మీరు తెలుగు మాట్లాడతారా? అసలు ఎన్ని భాషలు వచ్చు.
ముమైత్: అవును.. మీకు తెలియదా నా గురించి (నవ్వులు). కొంచెం కొంచెం హిందీ, ఇంగ్లీష్.. ఇప్పుడు తెలుగు తెలుసు. తమిళ్ అర్థమవుతుంది. మా అమ్మ తమిళయన్. సౌత్ ఇండియన్ ముస్లిం. అమ్మ తరఫు కుటుంబం ఎక్కువగా తమిళ్‌లోనే మాట్లాడతారు. అలా కొద్దిగా తెలుసు.
అమ్మ చెన్నై.. మరి నాన్న?
ముమైత్: అది చెప్పాలంటే చాలా భయంగా ఉంది (నవ్వులు). నాన్న కుటుంబమంతా పాకిస్థాన్‌లో ఉండేది. మైగ్రేషన్ సమయంలో ఇండియాకు వచ్చారు.
మరి మీ తల్లిదండ్రులు ఎలా కలిశారు?
ముమైత్: ముంబయిలోని కుర్లా ప్రాంతంలో ఉన్నప్పుడు అమ్మానాన్న ఇరుగుపొరుగు వాళ్లు. అలా పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు వివాహం చేసుకున్నారు.
మీరు ఎంతమంది పిల్లలు?
ముమైత్: ఫస్ట్ అక్క. నాకంటే పది సంవత్సరాలు పెద్దది. తర్వాత మరో అక్క జబైన్ పుట్టింది. ఆ తర్వాత నేను.
'పోకిరి' తర్వాత మీకు ఏం అనిపించింది?
ముమైత్: నా 13 ఏళ్ల వయసులో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టా. ఆ స్థాయి నుంచి ఇంత దూరం వస్తానని ఎన్నడూ ఊహించలేదు. 'నేను ఎప్పటికైనా గొప్ప డ్యాన్సర్ అవ్వాలి' అని ఎప్పుడూ అనుకోలేదు. తెలిసిన పనిచేయడం, డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్లడం. ఇదే నా ధ్యాస. నాకు పేరొస్తుందా? లేదా? అనే ఉద్దేశం లేదు. 'పోకిరి' అప్పుడు కూడా పనిచేశాను తప్ప ఫలితం ఏమవుతుందో పట్టించుకోలేదు. అలాగే పనిచేసుకుంటూ వెళ్లా. నాకు 17 ఏళ్లు ఉండగానే 'మున్నాభాయ్' కోసం ఆడి పాడా. నాన్న మాత్రం ఒక్క మాట చెప్పారు. 'చట్నీ రోటీబీ ఖాయేనా అప్నే ఘర్ కా రాజారాణి' అదే నేను ఇప్పటికీ అనుసరిస్తున్నా.
స్టార్ డ్యాన్సర్ అయిన తర్వాత గర్వం పెరిగిందనుకుంటున్నారా?
ముమైత్: లేదు (నవ్వులు). రాలేదు. నేను సాధారణ వ్యక్తిని. నా పర్సనాలిటీ చూసి పబ్లిక్ హే ముమైత్ ఖాన్ అంటారు కానీ లోపల అలా గర్వంగా ఉండలేను.
డ్యాన్స్ ఎక్కడ నేర్చుకున్నారు?
ముమైత్: నాకు చిన్నతనం నుంచి టీవీలో చూసి డ్యాన్స్ చేయడం అలవాటు. 8వ తరగతి ఫెయిల్ (నవ్వులు). అప్పుడు అక్క ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. కాలేజీలో వేడుక ఉండటం వల్ల కొరియోగ్రఫీ చేయాలని అడిగింది. సరే అన్నా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మీ గురువు ఎవరు?
ముమైత్: నా గురువు రెమో(ఏబీసీబీ చిత్ర దర్శకుడు). రెమో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా ఉన్నప్పుడు ఓ షో చేశారు. ఆ కార్యక్రమానికి గర్ల్ డ్యాన్సర్లు కావాలి. అక్క కాలేజీలో నేను చేసిన డ్యాన్స్ చూసి సంప్రదించారు. అక్క, నేనూ వెళ్దామనుకున్నాం కానీ ఇంట్లో చెబితే అమ్మ కచ్చితంగా కొడుతుందనిపించింది. అప్పుడు ఇంట్లో ఆర్థికంగా సమస్యలు ఉండేవి. 'పని చేసినందుకు డబ్బులిస్తారు ఆ తర్వాత టీవీలో కనిపిస్తాం' అని నచ్చజెప్పాం. 'ఈ ఒక్కసారికే వెళ్లండి. తర్వాత ఇంకెప్పుడు వద్దు. నాన్నకి తెలిస్తే తిడతారు' అంది అమ్మ. సరే అని వెళ్లాం. నా తొలి సంపాదన రూ.750. ఆ మొత్తాన్ని అమ్మకే ఇచ్చేశా. నా కెరీర్ అలా మొదలైంది. బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా చేయాలంటే చాలా కష్టం. నటుల ముందు, వెనుక పొజిషన్ చాలా ముఖ్యమైంది. ఆ స్థానంలో నృత్యం చేయడం చాలా కష్టం. అది కరెక్ట్‌గా చేస్తే మంచి డ్యాన్సర్ అనిపించుకుంటారు. అలా ఆరు నెలల్లోనే నటుల ముందు వరసలో నిలబడే స్థానం సంపాదించుకున్నాం. రైట్‌లో నేను, లెఫ్ట్‌లో అక్క ఉండేది.
అదే సమయంలో 'మున్నాభాయ్' ఆడిషన్‌కు రమ్మన్నారు. నేను రానని చెప్పా. ఓసారి నేను రిహార్సిల్స్ చేస్తుంటే రాజ్‌కుమార్ హిరాణీ అసిస్టెంట్ సుమ వచ్చారు. అది పూర్తయ్యే వరకు ఆమె నాకోసం వేచి చూశారు. 'సుమ.. నేను మంచి డ్యాన్సర్‌నని నాకు తెలుసు. కానీ, ఆడిషన్ నాకు తెలీదు' అన్నాను. 'అలా కాదు.. అర్థం చేసుకో' అంది సుమ. ఆమె ఓ లొకేషన్‌కి తీసుకెళ్లింది. బ్లాక్ షార్ట్, సిల్వర్ టాప్ ఇచ్చారు. 'ఇప్పుడేం చేయాలి' అని అడిగాను. ఓ పాట వినిపించి డ్యాన్స్ చేయమన్నారు. వెంటనే చేశా. మూడు రోజుల తర్వాత వాళ్ల నుంచి ఫోన్ వచ్చింది. మీరు ఎంపికయ్యారని! అది కూడా నాకు ఎగ్జైట్‌మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే అప్పుడు నాకు డబ్బే ప్రధానం (నవ్వులు). ఎంత డబ్బు వస్తుంది? ఇదే ఆలోచన. ఆ పాట చేసినందుకు రూ.30వేలు ఇచ్చారు.
తెరపై మీ గ్లామర్ చూసి కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి ఎలాంటి స్పందన ఉండేది? పాజిటివ్‌గా తీసుకునేవారా, నెగిటివ్‌గానా?
ముమైత్: అంతా పాజిటివ్. నాకు స్నేహితులు లేరు, శత్రువులు లేరు ఎందుకంటే నేను కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. ఇతరులు ఏం చెప్తారు? ఏం చేస్తారు అనేది నేను పట్టించుకోను. నా గురించి ఎవరేమనుకున్నా నేను ఇదీ అని నా గురించి వాళ్లకు వివరించను. ఓ మనిషిగా నేనేంటో నాకు తెలుసు.
తలకు దెబ్బ తగిలిందట. అసలు ఏం జరిగింది?
ముమైత్: 2016లో జరిగింది అది. 2015లో బాలకృష్ణగారి 'డిక్టేటర్'లో ఓ పాట చేశా. ఆ చిత్రీకరణ డిసెంబరు 27న ముగిసింది. ఆ తర్వాత గోవాకి వెళ్లా. నాకు పుట్టిన రోజు, న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం ఇష్టం ఉండదు. కానీ, ఆ సమయంలో ఎందుకో అక్కడికి వెళ్లాలనిపించి అమ్మతో చెప్పి బయలుదేరాను. డిసెంబరు 29న తిరిగి ఇంటికి వచ్చేశాను. డిసెంబరు 31న ఇంట్లోనే ఉన్నాను. స్నానం చేసి వచ్చి, అద్దంలో చూసుకుంటుండగా 'మేరే ఖ్వబాన్' (దిల్‌వాలే దుల్హానియా జాయేంగే) పాట గుర్తొచ్చింది. అలా పరధ్యానంలో ఉండటం వల్ల మార్బుల్ ఫ్లోర్‌పై జారిపడ్డాను. పక్కన ఉన్న మంచం కోణం నా తలకు తగిలి పెద్ద గాయమైంది. తర్వాత ఏమైందో కూడా నాకు తెలీదు లేచి చూస్తే ఆసుపత్రిలో ఉన్నాను. 15 రోజులు కోమాలో ఉన్నానట! అమ్మానాన్న చెప్పారు. తలకు సంబంధించిన ఐదు నరాలు డ్యామేజ్ అయ్యాయి. ఇలాంటి శస్త్ర చికిత్స పెద్ద వయసు వారికే ఎక్కువగా జరుగుతుంది. నాకు తెలిసి తక్కువ వయసులో ఈ ఆపరేషన్ జరిగిన వ్యక్తిని నేనే కావొచ్చు. ప్రస్తుతం నా బ్రెయిన్‌లో 9 టైటానియం తీగలున్నాయి. వైద్యులు నేను బతికేందుకు 20 శాతం మాత్రమే అవకాశం ఉందని చెప్పారు. అమ్మ బాగా ఏడ్చేసింది. నాకు ఆ సమయంలో అనిపించింది ఒక్కటే. 'నేను ఏదైనా సాధించాలి' చిత్ర పరిశ్రమలో ఉన్నా, లేకపోయినా. ఆపరేషన్ తర్వాత చాలా కష్టంగా అనిపించింది. డిప్రెషన్ ఉంటుందని డాక్టర్లు చెప్పారు. కానీ, నాకు విల్ పవర్ ఎక్కువ. లైట్ తీసుకునేదాన్ని. ఈ విషయం ఎక్కడా చెప్పలేదు. మొదటిసారి మీతో చెబుతున్నా.
డాక్టర్లు 3 సంవత్సరాలు విశ్రాంతి తీసుకోమంటే, 3 నెలల్లో పని మొదలుపెట్టావ్..!
ముమైత్: అవును. అలా అయిపోయింది. ప్రమాదకరమైన స్టంట్స్ కూడా చేశాను. అక్కడి నుంచి ఆలోచించడం మొదలు పెట్టా. అసలు నేను పరిశ్రమకు ఎలా వచ్చాను? దేవుడు నాకు ఏం ఇచ్చాడు? జ్ఞానం, మంచి పేరు, డబ్బు.. అంతా బాగానే ఉన్నా నాకు ఎందుకిలా జరుగుతోంది?ఇలా ఒకటే ఆలోచనలు. నేను అల్లాని అడుగుతున్నా.. సమస్యలు ఇచ్చినా స్వీకరిస్తాను కానీ, దాన్ని దాటే మార్గం చూపించమని మాత్రం అడుగుతా. దాని కోసం కష్టపడతా. (ఏడుస్తూ..) నేను ఎవరికీ హాని చేయలేదు. మోసం చేయలేదు. తప్పుచేయలేదు, అబద్ధం ఆడలేదు. నా జీవితానికెందుకు అప్పుడే ఫుల్‌స్టాప్. జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఆలీ మీరు నాకు మలేషియాలో ఓ మాట చెప్పారు. ఆర్టిస్ట్ అంటే హార్ట్ బీట్. పైకి వెళ్లాలి.. కిందికీ రావాలి. అలా అని పని మానేయకూడదు. పని చేయాల్సిందే. ఆ మాటే నాలో స్ఫూర్తినింపింది.
ఇంతకీ నువ్వు అమ్మాయివా, అబ్బాయివా?
ముమైత్: నేను రెండు (నవ్వులు). పని చేసేటపుడు అబ్బాయిని, పని పూర్తయ్యాక అమ్మాయిని.
ఏంటీ? ఈ మధ్య ఎవరినో కొట్టారట?
ముమైత్: (నవ్వులు ). ముంబయిలో ఓసారి పబ్‌లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి ముమైత్ ఖాన్ అంటూ నన్ను పట్టుకున్నాడు. నేను కిందికి వచ్చి నా కారులోని బేస్‌బాల్ బ్యాట్ తీసుకుని పైకి వెళ్లాను. అప్పటికే అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఓసారి స్నేహితురాలితో విమాన ప్రయాణం చేస్తున్నపుడు కూడా ఇలానే జరిగింది.
పెళ్లెప్పుడు చేసుకుంటున్నారు?ఏమైనా ఆలోచనలు ఉన్నాయా?
ముమైత్: మీక్కూడా చెప్పాను కదా ఎన్‌ఆర్‌ఐని చూడమని. నాకు అబ్బాయి కావాలి కానీ, డాడీ వద్దు (నవ్వులు). పెళ్లి చేసుకుని అమ్మాయి తల్లి అవుతుంది.. అబ్బాయి నాన్న అవుతాడు ఈ రిలేషన్ నాకు వద్దు. అందుకే నేను ఆలోచిస్తా. నాకు గౌరవం ఇవ్వాలి, కలివిడిగా మెలగాలి, ప్రోత్సహించాలి, మోటివేట్ చేయాలి, సపోర్ట్ చేయాలి. అది చాలు ప్రపంచాన్నే గెలుస్తా.
మీ ప్రవర్తన వల్ల కొన్ని అవకాశాలు కోల్పోయారని తెలిసింది నిజమేనా?
ముమైత్: అది నిజం కాదు. కొంతకాలం గ్యాప్ తీసుకుందామనుకున్నా. నేను 27 ఏళ్ల వయసులో ప్రేమించి పెళ్లి చేసుకుని 32 ఏళ్లకు ఇద్దరు పిల్లలతో ఉందామనుకున్నా. మూడేళ్లు రిలేషన్‌లో ఉన్నా అది బ్రేకప్ అయింది.
మరి ఎందుకు అప్పుడు పెళ్లి చేసుకోలేదు?
ముమైత్: ఎందుకంటే 19 ఏళ్లకే పెళ్లైన సోదరి జీవితం చూశాను.
ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మీకు?
ముమైత్: పూరి జగన్నాథ్ నా బెస్ట్ ఫ్రెండ్. తర్వాత ‘తిక్క’ చిత్ర నిర్మాత రోహిణ్ రెడ్డి ఆ తర్వాత మీరు (ఆలీ). అంతే నాకు క్వాలిటీ కావాలి అది మీ దగ్గర ఉంది. అందుకే మీరు ఏది చెప్తే అది వింటాను. ఇంతకు ముందు అడిగారు కదా నేనెందుకు సన్నగా అయ్యానో. నాకు టి.బి. అందుకే బరువు తగ్గాను. దానికి తగిన మందులు వాడాను. రికవరీ అయ్యాను. ఇప్పుడు కొంచెం లావుగా కనిపిస్తుంది కూడా మెడిసన్ వల్లే. మూడు సంవత్సరాల నుంచి మందులు వేసుకుంటున్నాను.
ముమైత్ ఖాన్ ఆర్థికంగా సంతోషంగా ఉందా?
ముమైత్: చాలా సంతోషంగా ఉంది. కష్టపడి పనిచేస్తా. డబ్బులు దాచుకుంటా. నా కోసం ఖర్చుపెట్టుకుంటా. ప్రస్తుతానికి కూర్చుని తినే స్థోమత ఉంది (నవ్వులు).
మహేశ్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్.. ముద్దు పెట్టే అవకాశం వస్తే ఈ ముగ్గురిలో ఎవరికి పెడతావ్.
ముమైత్: ముగ్గురికీ. నేనూ మిమ్మల్ని అడుగుతాను. మీరు వీరిలో ఏ హీరోయిన్‌కు ముద్దుపెడతారు. ముమైత్‌ఖాన్, అనుష్క, సమంత.
ఆలీ: మెయిన్ హీరోయిన్‌ని మర్చిపోయావ్!
ముమైత్: ఎవరు?
ఆలీ: జుబేదా.. నా భార్య
ముమైత్: (నవ్వులు) ఆమెకు నేను చెబుతాలే! మీరు ఎవరికి ముద్దు పెడతారు?
ఆలీ: అనుష్క
ముమైత్: ఎందుకు? నేను ఇక్కడే ఉన్నాగా.
ఆలీ: ఎందుకంటే తను వెరీ నైస్ గర్ల్. అస్సలు గర్వం ఉండదు.
ఇదీ చూడండి: ముమైత్‌ఖాన్ అందుకున్న తొలి జీతం ఎంతంటే?
ఇదీ చూడండి: 15 రోజులు కోమాలో ఉన్నా: ముమైత్‌ఖాన్