అమితాబ్ బచ్చన్ కరోనా వైరస్‌తో చనిపోతాడన్న ప్రచారంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ దిగ్గజ నటుడు చికిత్స పొందుతున్న ఆస్పత్రి నుంచే విషప్రచారంపై బహిరంగ లేఖలో స్పష్టతనిచ్చారు. తన మరణాన్ని కోరుకుంటున్న వారి కోసం ప్రత్యేకంగా ఓ నోట్ రాశారు. 'నేను కొవిడ్‌తో చనిపోతానని వారు నాకు తెలియజేస్తున్నారని అనుకుంటున్నా' అని అందులో పేర్కొన్నారు అమితాబ్.
"హే.. మిస్టర్ అనామకుడా.. నీ గురించి తెలియడానికి నువ్వు కనీసం మీ తండ్రి పేరైనా రాయలేదు.. కానీ, రెండు విషయాలు మాత్రం జరగవచ్చు. నేను బతకవచ్చు లేదా చనిపోవచ్చు. ఒకవేళ నేను చనిపోతే నన్ను దూషించడానికి నీకు పని దొరకదు. ఓ ప్రముఖుని పేరు మీద ఇలా వార్తలు సృష్టించడం వల్ల నీపై నాకు జాలేస్తోంది. నీ ప్రచారం కోసం అమితాబ్‌ను వాడుకుంటున్నావు. దేవుని దయ వల్ల బతికితే నేను కాదు.. 9 కోట్ల నా ఫాలోవర్ల తాకిడిని నువ్వు తట్టుకోలేవు. ఈ విషయాన్ని వారికింకా తెలియపరచలేదు. కానీ నేను బతికితే నీ మీద వారికి కోపం తెప్పించే విధంగా చేస్తా. ప్రపంచం మొత్తంలో పశ్చిమం నుంచి తూర్పు వరకు.. ఉత్తరం నుంచి దక్షిణం వరకు నిన్ను వెతుకుతారు. నా నుంచి ఓ ప్రకటన వచ్చిన తర్వాత.. నాకున్న అనుచరగణం నీ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తుంది".
-అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ దిగ్గజ నటుడు
తన మనవరాలు ఆరాధ్య, కోడలు ఐశ్వర్యా రాయ్ బచ్చన్లను ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత బిగ్‌బీ ఓ ఎమోషనల్ నోట్ రాశారు. ఆరాధ్య తనను ఏడవొద్దని కోరినట్లు అందులో పేర్కోన్నారు. తాను త్వరలోనే పూర్తిగా కోలుకుని ఇంటికి తిరిగి వస్తారని ఆరాధ్య చెప్పినట్లు వెల్లడించారు. ప్రస్తుతం అమితాబ్, అభిషేక్ బచ్చన్ ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.