హాస్యానికి హీరోయిజాన్ని తెచ్చిపెట్టిన నటుడు రాజేంద్రప్రసాద్. ఆ తర్వాత కామెడీకి ఆ స్థాయి హీరోయిజాన్ని తెచ్చిపెట్టారు టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లరి నరేష్. నేడు ఇతడు 38వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.
నరేష్ తెరపై కనిపించారంటే చాలు ప్రేక్షకులకు కితకితలు గ్యారెంటీ. తొలి చిత్రం 'అల్లరి'తోనే కడుపుబ్బా నవ్వించి, దానిని తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. 14 ఏళ్ల వ్యవధిలోనే యాభై సినిమాల మైలురాయిని అందుకున్నారు. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని నవ్వించడం అల్లరి నరేష్ శైలి. కాకపోతే ఇటీవల కాలంలో కొంచెం జోరు తగ్గించారు.
కామెడీలోనే కాదు... 'నేను', 'డేంజర్', 'ప్రాణం', 'గమ్యం', 'శంభో శివ శంభో', 'లడ్డూబాబు' తదితర చిత్రాల్లో తనలోని మరో కొత్త కోణాన్ని చూపించి మెప్పించారు. 'సుడిగాడు'లో ఆయన పంచిన వినోదం పతాకస్థాయిలో ఉంటుంది. ఇటీవల విడుదలైన 'మహర్షి'లో మహేశ్‌బాబుతో కలిసి సందడి చేశారు నరేష్. ఇందులో రవి పాత్రతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
దర్శకుడు కావాలనుకుని నటుడై
అగ్ర దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ రెండో కుమారుడైన అల్లరి నరేష్.. తొలుత దర్శకత్వ శాఖలో పనిచేశారు. అయితే ఇతడు నటుడు అవుతారని ఇంట్లో ఎవరూ ఊహించలేదు. తండ్రి బాటలోనే దర్శకుడు కావాలనుకున్నాడు కానీ, అనుకోకుండా 'అల్లరి'లో నటించే అవకాశం వరించడం. తొలి చిత్రమే ఘనవిజయం సాధించడం వల్ల అలా నటుడిగా స్థిరపడిపోయారు. 'అల్లరి'కి రీమేక్‌గా తమిళంలో తెరకెక్కిన 'కురుంబు' చిత్రంలోనూ నటించారు నరేష్.
'గమ్యం'లో చేసిన గాలిశీను పాత్రకుగానూ ఉత్తమ సహయ నటుడిగా నంది పురస్కారాన్ని, ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని సొంతం చేసుకొన్నారు నరేష్. తన తండ్రి పేరుతో స్థాపించిన ఈవీవీ సినిమా పతాకంలో సోదరుడు ఆర్యన్ రాజేష్‌తో కలిసి 'బందిపోటు' నిర్మించారు. 2015లో విరూపతో వివాహమైంది. ప్రస్తుతం ఈయనకు ఓ పాప ఉంది.
త్వరలో 'నాంది' సినిమాలో వైవిధ్యమైన పాత్ర పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు నరేష్. ఇప్పటికే విడుదలై ఫస్ట్‌లుక్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇది చూడండి : నరేశ్ 'నాంది'లో కీలక పాత్రలు ఇవే