కన్న తండ్రే అతడి రోల్ మోడల్. చిన్నతనం నుంచి తండ్రిలా నడవాలని, నవ్వాలని ఎన్నో కలలు. ఆఖరికి... ఆయన చేసే వృత్తిలోనే స్థిరపడాలని ఆశ, ఆశయం. ఆ దారినే ఎంచుకున్నాడు కాబట్టి.. భవిష్యత్తులో తానేం కావాలో అనే తికమక కాస్తయినా అతడిలో లేదు. లైట్స్ ఆరిన థియేటర్లలో మెగా పిక్చర్లో తనని తాను చూసుకోగలననే ధీమా.
ఆ ధీమాతోనే... కాలేజీ చదువు అయిపోగానే యాక్టింగ్ స్కూల్లో చేరి తగిన శిక్షణ పొందాడు. ఆ వెంటనే అందివచ్చిన అవకాశంతో సినీ తెరపై తళుక్కున మెరిశాడు. తన స్టయిల్‌లో కామెడీ పండించాడు. రొమాంటిక్ డ్రామాల్నీ రక్తి కట్టించాడు. యాక్షన్ సినిమాల్లో నటనకు విశ్లేషకులతో మంచి మార్కులే వేయించుకున్నాడు. ఆ నటుడికి చిన్నతనం నుంచి స్ఫూర్తి ఇచ్చింది అతడి తండ్రైన బాలీవుడ్ ప్రముఖ హీరో వినోద్ ఖన్నా. తండ్రి స్పూర్తితో తానూ సినిమాల్లోకి వచ్చి రాణించిన నిన్నటి తరం హీరో అక్షయ్ ఖన్నా. ఈ నటుడి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా అతడి గురించి పలు విశేషాల్ని తెలుసుకుందాం.
వారసత్వం పరిశ్రమలో ప్రవేశపెడుతుంది తప్ప... చివరిదాకా నిలబెట్టలేదు. ఎంచుకున్న రంగంలో తనని నిరూపించుకున్న తర్వాతే... ప్రేక్షకులు అభిమానులవుతారు. ఎర్రతివాచీ పరిచి మరీ ఓ గుర్తింపుని కట్టబెడతారు. కళాకారుడిగా విఫలమైతే ప్రేక్షకులు అస్సలు పట్టించుకోరు. ఈ సత్యాన్ని అవగాహన చేసుకున్న అక్షయ్ ఖన్నా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాడు. విజయం సాధించాడు. అందుకే... సినీ తెరని విడిచి ఇన్నాళ్లయినా.. అతడి గురించి ఇంకా బాలీవుడ్ మాట్లాడుకుంటూనే ఉంది. అతను చేసిన సినిమాలను తలచుకుని ప్రశంసిస్తూనే ఉంది.
'హిమాలయ పుత్ర'తో సినీ అరంగేట్రం
ఒకటా...రెండా? ఎన్నో సినిమాలు విజయవంతమై అక్షయ్ ఖన్నాను ఇప్పటికీ గుర్తు చేస్తూనే ఉన్నాయి. 1997లో రిలీజైన తొలి చిత్రం 'హిమాలయ పుత్ర', 'మాలి', 'బోర్డర్', 1997లో 'మొహబ్బత్', 1998లో 'కుద్రత్', 1999లో 'లావారిస్', 'లవ్ యు హమేషా', 'దహెక్' మూవీలు అక్షయ్ ఖన్నా స్థానాన్ని సుస్థిరం చేశాయి. అదే సంవత్సరం రిషి కపూర్‌తో కలిసి నటించిన 'ఆ అబ్ లౌట్ చలే' సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన రొమాంటిక్ డ్రామా 'తాళ్' సూపర్ డూపర్ హిట్ అయి అక్షయ్ ఖన్నాకు పేరు తెచ్చింది. ఈ చిత్రానికి సుభాష్ ఘయ్ దర్శకత్వం, అందాల సుందరి ఐశ్వర్య రాయ్ కథానాయిక కావడం కలిసొచ్చిన అంశాలు.
2001లో కామెడీ డ్రామా 'దిల్ చాహతా హై', 2002లో రొమాంటిక్ థ్రిల్లర్ 'హమ్ రాజ్', సైకలాజికల్ థ్రిల్లర్ 'దీవాన్ జీ', 2003లో రొమాంటిక్ కామెడీ 'హంగామా', 2004లో మరో రొమాంటిక్ కామెడీ 'హల్చల్', 2006లో 'మర్డర్ మిస్టరీ', '36 చైనా టౌన్', 2007లో బయోపికల్ డ్రామా 'గాంధీ...మై ఫాదర్', 2008లో యాక్షన్ థ్రిల్లర్ 'రేస్', 2010లో 'తీస్మార్ ఖాన్', యాక్షన్ థ్రిల్లర్ 'ఆక్రోశ్' ...ఇలా ఎన్నో చిత్రాలు అక్షయ్ ఖన్నా నట ప్రతిభకు అద్దం పట్టాయి. 2016లో యాక్షన్ కామెడీ మూవీ 'దిశోమ్' ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. 2017లో క్రైమ్ ఫిల్మ్ 'మామ్', మర్డర్ మిస్టరీ 'ఇతేఫాక్' చిత్రాల ద్వారా అలరించాడు.
ముంబయితోనే ముడిపడ్డ జీవితం - సినిమా
అక్షయ్ ఖన్నా 1975 మార్చి 28న ముంబయిలో పుట్టాడు. బాలీవుడ్ హీరో, రాజకీయ నాయకుడు వినోద్ ఖన్నా అతడి తండ్రి. పారశీకి చెందిన గీతాంజలి తలేయార్ ఖన్నా తల్లి. అక్షయ్ ఖన్నాకు ఓ సోదరుడు ఉన్నాడు. అతడి పేరు రాహుల్ ఖన్నా. ముంబయ్‌లోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ పొందిన అక్షయ్ ఖన్నా 1997లో పంకజ్ పరాశర్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ మూవీ 'హిమాలయ పుత్ర'లో తండ్రి వినోద్ ఖన్నాతో పాటు స్కీన్ర్ షేర్ చేసుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం సాధించకపోయినా మోస్ట్ ప్రామిసింగ్ న్యూ కమర్‌గా స్కీన్ర్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
అవార్డులు-పురస్కారాలు
దేశ రక్షణలో సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల జీవనశైలి నేపథ్యంలో రూపొందించిన 'బోర్డర్'కి అక్షయ్ ఖన్నాకి పేరు తెచ్చింది. బెస్ట్ డెబ్యూ మేల్ ఆర్టిస్ట్‌గా ఫిలింఫేర్ అవార్డు దక్కింది. ఇదే సినిమాకి జీ సినిమా అవార్డూ లభించింది. 'దిల్ చాహతా హై' సినిమాలో నటనకు బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా ఫిలింఫేర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. స్కీన్ర్ స్పెషల్ జ్యూరీ అవార్డు సొంతం చేసుకున్నాడు. 'హమ్ రాజ్' సినిమాలో ఉత్తమ విలన్‌గా ఐఐఎఫ్‌ఏ పురస్కారం సాధించాడు. 'గాంధీ...మై ఫాదర్' సినిమాకు ఆస్ట్రేలియన్ ఇండియన్ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని అందుకున్నాడు.
'రేస్' చిత్రానికి ఉత్తమ ప్రతినాయకుడిగా స్క్రీన్ అవార్డు, ఐఐఎఫ్‌ఏ పురస్కారం అందుకున్నాడు. 1997 నుంచి ప్రారంభమైన అక్షయ్ ఖన్నా నట ప్రస్తానంలో ఎన్నో మెరుపులు. బాలీవుడ్‌లో ఉత్తమ అభిరుచి గల కళాకారుడిగా ప్రఖ్యాతి పొందాడు. తాజా సంచలన చిత్రంగా పేరొందిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' సినిమాలో ఆ పుస్తక రచయిత సంజయ్ బారు పాత్రలో అక్షయ్ ఖన్నా పరకాయ ప్రవేశం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పటికీ మంచి పాత్రలు వస్తే నటించేందుకు ఏ మాత్రం వెనుకాడని అక్షయ్ ఖన్నా మరిన్ని మంచి సినిమాలతో అలరించాలని అతడి అభిమానులు కోరుకొంటున్నారు.
ఇదీ చూడండి.. "ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్టుంటది"