లేడీ సూపర్‌స్టార్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ నయనతార. ప్రస్తుతం ఈమె సూపర్‌స్టార్ రజనీకాంత్ 'అన్నాత్త'లో ఓ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా కోసం తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకుందట నయన్. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అందుకు గల కారణాలను ఓ నిర్మాణ సంస్థ ప్రతినిధి వెల్లడించారు.
"సాధారణంగా రూ.4కోట్లు పారితోషికంగా తీసుకునే నయన్ 'దర్బార్' కోసం రూ.5.5కోట్లు తీసుకుంది. ఆ సినిమాను నిర్మించింది లైకా ప్రొడక్షన్స్. అది ఒక కార్పొరేట్ సంస్థ.. అందుకే పెద్దమొత్తం ఇచ్చేందుకు ఒప్పుకుంది. అయితే 'అన్నాత్త'ను నిర్మిస్తోంది సన్ పిక్చర్స్. తమిళనాడుకు చెందిన ఈ ప్రాంతీయ సంస్థ అంత ఎక్కువ మొత్తం ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ కారణంతో ప్రాజెక్టును వదులుకోవడం ఇష్టం లేని నయన్.. గత చిత్రం కంటే తక్కువ రెమ్యురేషన్ తీసుకునేందుకు సిద్ధమైంది. అది ఎంత మొత్తమనేది మాత్రం తెలీదు"
-నిర్మాణ సంస్థ ప్రతినిధి
గతేడాది 'సైరా','బిగిల్' వంటి సినిమాల్లో నటించిన నయన్.. ఈ ఏడాదిలో 'దర్బార్'లో రజనీ సరసన కనిపించింది. ఇప్పుడు అతడితోనే మరోసారి జోడీ కట్టింది.
ఇదీ చూడండి : అత్యాచారం వల్లే బయటకు రాలేకపోయా: పాప్ గాయని