వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని నటిగా తనకంటూ గుర్తింపు సొంతం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు ఉర్ఫి జావేద్(urfi javed bigg boss). 'బాదే భయ్యా కీ దుల్హానియా' సీరియల్‌తో నటిగా పరిచయమైన ఉర్ఫి 'మేరీ దుర్గా'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ రియాల్టీ షో 'బిగ్‌బాస్ ఓటీటీ'(urfi javed bigg boss ott)లోనూ పాల్గొన్నారు . ఈ నేపథ్యంలో ఉర్ఫి తాజాగా తన కెరీర్‌పై స్పందించారు. ఆఫర్స్ రాకపోవడం వల్ల ఎన్నోసార్లు బాధపడ్డానని ఆమె అన్నారు. ఓ మహిళా నిర్మాత తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించిందని ఉర్ఫి వివరించారు.
"మాది ఎంతో సంప్రదాయబద్ధమైన కుటుంబం. ఆర్థికంగా మేం స్థితిమంతులం కాదు. ఉన్నంతలో నన్ను బాగానే చదివించారు. కాకపోతే అన్ని విషయాల్లో నాకు ఆంక్షలు పెట్టేవాళ్లు. అక్కడే ఉంటే నటి కావాలనే నా ఆశ నెరవేరదనిపించింది. దాంతో ఎన్నో సంవత్సరాల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. చిన్న ఉద్యోగంలో చేరాను. రూ.3000 సంపాదనతో జీవనం సాగించాను. కొన్నిసార్లు ఖాళీ కడుపుతో నిద్రపోయేదాన్ని. అవకాశాల కోసం ఎంతోమందిని కలిశాను. కొన్నిసార్లు ఆఫర్ ఇచ్చినట్లే ఇచ్చి.. నో చెప్పేవాళ్లు. అలా, ఎన్నోసార్లు నిరాశకు గురయ్యాను."
"అదే క్రమంలో నాకు ఓ వెబ్ సిరీస్‌లో అవకాశం వచ్చింది. కథ నచ్చింది. కాంట్రాక్ట్ పేపర్లపై సంతకం చేశాను. ఫస్ట్ డే సెట్‌కి వెళ్లగానే.. నాకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడే ఉన్న ఓ మహిళా నిర్మాత.. నాపై ఇబ్బందికర సన్నివేశాలు చిత్రీకరించడానికి ప్రయత్నించింది. షూట్ ప్రారంభించిన వెంటనే దుస్తులు తొలగించాలని ఆదేశించింది. నాకు ఏమాత్రం నచ్చలేదు. అదేమిటి? ఎందుకు? అని ప్రశ్నించాను. నేను అలాంటివి చేయనని ముఖంపై చెప్పేశాను. దానికి ఆమె.. కాంట్రాక్ట్ పేపర్లు చూపించి జైలుకి పంపిస్తానని బెదిరించింది. వేడుకున్నా వినకుండా నా దుస్తులు చింపేసింది. ఆ క్షణం ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ఆ రోజు తర్వాత మళ్లీ ఆ సెట్ వైపుకి వెళ్లలేదు. నా ఫోన్ స్విచ్చాఫ్ చేసేశాను" అని ఉర్ఫి వివరించారు.