అమృత తుల్యమైన గీతాలతో ఆబాలగోపాలాన్ని రంజింపజేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఇక లేరన్న వార్తను సినీ సంగీత ప్రపంచం జీర్ణించుకోలేకపోతుంది. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సినీతారలంతా సామాజిక మాధ్యమాల వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కడచూపు భాగ్యం దక్కలేదు
"సహోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కడచూపు చూసే భాగ్యం నాకు దక్కలేదు. పేగుపంచుకోని సహోదరుడు బాలు. నేను ఆయనను ఎంత ప్రేమించానో తెలియదు కానీ, నన్ను ఆయన అమితంగా ప్రేమించారు. 'అన్నా..' అంటూ ఆత్మీయంగా పిలిచినప్పుడు ఎనలేని ఆనందం కలుగుతుంది. పూర్వజన్మలో మేమిద్దరం అన్నదమ్ముల్లా జన్మించామని చాలా సందర్భాల్లో అనుకునేవాడిని. ఆయనకోలుకుని త్వరగా వచ్చేస్తాడని ఎదురుచూశాం. కరోనా అతిపెద్ద ఆవేదనను మిగిల్చింది. నేను యూఎస్‌లో ఉన్నందువల్ల రాలేకపోతున్నా. అనుమతి లేదు. జీవచ్చవంగా ఉన్న బాలాను చూస్తే నా హృదయం ద్రవించిపోతుంది. ఇకపై ఆయన జ్ఞాపకాలతో జీవిస్తా"
- జె. ఏసుదాసు
దేవుడికి కన్ను కుట్టింది
"కరోనా ఇంత అలజడి రేపుతుందని అనుకోలేదు. మనకందరికీ కావాల్సిన వ్యక్తి ఎస్పీ బాలుని వెంటాడి తీసుకెళ్లిపోయింది. ఆయన వచ్చిన తర్వాత ఇండస్ట్రీ ఎంతో అభివృద్ధి చెందింది. ఆయనతో నేను ఎన్నో సంవత్సరాలు పనిచేశా. మేమిద్దరం కలిసి ఎన్నో పాటలు పాడాం. బుల్లితెర వేదికగా 'పాడుతా తీయగా' అనే కార్యక్రమంతో ఎంతో మంది గాయనీగాయకులను ఆయన తయారు చేశారు. దేవుడికి కన్నుకుట్టినట్లుంది. మనందర్నీ దుఃఖసాగరంలో పడేయాలనుకున్నాడు. అందుకే మనకెంతో ఇష్టమైన వ్యక్తిని తీసుకెళ్లిపోయాడు."
- సుశీల
డబ్బు వద్దనే వారు
"తెలుగు కావొచ్చు, తమిళం కావొచ్చు. కన్నడం, మలయాళం, హిందీ... ఆయా భాషల్లోని హీరోలకి వారిలాగే పాడి ఒప్పించి, మెప్పించిన మహోన్నతుడు బాలుగారు. నాకైతే 'అర్ధరాత్రి స్వతంత్య్రం', 'ఎర్రసైన్యం' మొదలుకొని మొన్నటి 'అన్నదాత సుఖీభవ' వరకు నన్నూ అనుకరిస్తూ ఎంతో ఉల్లాసంగా, ఉత్తేజంగా పాడారు. ఆయనలో ఎంత గొప్ప గాయకుడు ఉన్నారో, అంత గొప్ప మానవీయ కోణమూ ఉంది. 'అర్ధరాత్రి స్వతంత్య్రం' నుంచి 'నారాయణమూర్తిగారు ప్రజలకు ఉపయోపగడే చిత్రాలు తీస్తున్నారు, ఆయన దగ్గర డబ్బు తీసుకోకూడద'ని తన వ్యక్తిగత సహాయకులకు చెప్పేవారు."
- ఆర్. నారాయణమూర్తి