ప్రముఖ జాతీయ క్రీడాకారిణి, వెయిట్ లిఫ్టర్, తెలుగమ్మాయి కరణం మల్లీశ్వరి జీవితాధారంగా సినిమా తెరకెక్కనుంది. ఈ మధ్యనే ఈ విషయాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్ ప్రకటించారు. చిత్రంలో మల్లీశ్వరి పాత్రలో తొలుత నిత్యా మేనన్‌ను అనుకున్నారట. అయితే కొన్ని అనివార్య కారణాల చేత ఆమె ఈ సినిమాలో నటించలేనని చెప్పిందట.
ప్రస్తుతం బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. చిత్రాన్ని బాలీవుడ్‌తో పాటు ఇటు దక్షిణాదిలోనూ విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే తాప్సీ, రకుల్‌ప్రీత్ సింగ్‌లాంటి కథానాయికల పేర్లు కూడా వినిపించాయి. కానీ వారితో చిత్రబృందం ఎలాంటి సంప్రదింపులు జరపలేదని సినీ వర్గాలు అంటున్నాయి. భూమి పెడ్నేకర్ ఎలాంటి పాత్రలోనైనా ఇమిడిపోగలదని కూడా పేరుంది. భూమితో చిత్రబృందం ఇప్పటికే సంప్రదింపులు జరిపిందట. అందుకు ఆమె కూడా ఒప్పుకుందని తెలుస్తోంది.
ఈ మధ్యే ఈ చిత్ర దర్శకురాలు సంజనా రెడ్డి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఈ నెల 15 నుంచి తెలంగాణలో పరిమితమైన సంఖ్యలో తారాగణం పాల్గొని చిత్ర షూటింగ్‌లు చేసుకోడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సాధ్యమైనంత త్వరగా నటీనటులు, సాంకేతిక వర్గాన్ని ప్రకటించి, సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్మాణ సంస్థ భావిస్తోంది.