అల్లు అర్జున్ ఎన్నో సినిమాల్లో లవర్‌బాయ్‌గా హీరోయిన్‌తో తొలి చూపులోనే ప్రేమ(లవ్ ఎట్ ఫస్ట్ సైట్)లో పడ్డాడు. అలా హీరోయిన్‌నూ ప్రేమలోకి దింపిన బన్నీది నిజ జీవితంలోనూ ప్రేమ వివాహమనే విషయం చాలామందికి తెలుసు. కానీ.. అసలు అల్లు అర్జున్-స్నేహారెడ్డి మధ్య ప్రేమ ఎలా చిగురించిందనే విషయంతో పాటు బన్నీది తొలి చూపు ప్రేమ అనేది చాలా మందికి తెలియని విషయం. మార్చి 6న ఈ జంట ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్ వేదికగా పదో వార్షికోత్సవం చేసుకుంది.

చాలామంది సెలబ్రిటీల్లా అల్లు అర్జున్-స్నేహ జంటకు చిన్ననాటి పరిచయం లేదు. కట్ చేస్తే.. అమెరికాలో జరుగుతున్న ఒక శుభాకార్యానికి బన్నీ వెళ్లాడు. హీరో వెళ్లిన తర్వాత హీరోయిన్ రావాలి కదా.. అనుకోకుండా స్నేహారెడ్డి కూడా సరిగ్గా ఆ వేడుకకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక స్నేహితుడు బన్నీకి స్నేహను పరిచయం చేశాడు. అక్కడే మనోడి బ్యాచ్‌లర్ లైఫ్‌కు బైబై చెప్పేందుకు కౌంట్‌డౌన్ మొదలైంది. తొలిచూపులోనే స్నేహతో ప్రేమలో పడ్డాడు బన్నీ.

ఆ విషయాన్ని మాత్రం ఆమెకు చెప్పలేదు. ఆ శుభకార్యం తర్వాత మళ్లీ వాళ్లద్దరూ మాట్లాడుకుంది లేదు. కానీ.. బన్నీ మాత్రం స్నేహను మర్చిపోలేకపోయాడు. దగ్గరి స్నేహితుడు ఒకరు.. 'నీ మనసులోని మాట ఆమెకు చెప్పు' అంటూ ఒత్తిడి తెచ్చాడు. అలా బన్నీ స్నేహకు ఒక మెసేజ్ చేశాడు. అటు నుంచి కూడా స్పందన వచ్చింది. మళ్లీ ఒకసారి కలిసి మాట్లాడుకోవాలని అనుకున్నారు. అలా.. ఒకరి అభిప్రాయాలు ఒకరు అర్థం చేసుకునేందుకు పలుమార్లు కలుసుకొని మాట్లాడుకున్నారు. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

సినిమా హీరో అయితే ఏంటి..?
సినిమా హీరో అయినంత మాత్రాన తన ప్రేమకు అడ్డంకులు రాకూడదా..? ఈ పెద్దలు పిల్లల ప్రేమను అర్థం చేసుకోరు కదా.. ఇద్దరి ఇంట్లోనూ పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ.. బన్నీ-స్నేహ మాత్రం ఒకరినొకరు విడిచి ఉండలేమని చెప్పేశారు. చివరికి పిల్లల ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు దిగి వచ్చారు. కూర్చొని మాట్లాడారు.
అలా.. 2010 నవంబర్ 26న ఘనంగా ఈ జంట నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత మూడు నెలలకు అంటే 2011 మార్చి 6న వివాహ బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీ పెళ్లి మరిచిపోలేనంత వైభవంగా జరిగింది.

ఇప్పుడు ఇలా..
తర్వాత 2014లో ఈ జంట శిశువుకు జన్మనిచ్చింది. అల్లు అయాన్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత మరో రెండేళ్లకు కూతురు పుట్టడం వల్ల బన్నీది పరిపూర్ణమైన కుటుంబంగా మారింది. అల్లువారి ముద్దుల కూతురికి అర్హ అని పేరు పెట్టారు.

ఇప్పుడు.. బన్నీ ఎంత బిజీగా ఉన్నా వీలు కల్పించుకొని మరీ తన కుటుంబంతో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తుంటాడు. తన పిల్లలతో సరదాగా ఆడుకునే దృశ్యాలను సోషల్ మీడియా వేదికగా అందరితోనూ పంచుకుంటాడు. ఇదీ మన బన్నీ ముచ్చట.

ఇదీ చూడండి: మాల్దీవుల్లో దిశా పటానీ.. బికినీతో హల్చల్