హాయ్. మీరు సినిమా ప్రియులా? టీవీ షోలు అంటే ఎంతో ఇష్టమా? అయితే మీకో ప్రశ్న? మీరెప్పుడైనా ఓ విలన్ పాత్రధారి ఐఫోన్ ఉపయోగించడం చూశారా? చూడలేదు కదూ. దానికో ప్రత్యేక కారణముంది.
'స్టార్ వార్స్: ద లాస్ట్ జేడీ' సినిమా డైరెక్టర్ రియాన్ జాన్సన్ దీని గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పారు.
"సినిమాలు, టీవీ షోల్లో ఐఫోన్ (యాపిల్ ఉత్పత్తులు) వినియోగంపై... ఆ సంస్థ చాలా కఠినమైన నియమాలను అమలు చేస్తుంది. అందుకే ప్రతినాయక పాత్రధారుల వద్ద ఐఫోన్ లాంటి యాపిల్ ఉత్పత్తులు ఉండడాన్ని ఏ మాత్రం ఒప్పుకోదు."
- రియాన్ జాన్సన్, హాలీవుడ్ దర్శకుడు
రియాన్ తాజా చిత్రం 'నైవ్స్ అవుట్' చిత్రంలో ఐఫోన్ ఉపయోగించడానికి యాపిల్ అనుమతి ఇచ్చింది. అయితే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు తమ ఉత్పత్తులు వాడుతున్నట్లు చిత్రీకరించడానికి వీలులేదని స్పష్టం చేసింది.
గుడ్ విల్ పోకూడదు కదా!
పరిశ్రమలో తన ఖ్యాతి, గుడ్విల్ ఎప్పుడూ అలానే కొనసాగాలని యాపిల్ కోరుకుంటూ ఉంటుంది. యాపిల్ విధానాల ప్రకారం, 'తమ ఉత్పత్తులను ఎప్పుడూ సానుకూల రీతిలో చూపించాలి. ఇది కంపెనీ ప్రతిష్ఠను మరింత పెంచుతుంది. అలా కాకుండా దర్శకుడు... విలన్ పాత్రధారులు యాపిల్ ఉత్పత్తులు వినియోగిస్తున్నట్లు చూపించాడు అనుకుందాం. అది వినియోగదారుల మనసుల్లో సంస్థ పట్ల చెడు అభిప్రాయాన్ని సృష్టిస్తుంది.'
అందుకే హాలీవుడ్ సినిమాల్లో హీరో లేదా మంచి వ్యక్తులు అనుకునే పాత్రధారులు మాత్రమే ఐఫోన్ లాంటి యాపిల్ ఉత్పత్తులు ఉపయోగిస్తారు. ప్రతినాయక పాత్రలకు, చెడు పాత్రలకు మాత్రం ఆ అవకాశం ఇవ్వరు.
విలన్ను ఇట్టే గుర్తు పట్టేయండి!
విషయం తెలిసింది కదా! ఇకపై మీరు మిస్టరీ, సస్పెన్స్ సినిమాలు, టీవీ షోలు చూస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఏ పాత్రధారి అయినా ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ ఉపయోగిస్తుంటే, అతనే విలన్ అని సులభంగా గుర్తు పట్టేయండి.
ఇదీ చూడండి: ఈ కారు నడపడానికి మీకు లైసెన్స్ అవసరం లేదు!