ప్రముఖ హిందీ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ తన కుమార్తె విషయంలో ప్రధాని నరేంద్రమోదీ సాయం కోరారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా గెలిచిన సందర్భంగా అనురాగ్.. మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో మోదీ అనుచరులు అని చెప్పుకొంటూ తిరిగే కొందరు వ్యక్తులు తన కుమార్తె జీవితాన్ని నాశనం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అనురాగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
'చౌకీదార్ రామ్‌సంఘి' అనే ట్విటర్ ఖాతాలో అనురాగ్ కుమార్తె ఫొటోను షేర్ చేస్తూ.. 'మీ నాన్నకు చెప్పు. మరోసారి మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే నీ ముఖాన్ని మరెవ్వరూ చూడకుండా చేస్తాం' అని బెదిరించారు. ఆ ట్విటర్ ఖాతాలో ఇద్దరు యువకుల ఫొటోలు కూడా ఉన్నాయి. అనురాగ్ ఈ ట్వీట్‌ను గుర్తించి మోదీకి ట్యాగ్ చేశారు.
"నరేంద్రమోదీ సర్... మీరు ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు. మీ అనుచరులు అని చెప్పుకొంటూ కొందరు నా కుమార్తెను బెదిరిస్తున్నారు. నేను మీకు వ్యతిరేకినని నా కుమార్తెను లక్ష్యంగా చేసుకున్నారు. ఇలాంటివారిని దయచేసి ఎలా ఎదుర్కోవాలో చెప్పండి."
-- అనురాగ్ కశ్యప్, బాలీవుడ్ దర్శకుడు