కొన్నిరోజుల క్రితం కరోనా బారినపడ్డ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. ముంబయిలోని నానావతి ఆస్ప్రతిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా అక్కడ తన పరిస్థితి ఎలా ఉందో చెబుతూ బ్లాగ్‌లో రాసుకొచ్చారు. ఒంటరిగా గదిలో ఉండటం మానసిక స్థితిపై ప్రభావం చూపుతోందని చెప్పారు.
"రాత్రిపూట ఒంటరిగా ఉన్న నేను చలికి వణికిపోయాను. నిద్రలోకి జారుకుంటూ పాటలు పాడాను. ఆ సమయంలో నా చుట్టూ ఎవరూ లేరు" అని అమితాబ్ తెలిపారు.
అలానే కొవిడ్ బాధితుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో? తన అనుభవాల నుంచి వెల్లడించారు.
"ఐసోలేషన్ వార్డులో రోగి దగ్గరికీ ఎవరూ రారు. డాక్టర్లు, నర్సులు వచ్చినా వారు పీపీఈ కిట్లు ధరిస్తారు. వారెవరో కూడా మనకు తెలియదు. ముఖాలు కనిపించవు. ఒక్కోసారి రోబోల్లా అనిపిస్తారు. ఎక్కువసేపు ఉంటే వైరస్ సోకుతుందేమోనని, వచ్చిన కొద్దిసేపటికే వెళ్లిపోతారు. ఎక్కువగా వీడియో కాల్‌లోనే మాట్లాడుతూ బాధితులకు ధైర్యం చెబుతారు. ప్రస్తుతం ఇదే మంచి మార్గం" అని బిగ్‌బీ చెప్పారు.