'ఏబీసీడీ' చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్... చిత్రం కోసం బాగా కష్టపడి ప్రయత్నించినా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని నోట్ విడుదల చేశాడు. మలయాళ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేదని చెప్పాడు.
"పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ ప్రత్యేకమైన రోజున మీ అందరి ప్రేమాభిమానాలు దక్కినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ‘ఏబీసీడీ’కి దర్శకత్వం వహించిన సంజీవ్ రెడ్డితో పాటు సినిమాకు పనిచేసినవారంతా మీకు వినోదాత్మక సినిమా అందించాలని ఎంతో కష్టపడ్డారు. కానీ మీరు ఆశించినంత స్థాయిలో సినిమా ఆడలేదు. ప్రేక్షకుల తీర్పును నిజాయితీగా స్వీకరిస్తాను. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన నిర్మాతలు శ్రీధర్, యశ్‌లకు ధన్యవాదాలు. సినిమాను వీక్షించి, మీకు మరో వినోదాత్మక సినిమాను అందించే అవకాశం ఇచ్చిన ప్రేక్షకులకు, నా స్నేహితులు, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు. ఇలాగే కష్టపడి మీ ముందుకు మంచి సినిమాలతో వస్తానని మాటిస్తున్నాను"
--అల్లు శిరీష్, కథానాయకుడు
ఫ్లాప్ సినిమాలకు కూడా సక్సెస్‌మీట్‌లు పెట్టి హడావుడి చేస్తున్న తరుణంలో శిరీష్ స్పందించిన తీరు హుందాగా ఉందంటున్నారు విశ్లేషకులు.