అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మకంగా అందజేసే ఏఎన్నార్ జాతీయ పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మెగాస్టార్. ఏఎన్ఆర్, శ్రీదేవి, రేఖ గురించి తన అభిప్రాయాలను వెలిబుచ్చారు.
ఏఎన్ఆర్ గురించి మెగాస్టార్ మాటల్లో..
'అక్కినేని నాగేశ్వరరావు గారితో ‘మెకానిక్ అల్లుడు’ కోసం నటించా. అది నాకు అద్భుత జ్ఞాపకం. ఆయనంటే నాకు ఎంత ఇష్టమో అప్పుడే చెప్పా. నన్ను ఇంటికి రమ్మని పిలిచేవారు. చాలాసార్లు ఇంటికి వెళ్లా. ఆయన చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. నటనపరంగా ఆయన నడిచే నిఘంటువు. ఆయన మానసికంగా, శారీరకంగా చాలా బలమైన వ్యక్తి. అది నాకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన ఆఖరి రోజుల్లో వ్యక్తిగతంగా వెళ్లి మాట్లాడేవాడిని. అది నా అదృష్టం’.
‘మనం ప్రాణాలతో ఉన్నా, లేకపోయినా మన పేరు చిరస్థాయిగా ఉండాలని నాగేశ్వరరావు గారు ఈ అవార్డు పెట్టారు. ఈ రోజుకీ ఆ అవార్డు ఇస్తున్నాం. ఇది ఏదో ఒక రోజుకి దాదా సాహెబ్ ఫాల్కే వంటి గొప్ప అవార్డు అవుతుందని ఆశిస్తున్నా. నాగార్జున ఆయన తండ్రి జ్ఞాపకాల్ని సజీవంగా ఉంచుతారు. ఆయన మన మనసుల్లో ఎప్పుడూ ఉంటారు. నాగేశ్వరరావు గారు పై నుంచి ఇది చూస్తుంటారు. అలాంటి ఆయన అవార్డును నేను ప్రదానం చేయడం నా అదృష్టం. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగార్జున కుటుంబానికి ధన్యవాదాలు. మన భారతదేశం, ప్రత్యేకించి దక్షిణ భారతదేశం గర్వించదగ్గ నటీమణులు శ్రీదేవి, రేఖ. వారికి ఈ అవార్డు ఇవ్వడం, వారిని సన్మానించడం మనకు గర్వకారణం’ అని చిరు పేర్కొన్నారు.
శ్రీదేవి గురించి..
దేశం గర్వించే నటీమణులు శ్రీదేవి, రేఖ. సినిమా ధ్యాస తప్ప శ్రీదేవికి మరేదీ తెలియదు. శ్రీదేవి ఎప్పుడూ సినిమాల గురించే ఆలోచించేవారు. అన్ని భారతీయ చిత్రాల్లో నటించిన ఘనత శ్రీదేవిదే. నిజంగా శ్రీదేవి లేడీ సూపర్‌స్టార్.
రేఖ గురించి ...
నేను ఆరాధించే నటీమణుల్లో రేఖ ఒకరని స్పష్టం చేశారు చిరంజీవి. అభిమాన నటీమణి రేఖ అని వెల్లడించారు. నా ఆరాధ్య నటి రేఖ పేరుతో నా భార్య సురేఖను పిలుస్తుంటానని అన్నారు చిరంజీవి.
ఇదీ చూడండి:భారత్‌లోనే టాప్-1 సాంగ్ 'రౌడీబేబీ'