కథ పక్కా అయింది. కలయిక కుదిరింది. ఇక ప్రకటనే ఆలస్యం. అల్లు అర్జున్ కథా నాయకుడిగా, కొరటాల శివ దర్శకత్వంలో సినిమాకు రంగం సిద్ధమైంది. ఈ నెల 31న చిత్రాన్ని ప్రకటించబోతున్నారు. బన్నీ చిన్ననాటి స్నేహితులు ముగ్గురు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నట్టు సమాచారం.
అర్జున్ తన స్నేహితుల్ని, బంధువుల్ని తన సినిమాల్లో భాగం చేస్తుంటారు. 'రేసుగుర్రం', 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', 'పుష్ప' సినిమా నిర్మాణంలోనూ ఆయన బంధువులు భాగం పంచుకున్నారు. మరోసారి అదే తరహాలో అవకాశం ఇస్తున్నారు. బన్నీ కోసం కొరటాల శివ ఇటీవలే కథను సిద్ధం చేసి వినిపించినట్టు సమాచారం. అది పక్కా కావడం వల్ల సినిమాను ప్రకటించాలని నిర్ణయించారు.
కొరటాల ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా 'ఆచార్య' సినిమాను తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ త్వరలోనే 'పుష్ప' కోసం రంగంలోకి దిగబోతున్నారు. ఈ రెండింటి తర్వాతే అల్లు అర్జున్ - కొరటాల కలయికలో సినిమా పట్టాలెక్కబోతోంది.