సినిమా నిర్మాణమూ వ్యాపార పరిశ్రమే అని నమ్మి, యాభై సంవత్సరాలకు పైగా విజయవంతమైన సినిమాలు తీసి, జయకేతనం ఎగురవేసిన నిర్మాతల్లో ప్రథముడు విజయా సంస్థ అధినేత బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. "జనంకోరేది మనం తీయాలిగానీ మనం తీసేది జనం చూడడం కాదు" అనే సూత్రాన్ని నమ్మి, ఆ నమ్మకంతోనే చిత్రాలు నిర్మించి విజయాలు సాధించిన మేధావి నాగిరెడ్డి. విజయా ప్రొడక్షన్స్ సంస్థ ప్రారంభించి నాగిరెడ్డి చక్రపాణితో కలిసి తొలిప్రయత్నంగా 'షావుకారు' తీశారు. తరవాత 1951లో 'పాతాళభైరవి' జానపదం, 1952లో 'పెళ్ళిచేసి చూడు' సాంఘికం, 1955లో 'మిస్సమ్మ' సాంఘికం, 1957లో 'మాయాబజార్' పౌరాణిక ద్విభాషాచిత్రం, తరవాత 'అప్పుచేసి పప్పుకూడు', 'జగదేకవీరుని కథ', 'సి.ఐ.డి' వంటి చిత్రాలు నిర్మించి శతదినోత్సవాలు, రజతోత్సవాలు జరిపించారు., అయితే 'చంద్రహారం', 'ఉమా చండి గౌరీ శంకరుల కథ', 'హరిశ్చంద్ర' వంటి కొన్ని సినిమాలు మాత్రమే ఆశించినంత గొప్పగా ఆడలేదు.
విజయా సంస్థ మొత్తంమీద ఇరవై తొమ్మిది చిత్రాలు నిర్మించింది. అవి వేళ్లమీద లెక్కించ తగినవే అయినా వేటికవే మాస్టర్ పీసులు. నాగిరెడ్డి ముగ్గురు కొడుకులు వేణుగోపాలరెడ్డి, విశ్వనాథరెడ్డి, వెంకటరామరెడ్డి.. 1991లో చందమామ విజయా కంబైన్స్ పేరిట ఓ నిర్మాణ సంస్థను స్థాపించి ఎక్కువగా తమిళంలో, తెలుగులో సినిమాలు తీయడం ప్రారంభించారు. 1992 లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 'బృందావనం'ను నిర్మించి విజయం సాధించారు. రెండో తెలుగు చిత్రంగా ఓ జానపద సినిమా నిర్మించాలని... 'పాతాళభైరవి' చిత్ర ఒరవడిని కొనసాగించాలని నిర్ణయించి 'భైరవద్వీపం'కు శ్రీకారం చుట్టారు. 1986లో విఠలాచార్య నిర్మించిన 'మోహినీశపథం' తర్వాత మరో మంచి జానపద చిత్రం తెలుగులో రాలేదు. అందుకే జానపద చిత్రం తీసేందుకు నాగిరెడ్డి కుమారులు మొగ్గుచూపారు.
వేణుగోపాలరెడ్డి, విశ్వనాథరెడ్డి సమర్పణలో వెంకట్రామరెడ్డి నిర్మాతగా 'భైరవద్వీపం'కు అంకురార్పణ జరిగింది. 'పాతాళభైరవి' పేరులోని 'భైరవి'ని తీసుకొని దానికి 'ద్వీపం' పేరును జోడించి 'భైరవద్వీపం'గా విడుదల చేస్తే యాభై కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకొని విజయకేతనాన్ని ఎగురవేసింది. 1994 ఏప్రిల్ 14న విడుదలైన ఈ చిత్రం.. 26 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చలనచిత్ర విశేషాలు కొన్ని మీకోసం
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'భైరవద్వీపం' నిర్మాణ సన్నాహాలు
ప్రముఖ పాత్రికేయుడు, నటుడు రావి కొండలరావు అంటే విజయా నాగిరెడ్డి నుంచి వారి కొడుకుల వరకు అందరికీ ప్రత్యేక గౌరవం. కొండలరావు సారధ్యంలోనే విజయచిత్ర సినీ పత్రిక కొత్త పుంతలు తొక్కి ఒక అద్భుత సినీ పత్రికగా విరాజిల్లింది. పాతిక సంవత్సరాలకు పైగా విజయా సంస్థలో పనిచేస్తూవచ్చిన కొండలరావు మీద నిర్మాతలు వెంకట్రామిరెడ్డి సోదరులు ‘బృందావనం,’ చిత్ర నిర్మాణ బాధ్యతలు ఉంచారు. రచనతోబాటు నిర్మాణ సారథ్యం వహించిన ‘బృందావనం’ సినిమా శతదినోత్సవం చేసుకుంది. అదే ఉపులో 'భైరవద్వీపం' సినిమా నిర్మాణ సంకలన బాధ్యతలనూ రావి కొండలరావుకే అందించారు. ఈ చిత్రానికి కథను అల్లే బాధ్యతను రావి కొండలరావు స్వీకరించగా, ‘బృందావనం’కు దర్శకత్వ బాధ్యతలు చూసిన సింగీతం శ్రీనివాసరావు 'భైరవద్వీపం'కు దర్శకుడిగా నియమితులయ్యారు.
'పాతాళభైరవి' వంటి జానపద కథ కన్నా కాస్త భిన్నంగా వుండాలని కొత్తమలుపులతో సినిమా కథను కొండలరావు రూపొందించి అందుకు తగిన విధంగా సంభాషణలను సమకూర్చారు. దర్శకుడు స్క్రీన్ ప్లే తయారుచేశారు. తండ్రిబాటలో విజయా సంస్థకు పనిచేయాలని నటుడు బాలకృష్ణ హీరోగా చేసేందుకు ముందుకొచ్చారు. హీరోయిన్గా రోజాను తీసుకున్నారు. బాలకృష్ణ తల్లిగా కె.ఆర్. విజయ, తండ్రిగా విజయకుమార్, రోజా తల్లిదండ్రులుగా సంగీత, కైకాల సత్యనారాయణ, బాలకృష్ణ పెంపుడు తల్లిగా రాధాకుమారి, తండ్రిగా భీమేశ్వరరావు, బాలకృష్ణ తమ్ముడుగా బాబూమోహన్, గురువుగా మిక్కిలినేని, యక్షిణి ప్రత్యేకపాత్రలో రంభ, స్వరనాట్యకన్యలుగా అప్సర, వాహిని ఎంపికయ్యారు. పద్మనాభం, సుత్తివేలు అతిథి పాత్రలు పోషించారు.
హాస్య పాత్రల్లో గిరిబాబు, శుభలేఖ సుధాకర్ నటించగా మరుగుజ్జు మనుషులుగా మాస్టర్ విశ్వేశ్వరరావు, చిట్టిబాబు నటించారు. తారాగణం ఎంపిక పూర్తయింది... కానీ బేతాళ మాంత్రికుడు వంటి విలన్ పాత్రకు ఎస్వీ రంగారావు వంటి నటునికోసం అన్వేషణ జరిగింది. హిందీ నటులు నానాపటేకర్, అమ్రిష్ పురీలు పరిశీలించిన వారి జాబితాలో వున్నారు. అప్పుడే ‘’వియత్నాంకాలనీ’ అనే మలయాళ సినిమా మద్రాసులో విడుదలయితే ఆ చిత్రాన్ని నిర్మాత వెంకటరామరెడ్డి చూశారు. అందులో నటించిన రాజకుమార్ అనే నటుడి మీద నిర్మాతకు గురి కుదిరింది. పైగా ఆ నటుడు తెలుగువాడని తెలియడం వల్ల అతణ్ణి మాంత్రికుని వేషానికి ఎంపిక చేశారు. అతనికి ‘విజయా’ సంస్థ పేరు, ఎస్వీ రంగారావు పేరు కలిసి వచ్చేలా ‘విజయ రంగ రాజా’ అనే పేరు పెట్టి 'భైరవద్వీపం' లో విలన్‌గా పరిచయం చేశారు. ఛాయాగ్రహణం విషయానికి వస్తే ట్రిక్ షాట్లు వంటివి తీయడంలో నిష్ణాతుడైన ఎస్. ఎస్. లాల్ కుమారుడు సయ్యద్ కబీర్ లాల్‌ను తీసుకున్నారు.
కబీర్ లాల్ అంతకుముందు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ‘ఆదిత్య 369’ చిత్రానికి పనిచేశారు. 1993 జూన్ 25న మద్రాసు వాహినీ స్టూడియోలో భారీ సెట్టింగులో సినిమా ప్రారంభ వేడుక జరిగింది. ముహూర్తపు షాట్ బాలకృష్ణ, రోజాలమీద చిత్రీకరించారు. దీనికి సూపర్‌స్టార్ రజనీకాంత్ క్లాప్ కొట్టగా, మెగాస్టార్ చిరంజీవి స్విచ్ ఆన్ చేశారు. ఎన్టీ రామారావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ ముహూర్తం అవగానే రంభ, బాలకృష్ణల మీద 'నరుడా ఓ నరుడా ఏమి కొరికా' పాట చిత్రీకరణ జరిగింది. మరుగుజ్జు పాత్రల సన్నివేశాలు ఇందులోనే వుండడం వల్ల ఈ పాట చిత్రీకరణకే దాదాపు నెలరోజులు పట్టింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కథ చిన్నదే
జయచంద్ర మహారాజు(విజయకుమార్) వసుంధర(కె.ఆర్. విజయ)ను గాంధర్వ వివాహం చేసుకుంటాడు. వారికి ఓ మగబిడ్డ విజయుడు (బాలకృష్ణ) జన్మిస్తాడు. కానీ మహారాజు వసుంధరను భార్యగా స్వీకరించక దేశ బహిష్కరణ చేస్తాడు. వసుంధర ప్రయాణిస్తున్న పడవ తుపాను తాటికి గురై బిడ్డకు దూరమవుతుంది. ఆ బిడ్డ ఓ కొండరాజు కుటుంబానికి దొరుకుతాడు. జమదగ్ని అనే ముని పర్యవేక్షణలో ఆ బిడ్డడు మంచి యోధుడుగా ఎదుగుతాడు. ఆ ప్రాంతపు మహారాజు కీర్తికేయుడు(సత్యనారాయణ) కూతురు పద్మావతి (రోజా)తో అనుకోకుండా విజయుడు ప్రేమలో పడతాడు. సప్తసముద్రాల ఆవలగల భైరవ ద్వీపంలో భైరవుడు (విజయ రంగరాజా) అనే మాంత్రికుడు వుంటాడు. రేవతీ నక్షత్రం, మీనరాశిలో సూర్యోదయం వేళ జన్మించిన కన్యను బలి ఇస్తే తనకు సమస్త శక్తులు సంక్రమిస్తాయని భావించి, పద్మావతిని అపహరిస్తాడు. విజయుడ్ని నేరస్తుడని మహారాజు నమ్ముతాడు. దీంతో విజయుడు రంగంలోకి దిగి, ప్రమాదాలను అధిగమించి, దివ్యశక్తుల్ని సంపాదించి, మాంత్రికుణ్ణి సంహరించి పద్మావతిని రక్షించి, ఆమెను పెళ్ళాడుతాడు.
సాహసోపేతమైన చిత్రీకరణ
ఈ చిత్రంలో పెద్దపెద్ద కొండల మధ్య ఓ పెద్ద జలపాతం వుంటుంది. దాని మధ్యలో పార్వతీదేవి విగ్రహం ఉంటుంది. అక్కడే కె.ఆర్. విజయ, బాలకృష్ణ, మిక్కిలినేనిల మీద అద్భుతమైన దృశ్యాలను చిత్రీకరించాలి. ‘అంబా శాంభవి భద్రరాజ గమనా’ అనే పాటను తీయాలి. అందుకోసం ‘భైరవద్వీపం’ యూనిట్ పెద్ద సాహసమే చేసింది. కర్ణాటకలోని చిక్‌మగళూరు దగ్గరలో వున్న కమ్మన్ గుడి అనే ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అక్కడకు దగ్గరలోనే ఆబ్సే అనే జలపాతం వుంది. ఆ జలపాతం చేరుకోవడానికి చాలా కష్టపడాలి. గెస్ట్ హౌస్ నుంచి కొంతదూరం కారులో, ఆ తరవాత జీప్‌లో ప్రయాణించాలి. ఆ ప్రయాణం ముగిశాక ఓ కిలోమీటరు దూరం నడుస్తూ వెళ్లాల్సివుంటుంది. అక్కడ నీరు పారుతుండే వంతెన దాటి జలపాతం మధ్యలో పార్వతీదేవి గుడి సెట్టింగ్ నిర్మించాలి. దాదాపు కిలోమీటరు దూరం నీళ్ళలో నడచి ఆప్రాంతం చేరుకోవాలి. ఆనంద్ సినీ సర్వీసెస్, విజయ ఇంటర్ ట్రేడింగ్ కార్పొరేషన్ యూనిట్లు చాలా కష్టపడి అక్కడకు చేరుకొని మొల్డింగ్ సుబ్బరాయన్ ఆధ్వర్యంలో గుడి, అమ్మవారి ప్రతిమ నిర్మాణం పూర్తిచేశారు.
అక్కడకు చేరుకునేందుకు నీళ్లలో ఓ కిలోమీటరు ప్రయాణం చేయాల్సి వుండగా ఆ నీటిలో పెద్దపెద్ద జలగలు తారాడుతూ వుంటాయి. వాటినుంచి తప్పించుకునేందుకు సున్నం బస్తాలు మోసుకుంటూ, ఆ సున్నాన్ని జలగల మీద చల్లుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. బాలకృష్ణ, కె.ఆర్.విజయ సహాయకుల రక్షణలో అక్కడకు చేరుకున్నారు. కానీ మిక్కిలినేనిని అక్కడకు చేర్చడం చాలా కష్టతరమైంది. అప్పటికే మిక్కిలినేనికి 80 ఏళ్లు. నలుగురు సహాయకులు మిక్కిలినేనిని ఆ సన్నివేశ స్థలికి రోజూ చేర్చేవారు. చుట్టూ కొండలు ఉండటం వల్ల మధ్నాహ్నం 12 గంటలకు మాత్రమే వెలుగు కనిపించేది. మళ్లీ రెండు గంటలకల్లా చీకటి పడేది. ఆ రెండు గంటల్లోనే షూటింగు పూర్తి చేసుకోవాలి. లైటింగ్ పెట్టాలంటే కిలోమీటరు దూరం కేబుల్ లాగాలి. ఆ అవకాశమే లేదు కాబట్టి ప్రతిరోజూ రెండుగంటలపాటు అక్కడ అవుట్ డోర్ లో సన్నివేశాలు, పాట చిత్రీకరణ జరిపారు.
తర్వాత గుర్రాలతో ఛేదన చేసే దృశ్యాలనూ ఈ జలపాతానికి చేరువలో వున్న అడవిలో చిత్రీకరించారు. ఇండోర్ దృశ్యాల చిత్రీకరణ అంతా వాహినీ స్టూడియోలో చేశారు. అద్దాల రాక్షసుడి సన్నివేశాల చిత్రీకరణ కోసం ఛాయాగ్రాహకుడు కబీర్ లాల్ చాలా కష్టపడ్డాడు. తల్పం గాలిలో ఎగిరిపోయే సీన్లను రాత్రి ఎఫెక్ట్ కోసం రాత్రుళ్లే చిత్రీకరించారు. పెద్దపెద్ద క్రేన్లను వాడి, గండభేరుండ పక్షి మీద సన్నివేశాలను చిత్రీకరించారు. మరుగుజ్జుల కోసం చిన్నచిన్న బొమ్మలు చేయించి రిమోట్ కంట్రోల్ ద్వారా అవి పైకి ఎగబాకే దృశ్యాలను చిత్రీకరించారు. ఇందుకోసం కొందరు ఇంజనీర్ల సాయం తీసుకున్నారు. 'శ్రీ తుంబుర నారద నాదామృతం' పాటకోసం బాలకృష్ణ చాలా శ్రమ తీసుకొని రోజూ మద్రాస్ మేరీనా బీచ్‌కు తెల్లవారుజామున వెళ్లి గమకాలు, పాట సాహిత్యం సాధన చేశారు. ఆ రోజుల్లో గ్రాఫిక్స్ అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్నాయి. అమెరికాలో శిక్షణ పొందిన నిపుణుల చేత కొద్దిపాటి గ్రాఫిక్స్‌ను ఇందులో వాడారు. నిర్మాణానికే 240 రోజులకు పైగా పట్టింది. దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలు ఈ సినిమా కోసం ఖర్చయింది.
అలరించిన మాధవపెద్ది సంగీతం
'భైరవద్వీపం' విజయానికి మాధవపెద్ది సురేశ్ అందించిన సంగీతం ఓ పెద్ద అసెట్‌గా చెప్పుకోవాలి. ఇందులో మొత్తం ఆరు పాటలు ఉండగా, పాటల నిర్ధారణకే సుమారు మూడు నెలలు పట్టింది. అంతకుముందు నిర్మించిన ‘బృందావనం’ చిత్రానికీ మాధవపెద్ది సంగీత దర్శకత్వం వహించారు. సంగీత నిర్వహణలో ఈయనకు ఫిలిప్స్, శ్రీనివాసమూర్తి, దినకర్లు సహకరించారు. ఇందులో రెండు యుగళగీతాలు, నాలుగు ఏకగళ గీతాలు వున్నాయి. హంసనంది రాగ ఛాయల్లో స్వరపరచిన ’అంబా శాంభవి భద్రరాజ గమనా’ (వడ్డేపల్లి కృష్ణ రచన), సిందుభైరవి రాగంలో స్వరపరచిన ‘నరుడా ఓ నరుడా ఏమి కోరికా’ (వేటూరి రచన) పాటలను గాయని ఎస్. జానకి అత్యద్భుతంగా పాడి హిట్ చేసింది. మోహన కళ్యాణి రాగంలో రూపుదిద్దుకున్న ‘విరిసినది వసంత గానం వలపుల పల్లవిగా’ (సింగీత శ్రీనివాసరావు రచన) పాటను చిత్ర బృందం చేత పాడించారు.
చిత్రానికే హైలైట్ అయిన ‘శ్రీతుంబుర నారద నాదామృతం’(వేటూరి రచన) పాటను బాలు అద్భుతంగా పాడి ‘జగదేకవీరుని కథ’ లో ‘శివశంకరి శివానందలహరి’ పాటను గుర్తుకు తెచ్చేలా చేశారు. మాధవపెద్ది ఈ పాటను అభేరి, మోహన, హిందోళ, సరస్వతి, చక్రవాకం, కళ్యాణి ఇత్యాది రాగసమ్మేళనంతో రాగమాలికగా స్వరపరచి సూపర్ హిట్ చేశారు. అత్యంత వేగంగా పాటలు రాయగల కవిగా పేరు తెచ్చుకున్న వేటూరికి ఇది రాసేందుకు వారం రోజులు పట్టింది. అలాగే మాధవపెద్ది సురేశ్ ఈ పాటకు బాణీ కట్టి రికార్డు చేసేందుకు నెలరోజులు శ్రమించారు. సిరివెన్నెల రాసిన రెండు యుగళ గీతాలలో ‘ఎంత ఎంత వింత మొహమో’ పాటను మాధవపెద్ది సురేశ్ బృందావన సారంగ రాగ ఛాయల్లో స్వరపరచగా బాలుతో కలిసి పి. సుశీల మేనకోడలు సంధ్య పాడింది. ఆలాగే శుద్ధ సావేరి రాగంలో స్వరపరచిన ‘ఘాటైన ప్రేమ ఘటన ధీటైన నేటి నటన’ పాటను బాలు, చిత్ర ఆలపించారు. ఈ చిత్రాన్ని తమిళంతోబాటు హిందీలోకి డబ్ చేసినప్పుడు ’అంబా శాంభవి భద్రరాజ గమనా’, ‘నరుడా ఓ నరుడా యేమి కోరికా’ రెండు పాటలను బాలీవుడ్ గాయని ఆశా భోంస్లే చేత పాడిద్దామని ముందుగా ట్రాక్ టేపును ఆమెకు పంపి, మద్రాసుకు పిలిపించారు. రిహార్సల్స్ సమయం వచ్చేసరికి ఆశా భోంస్లే ‘’నేను పాడలేను’’ అని తన అశక్తతను తెలిపింది. దాంతో ఆయా పాటలను ఎస్. జానకి చేత పాడించారు.
ముగింపు
ఈ సినిమాకు కథ సమకూర్చి, రచన చేసిన రావి కొండలరావు మాట్లాడుతూ ‘’మట్టితో ఓ బొమ్మను చేయాలంటే ప్రణాళిక వుండాలి. దానిని ముందుగా తయారుచేసుకొనే, ఈ జానపద కథను అల్లాను. ముఖ్యంగా కె.ఆర్. విజయ ప్రదర్శించిన మహిళా సెంటిమెంట్ చిత్ర విజయానికి చాలా బాగా సహకరించింది. కొన్ని సన్నివేశాల రూపకల్పనకు విజయా వారి సినిమాల ప్రభావం వుంది. అంతే కాదు కొన్ని హాలీవుడ్ చిత్రాల ప్రభావాన్ని కొట్టి వేయలేను. ఇటువంటి చిత్రాన్ని ఈరోజుల్లో తీయడం కష్టంతో కూడుకున్న పని. అలాగే ఈ చిత్రానికి కొనసాగింపు తీయడం సాధ్యం కాదు’’ అంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 1994 ఏప్రిల్ 14న విడుదల చేస్తే, తొలి రోజునే మంచి టాక్ వచ్చింది.
కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలలోని చిన్న చిన్న ఊర్లలోనూ ‘భైరవద్వీపం’ విజయభేరి మోగించింది. మొత్తం మీద యాభై కేంద్రాలలో ఈ చిత్రం శతదినోత్సవం చేసుకుంది. రజతోత్సవాన్ని మద్రాసులోని విజయా-శేషమహల్లో జరిపారు. ఈ చిత్రంలో ‘నరుడా ఓ నరుడా యేమి కొరికా’ పాటను ఆలపించిన ఎస్. జానకి, ‘శ్రీతుంబుర నారద నాదామృతం’ పాటను ఆలపించిన బాలు ఉత్తమ గాయనీ గాయకులుగా నంది బహుమతులు అందుకున్నారు. ఒకే సినిమాలో రెండు పాటలు ఉత్తమ బహుమతులు అందుకోవడం పెద్ద విశేషం. అంతేకాకుండా ఉత్తమ దర్శకుడుగా సింగీతం శ్రీనివాసరావు, ఉత్తమ కళా దర్శకుడుగా పేకేటి రంగా, ఉత్తమ మేకప్ ఆర్టిస్టుగా మండూరి సత్యం నంది బహుమతులు అందుకోగా, ఉత్తమ వస్త్రాలంకరణకు డి. కొండలరావుకు, ఉత్తమ ఛాయాగ్రాహకుడుగా కబీర్ లాల్ కు నంది బహుమతులు లభించాయి. ఈ చిత్రాన్ని ‘విజయప్రతాపన్’ పేరుతో తమిళం లోకి డబ్ చేశారు. అక్కడ కూడా ఈ చిత్రం విజయవంతమైంది. హిందీలోకి కూడా ‘భైరవద్వీపం’ చిత్రాన్ని అనువదించి విడుదల చేశారు.
ఇదీ చూడండి : యంగ్ టైగర్‌తో అట్లీ.. అభిమానుల్లో భారీ అంచనాలు!