో రిషీ స్పెయిన్ నుంచి నాకో టెలిగ్రాం పంపాడు. సిఖ్నీ యాద్ తూ ఆయీ (సిక్కు పిల్లా నువ్వు గుర్తొస్తున్నావు) అందులో ఇంతే రాసుంది. అమితాబ్‌తో సహా సెట్లో ఉన్నవాళ్లందరూ అది చూసి నవ్వారు మా అమ్మ ఏం స్పందించలేదు.' అంటూ చెప్పారు నీతూ.
![Bollywood actor Rishikapoor reveals that his love story with his wife Neetusingh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7004980_ert.jpg)
పెళ్లి తర్వాత సినిమాలకు దూరం..
'పెళ్లి తర్వాత ఎవరో ఒకరు సినిమాలకు దూరం కావాలని మేం ముందు అనుకున్నాం. అలా నీతూ సినిమాలకు దూరంగా ఉంది. మా పిల్లలు మంచి చదువులు, క్రమశిక్షణతో ఉన్నారంటే దానికి నీతూనే కారణం' అని రిషీ చెప్పారు.
డిప్రెషన్ వల్ల మద్యానికి బానిసై
నేను సినిమాల నుంచి తప్పుకున్న సందర్భంలో చాలా డిప్రెషన్‌కు గురయ్యానని రిషీ తెలిపారు. మందుకీ బానిసయ్యాను. ఆ సందర్భంలో తను నాకు ఎంతో బాసటగా నిలిచిందని అన్నారు.
![Bollywood actor Rishikapoor reveals that his love story with his wife Neetusingh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7004980_rk.jpg)