AR Rahman about his daughter: పిల్లలు ఎదగడం, వారు కన్న కలలను నిజం చేసుకునేందుకు కష్టపడటం.. వీటిని చూసే తల్లిదండ్రులకు ఇంతకు మించిన మంచి అనుభూతి మరొకటి ఉండదనే చెప్పాలి. ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత విద్వాంసుడు ఏఆర్ రెహమాన్ ఇప్పుడు అదే అనుభూతిని పొందుతున్నారు. ఆయన కుమార్తెలు రహీమా రెహమాన్, ఖతీజా రెహమాన్ ఇద్దరూ సంగీతకారులుగా రాణిస్తున్నారు. ఈఏడాది వచ్చిన కృతిసనన్ 'మిమి' చిత్రంలో 'రాక్ ఏ బై బేబీ' పాటతో అదరగొట్టారు ఖతేజా.
వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మీ కూతుర్లకు ఏమైనా సలహా ఇస్తారా అని అడిగిన ప్రశ్నకు ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. "రహీమా, ఖతేజా ఇద్దరిదీ మొండి మనస్తత్వం. వాళ్లు ది బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. ఈక్రమంలో వాళ్లకు నేను పదేపదే చెప్పే విషయం ఒకటే. దేని గురించి దిగులు చెందకండి . చేయాలనుకున్న పనిని చేయండి. అప్పుడే మీకంటూ సొంత వ్యక్తిత్వం అలవడుతుంది. ఇతరులతో పోల్చుకోవద్దు అని చెబుతాను. నేను కుర్రాడిగా ఉన్నప్పుడు 30-60 ఏళ్ల వయసు వాళ్లతో కలిసి పనిచేశాను. వాళ్లందరి నుంచి నేను నేర్చుకున్న విషయమేమిటంటే.. పని పట్ల నిబద్ధత. ఇప్పుడూ కూడా అదే విషయాన్ని రివర్స్‌లో యూత్ నుంచి నేర్చుకుంటున్నా. యువతలో ఉండే ఉత్సాహం నన్ను ప్రేరేపిస్తుంది. వారితో కలిసి పనిచేస్తుంటే అప్పటి క్షణాలను ఆస్వాదిస్తున్నా" అన్నారు.
ఆయనకు నేను వీరాభిమానిని
Atrangi re AR Rahman: "దర్శకుడు ఆనంద్ ఎల్‌రాయ్‌కు నేను వీరాభిమానిని. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన తన సినిమాల ద్వారా ప్రపంచానికి మన సంస్కృతి, మన బాధ, మన సంతోషం.. ఇలా ఎన్నో భావోద్వేగాలను చూపిస్తారు" అన్నారు ఏఆర్ రెహమాన్. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అత్రాంగి రే'. ధనుష్, సారా అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అక్షయ్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి రెహమాన్ స్వరాలు అందించారు. ఈ చిత్రం ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది.
రెహమాన్ మాట్లాడుతూ.. "అత్రాంగీ రే కోసం నేను అందించిన స్వరాలు అన్నీ కథతో పాటు చిత్రంలో ప్రధాన పాత్ర ధారులు అక్షయ్, ధనుష్, సారాలను దృష్టిలో పెట్టుకుని చేసినవే. ఆనంద్ ఎల్‌రాయ్ నా జీవితంలో ముఖ్యమైన దర్శకుడు. రచయితలు ఇర్షద్, హిమాన్షులతో కలిసి పనిచేయడం చాలా బాగుంటుంది" అని చెప్పారు.
ఇదీ చూడండి: కూతురుతో 'గ్రామీ'కి రెహమాన్