తొడ కొడితే రికార్డులు.. డైలాగులు చెబితే ఈలలు.. తెలుగు తెరపై కలెక్షన్ సునామీలు. ఈ ముక్క తెలుగు గడ్డపైన ఏ బిడ్డనడిగినా చెబుతాడు.. అది బాలకృష్ణ (Balakrishna) అని. ఇలా తెలుగు వాడి గుండెల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న నందమూరి హీరో బాలకృష్ణ. నేడు (జూన్ 10) 'లెజెండ్' పుట్టినరోజు (Balakrishna Birthday) సందర్భంగా నందమూరి నటసింహంపై కెరీర్‌పై ఓ లుక్కెద్దాం!
తండ్రి బాటలో..
అభిమానులు ముద్దుగా 'బాలయ్య' అని పిలుస్తారు. కథ పౌరాణికమైనా, జానపదమైనా, సాంఘికమైనా.. తండ్రి నందమూరి తారక రామారావులా ఇట్టే ఒదిగిపోగల నటుడు బాలకృష్ణ. 1960 జూన్ 10న చెన్నైలో జన్మించారు. 1982లో వసుంధర దేవిని వివాహం చేసుకున్నారు.
సినీ ప్రస్థానం..
1974లో 'తాతమ్మ కల' చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేశారు బాలకృష్ణ. ఆ తర్వాత తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి పలు చిత్రాల్లో నటించారు. సాహసమే జీవితం, జననీ జన్మభూమి, మంగమ్మగారి మనవడు చిత్రాలతో హీరోగా మంచి విజయాలందుకున్నారు. అపూర్వ సోదరుడు, మువ్వ గోపాలుడు, ముద్దుల మావయ్య, నారీనారీ నడుమ మురారీ లాంటి చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
విభిన్న తరహా సినిమాలకు నాంది..
లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, లక్ష్మీ నరసింహా, చెన్నకేశవ రెడ్డి, సింహా, లెజెండ్ లాంటి చిత్రాలతో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు బాలయ్య. భైరవద్వీపం, ఆదిత్య 369 లాంటి చిత్రాలతో ప్రయోగాలకు పెద్దపీట వేశారు. శ్రీరామరాజ్యం, పాండురంగడు వంటి భక్తిరస చిత్రాలతో అలరించారు. అక్బర్ సలీమ్ అనార్కలీ, గౌతమీపుత్ర శాతకర్ణి వంటి చారిత్రక కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. బయోపిక్ ట్రెండ్‌లో 'కథానాయకుడు', 'మహానాయకుడు' చిత్రాల్లో నటించి తండ్రి నందమూరి తారక రామారావు ఔన్నత్యాన్ని తెలుగువారికి మరోసారి రుచి చూపించారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ'(Akhanda) చిత్రంలో నటిస్తున్నారు బాలకృష్ణ. ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రలతో మెప్పించనున్నారు.
అవార్డులు..
నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 100కు పైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు బాలయ్య. ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు, నరసింహానాయుడు (2001), సింహా (2010), లెజెండ్ (2014) సినిమాలకు ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 'నంది' అవార్డులు అందుకున్నారు.
రాజకీయ ప్రస్థానం..
రాజకీయ రంగంలో తనదైన ముద్రవేశారు బాలకృష్ణ. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు.