ali tho saradaga brahmanandam: ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాస్యనటుడు బ్రహ్మానందం అతిథిగా విచ్చేసి పలు ఆసక్తికర సంగతులను పంచుకున్నారు. సినిమాల్లోకి ఎలా అడుగుపెట్టారు? తన కెరీర్లో ఉన్న ఒడుదొడుకులు, చిరంజీవి-రామానాయుడు-జంధ్యాలతో తనకున్న అనుబంధం ఎలాంటిది? సహా పలు విషయాలను చెప్పారు. అవన్నీ ఆయన మాటల్లోనే..
కన్నెగంటి బ్రహ్మానందం ఎక్కడ పుట్టారు? ఎక్కడ పెరిగారు?
బ్రహ్మానందం: నేను సత్తెనపల్లి మండలం ముప్పాళ్ల సమీపంలోని చాగంటివారిపాలెం గ్రామంలో పుట్టా. ప్రాథమిక విద్య సత్తెనపల్లిలో, గ్రాడ్యుయేషన్ డీఎన్‌ఆర్ కాలేజ్ భీమవరం, ఎంఏ ఆంధ్రా యూనివర్సిటీలో పూర్తి చేశాను. అత్తిలిలో లెక్చరర్‌గా చేసిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చా.
లెక్చరర్స్ అంటే చాలా సీరియస్‌గా ఉంటారు. అలాంటి మీరు హాస్యబ్రహ్మగా ఎదగడానికి కారణం ఎవరు?
బ్రహ్మానందం: 'లెక్చరర్స్ అంటే చాలా సీరియస్‌గా ఉంటారు.. ఫలానా వ్యక్తి ఇలా ఉంటాడు' అన్నది ఒక వ్యక్తి కేడర్‌కు సంబంధించింది కాదు. మనుషులందరికీ ఒకే రకమైన ఎమోషన్స్ ఉంటాయి. కమెడియన్‌ను లాగిపెట్టి కొట్టినా నవ్వుతూ ఉండడు కదా! 'ఏంట్రా కొడతావ్.. బ్రెయిన్ పనిచేయటం లేదా' అంటాడు. 'అదేంటి మీరు కమెడియన్ కదా! కోపమెలా వస్తుంది' అనడానికి లేదు. లెక్చరర్‌గా ఉన్నప్పుడు అది కాలేజ్ వరకూ మాత్రమే. బయటకు వచ్చిన తర్వాత అతడి నిజమైన వ్యక్తిత్వం కనపడుతుంది. సాధారణంగా కొందరు తమ శరీరతత్వం బట్టి పక్కన ఉన్న వాళ్లను నవ్వించటం అలవాటు అవుతుంది. లెక్చరర్ నుంచి బయటకు వస్తే, అందరితో కలిసి నవ్వుకోవడమే!
మనం ఎక్కడ కలిశామో గుర్తుందా?
బ్రహ్మానందం: చెన్నైలోని ఒక కాలేజ్ గ్రౌండ్‌లో 'చంటబ్బాయి' సినిమా షూటింగ్ జరుగుతోంది. అప్పుడు అల్లు రామలింగయ్యగారితో కలిసి చేసే సీన్‌లో ఆయనే నిన్ను నాకు పరిచయం చేశారు. ఆ తర్వాత చిరంజీవిగారు ఉన్నప్పుడు కలిశాం. (మధ్యలో ఆలీ అందుకుని, చెన్నైలో ఉండగా, ఎదురెదురు ఇళ్లలో ఉండేవాళ్లం. స్టార్స్ అయ్యాక ముందు ఇల్లు మీది, వెనుక ఇల్లు నాది అయింది. చెన్నైలో మిమ్మల్ని చూద్దామని వస్తే కనిపించేవారు కాదు. మూడు షిప్ట్‌ల్లో తీరిక లేకుండా షూటింగ్‌లకు వెళ్లేవారు. 'యమలీల' తర్వాత ఆలీకి దిష్టి తగిలిందని వదినతో చెప్పి నాకు ఒక నల్ల రాయి పొదిగిన రింగ్ ఇచ్చారు. ఇప్పటికీ అది నా దగ్గర ఉంది.) ఆలీ ఒక చక్కని కమెడియన్. అయినా కూడా నాకు ఒక పెద్ద ఆర్టిస్ట్‌లా కనిపించడు. 'మాయలోడు' ఆడియో ఫంక్షన్‌లో నువ్వు డ్యాన్స్ చేయటం చూసి, 'యమలీల'లో హీరోగా తీసుకుందామని కృష్ణారెడ్డి, దివాకర్‌బాబు, అచ్చిరెడ్డిలు అనుకున్నారు. అదే విషయమై మా మధ్య చర్చకు రాగా 'ఆలీ మంచి డ్యాన్సర్. హీరో మెటీరియల్ ఉంది. మా కమెడియన్స్‌ను హీరోగా చూపిస్తే, కచ్చితంగా ఆలీ మీ పేరు నిలబెడతాడు' అని అన్నాను. ఆ సినిమా విడుదలై రెండున్నర దశాబ్దాలు దాటిపోయిందంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంత పెద్ద వాళ్లమైపోయాం!
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్లు అవుతోంది?
బ్రహ్మానందం: 1985 ఫిబ్రవరి 1న వెస్లీ కాలేజ్ సికింద్రాబాద్‌లో 'తాతావతార కథ'లో నరేశ్ స్నేహితుడిగా చేశాను. అదే నా మొదటి సినిమా.
జంధ్యాల ఎలా పరిచయం?
బ్రహ్మానందం: నేను టీవీలో ప్రోగ్రామ్‌లు చేస్తున్నప్పుడు రచయిత ఆదివిష్ణు గారు పరిచయం. ఆయనిప్పుడు లేరు. నా భార్య రాంనగర్‌లో ఉండేవారు. డెలివరీ కోసం వాళ్ల అన్నయ్య ఇంటికి వచ్చింది. నేను హాలీడేస్‌లో వచ్చేవాడిని. ఖాళీ సమయంలో ఆదివిష్ణుగారితో కూర్చొని కబుర్లు చెప్పేవాడిని. ఐసీవీఎస్ శశిధర్ నన్ను చూసి 'ఇటీవల డీడీ-8 మొదలైంది. మీరు ఇవన్నీ చేస్తే అందులో రికార్డు చేసుకుంటాం' అన్నారు. అవి జంధ్యాల చూశారు. మీ అందరినీ నవ్వించే శక్తి నా దగ్గర ఉందని గుర్తించిన వ్యక్తి జంధ్యాలగారు. ఆ తర్వాత నా బతుకు మీకు తెలిసిందే!
మీరు నవ్వించగలగడానికి కారణం జంధ్యాల కలమా? మీ కామెడీ టైమింగా?
బ్రహ్మానందం: ఏ కమెడియన్ నటించినా, నవ్వించినా ఆ క్రెడిట్ అంతా దర్శకులకే చెందుతుంది. కొన్ని మనం చెప్పినప్పుడు బాగా ఉండవచ్చు. ఓవరాల్‌గా సినిమా ఎలా ఉంటుందని ఊహించి మైండ్‌లో పెట్టుకునే వ్యక్తి దర్శకుడు. అందుకే ఆ క్రెడిట్ వాళ్లకే చెందుతుంది. కామెడీ అంటే జంధ్యాలగారు.. నవ్వించటం అంటే జంధ్యాలగారు.. నవ్వును పెన్నులో పుట్టించటం అంటే జంధ్యాలగారు.. పెన్ను ద్వారా నవ్వులతో డ్యాన్స్‌లు చేయించాడు. సర్కస్‌లు చేయించాడు. బ్రహ్మానందం, ఆలీ, సుత్తివేలు, సుత్తి వీరభద్రరావు.. వీరందరితోనూ కామెడీ చేయించి పండించిన వ్యక్తి జంధ్యాల. ఒక్క మాటలో చెప్పాలంటే సినీ పరిశ్రమలో హాస్య వ్యవసాయం చేసిన వ్యక్తి జంధ్యాల. ఆయన మా గురువు అని చెప్పడానికి గర్వపడతాను. బ్రహ్మానందం నా శిష్యుడు అని చెప్పుకోవడాన్ని ఆయన సంతోషపడేవారు.
సరకులతో పాటు మీనాన్న తాడు కూడా కొనేవారట!
బ్రహ్మానందం: ఊరుకోవయ్యా(నవ్వులు) మేము మొత్తం ఎనిమిది మంది పిల్లలం. అందులో ఇద్దరు ఆడపిల్లలు. ఆరుగురు మగపిల్లలు. అమ్మాయిలను నాన్న కొట్టేవారు కాదు. ఇక ఆరుగురు అబ్బాయిలను కొట్టాలంటే చేతులు నొప్పులు పుడతాయని సరకులతో ఒక చాంతాడు కొని పెట్టేవాడు. 'ఒరేయ్ నాన్న పిలిచాడురా' అని ఎవరైనా అంటే 'ఓహో ఎవర్ని' 'ఐదో నంబరు' ఇక వాడు వెళ్లిన తర్వాత ఆర్‌ఆర్ మ్యూజిక్ తప్ప మరొకటి వినిపించేది కాదు. ఇప్పుడు తెరపై మిమ్మల్ని నవ్వించడానికే మేము ఏడుస్తున్నాం.
నాన్న ఏం చేసేవారు? మీ ఎదుగుదల మీ తల్లిదండ్రులు చూశారు కదా?
బ్రహ్మానందం: వడ్రంగి పని చేసేవారు. పిల్లలకు ట్యూషన్ చెప్పేవారు. బిగినింగ్ స్టేజ్ ఆఫ్ బ్రహ్మానందాన్ని ఆయన చూశారు. ఈ స్థాయి ఎదుగుదల చూడలేదు. సత్తెనపల్లి థియేటర్‌లో అమ్మానాన్నలను కూర్చోబెట్టి 'అహనా పెళ్లంట' సినిమా చూపించా. నాన్నకు దూరం నుంచి సరిగా కనపడేది కాదు. థియేటర్‌లో జనం నవ్వులు విని 'ఏంటిరా ఇంతమందిని ఎలా నవ్విస్తున్నావు' అన్న సంఘటన గుర్తొస్తే తెలియని భావోద్వేగం కలుగుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
లెక్చరర్ అయిన మీరు సెటైర్లు వేయించుకోవటం, తన్నులు తినడం ఏంటి? అని ఎవరూ అడగలేదా?
బ్రహ్మానందం: (నవ్వులు) చాలా మందికి ఉంటుంది. ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. 'నువ్వు లెక్చరర్ అయితే, అక్కడే ఉండు. ఇక్కడకు ఎందుకు వచ్చావు' ఇది మొదటి పాయింట్. 'నేను కాస్త గౌరవమున్న పాత్రలే చేస్తా అంటే.. ఇక కూర్చో అంటారు' ఇది సెకండ్ పాయింట్. సినిమాలో ఒకడు కొడతాడు.. దెబ్బలు తినాలి.. ఎందుకంటే ఎదుటి వ్యక్తి కొట్టేది బ్రహ్మానందాన్ని కాదు. లెక్చరర్‌ను కాదు. పేరు, ప్రఖ్యాతలు ఉన్న నటుడిని అంతకన్నా కాదు. ఒక పెద్ద హీరో కలెక్టర్ పాత్ర చేస్తుంటే, అందులో నేను జూనియర్ ఆర్టిస్ట్‌ను అయితే, సన్నివేశం డిమాండ్ చేస్తే కాళ్లకు దండం పెట్టాల్సి వస్తే పెట్టాలి. 'వాడి కాళ్లకు నేను నమస్కారం చేయటం ఏంటి' అని అనుకోకూడదు. నామీద అభిమానం చూపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మేము దెబ్బలు తింటేనే కదండీ మీరు నవ్వేది. అప్పుడే నేను కామెడీ బాగా చేశానని ప్రొడ్యూసర్స్ వేషాలిస్తారు.
చిరంజీవి ఎలా పరిచయం అయ్యారు?
బ్రహ్మానందం: 'తాతావతారం' తర్వాత 'సత్యాగ్రహం' అనే సినిమాలో చేశా. అందులో గుండు హనుమంతరావు, నేనూ కలిసి చేశాం. ఆ సినిమాను డి.రామానాయుడుగారు చూశారు. ఆ తర్వాత 'అహనా పెళ్లంట'లో కోట శ్రీనివాసరావు పాత్రకు అసిస్టెంట్ కావాలని సుత్తివేలుగారిని అనుకున్నారు. ఆ రోజుల్లో ఆయన చాలా బిజీ. సినిమా ఓపెనింగ్ రోజున సుత్తివేలు రావటం కుదరలేదు. దీంతో రామానాయుడుగారు 'సత్యాగ్రహంలో గుండుతో ఉన్న వ్యక్తి బాగా చేశాడు కదా. అతడిని పెట్టేయండి' అని చెప్పగానే ఈవీవీగారు వెంటనే అత్తిలిలో ఉన్న నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. 'ఈ సినిమా వేషాలు ఉంటాయో ఉండవో ఎందుకొచ్చిన గొడవ' అనే గందరగోళంలో ఉన్నా. అదే సమయంలో ఈ ఫోన్ వచ్చింది. అప్పుడు జంధ్యాల నా తలకు తాడుకట్టి చుట్టూ ఉన్న జుట్టు కత్తిరించమన్నారు. అప్పుడు నేను చేసుకున్న హెయిర్‌స్టైల్‌ను ఇప్పుడు ఫ్యాషన్ అంటూ ఇమిటేట్ చేస్తున్నారు(నవ్వులు). 'చంటబ్బాయ్' షూటింగ్ జరుగుతుండగా జంధ్యాల గారు నన్ను చిరంజీవి గారికి పరిచయం చేస్తూ 'ఈయన బ్రహ్మానందం. కాలేజీ లెక్చరర్ అని చెబుతారండీ. ఎంతవరకూ నిజమో తెలియదు' అని అన్నారు. ఆ తర్వాత నాకు తెలిసిన విషయాలన్నీ సరదాగా చిరుతో చెబుతుంటే 'మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. మీరు మద్రాసు రావాలి. మీరు ఎలా సినిమాల్లో నటించాలో నేను చూసుకుంటా' అని చిరు అన్నారు. అలా మొదటిసారి ఆయనతో కలిసి విమానం ఎక్కా. అసలు చిరంజీవిని చూడటమంటేనే అదొక అనుభూతి. ఇంటికి తీసుకెళ్లి అందరికీ పరిచయం చేశారు. అలా చిరంజీవి, రామానాయుడు, జంధ్యాలగారు నాకు త్రిమూర్తుల్లాంటి వారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
చదువుకున్న రోజుల్లో అందుకున్న మొదటి అవార్డు ఏది?
బ్రహ్మానందం: ఎలిమెంటరీ స్కూల్‌లో ఉన్నప్పుడే మూడు అవార్డులు వరుసగా వచ్చాయి. మొదటి ప్రైజ్ మాయల ఫకీరు, రెండు చెవిటి సుబ్బయ్య, మూడు మొద్దబ్బాయి. ఫ్యాన్సీ డ్రెస్‌లు బాగా వేసేవాడిని. బనియన్, కప్ సాసర్, పెన్ను మూడు ప్రైజ్‌లు ఇచ్చారు. 1968లో కాలేజ్ చదువుతుండగా ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ నరసరావుపేటలో జరిగాయి. మొద్దబ్బాయిగా చేసినప్పుడు మొదటిసారి కప్పు, అవార్డు వచ్చాయి. ఫొటో దిగా. ఇది జరిగి దాదాపు 50 సంవత్సరాలు. నటుడిగా 50 సంవత్సరాలు పూర్తయింది.
నటుడు అయిన తర్వాత ఏ అవార్డు అందుకున్నారు?
బ్రహ్మానందం: 'అహనా పెళ్లంట'లో ఉత్తమ కమెడియన్‌గా వంశీ బర్కిలీ అవార్డు అందుకున్నా. సైరాబాను గారు వేదికపై ఉండగా, దిలీప్‌కుమార్‌గారి చేతుల మీదుగా తొలిసారి అవార్డు అందుకున్నా. నా ఆనందానికి అవధులు లేవు. ఇప్పటికీ అలాగే ఉంది.
ఎవరైనా సన్మానం చేస్తే నేలపై పడుకుంటారట!
బ్రహ్మానందం: చాలా గమ్మత్తైన విషయం. మనం జీవితం తెలిసిన వాళ్లం. పేదరికం, పస్తులు, బాధలు ఉండటం అన్నీ చూశాం. సన్మాన కార్యక్రమానికి వెళ్తే పొగుడుతారు. ఇలాంటి మాటలు విన్నప్పుడు తెలియకుండానే శరీరంలోకి అవి ఎక్కేస్తాయి. అహంకారం వస్తుంది. దానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తా. నాకు సన్మానమై ఇంటికి రాగానే లుంగీ కట్టుకుని, దుప్పటి వేసుకుని నేలపై పడుకుంటా. అది ఇంట్లో వాళ్లకూ అలవాటై పోయింది. నేను సన్మానం నుంచి రాగానే నా ముఖాన లుంగీ, దుప్పటి పడేస్తారు(నవ్వులు) అలా చేయటం వల్ల మనల్ని మనం తెలుసుకోగలుగుతామని నా అభిప్రాయం.
డబ్బుకు చాలా విలువ ఇస్తారట!
బ్రహ్మానందం: ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్లేకాకుండా, ప్రతి ఒక్కరూ డబ్బుకు విలువ ఇవ్వాలి. 'భార్యామూల మిదం గృహం/కృషి మూలమిదం ధాన్యం/ ధనమూలమిదం జగత్’ అన్నారు. అన్నింటికీ డబ్బే. చాలా మందికి డబ్బు విలువ తెలియదని నేను అనను. దాని విలువ తెలుసుకోవటానికి ప్రయత్నం చేయరు. ఇటీవల కరోనా వచ్చింది. చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఎవరు సాయం చేస్తారా? అని ఎదురు చూశారు. ఇదంతా ఎందుకు? నాకు తెలిసి రోజుకు రూ.1,250కన్నా తక్కవకు పనిచేసే టెక్నీషియన్ ఇండస్ట్రీలో ఎవరూ లేరు. అందులో రూ.100 పక్కన పెట్టి వచ్చిన దాంతో సంతృప్తి పడితే, ఏ కష్టకాలం వచ్చినా, ఏ బాధ మనకు వచ్చినా, సాయం కోసం ఎదురు చూడాల్సిన అవసరం రాదు. పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లను మనం చూశాం. రాజనాల, కాంతారావు, సావిత్రిలాంటి మహా నటులు కోట్లాది రూపాయలు సంపాదించారు. చివరికి ఏమీలేని స్థితికి వెళ్లిపోయారు. పెద్దవాళ్ల నుంచి ఏం నేర్చుకోవాలో కాదు. ఏం నేర్చుకోకూడదో తెలుసుకోవాలి. అందుకే డబ్బుకు విలువ ఇస్తా. ధనాన్ని నువ్వు ప్రేమిస్తే, అది నిన్ను ప్రేమిస్తుంది.
'వివాహభోజనంబు' చేస్తుండగా చాలా జరిగాయట!
బ్రహ్మానందం: ఇన్ని రకాల పాత్రలతో హాస్యం పండించవచ్చా? అన్న రీతిలో ఆశ్చర్యపోయేలా చేసిన వ్యక్తి జంధ్యాలగారు. ఆ సినిమాలో సుత్తి వీరభద్రరావుగారి ఇంట్లో అద్దెకు ఉంటా. సముద్రానికి వాకింగ్‌కు వెళ్లినప్పుడు నన్ను ఇసుకలో పీకల్లోతు వరకూ ఉంచేశారు. తల ఒక్కటే బయటకు కనపడుతుంది. ఆయన చెప్పే కథలన్నీ వినాలి. ఆ కథలు ఓపికగా వింటే ఇంట్లో ఉంచుతారు. లేకపోతే ఖాళీ చేయాల్సి ఉంటుంది. అది నా పాత్ర. ఎదుట వ్యక్తి డైలాగ్‌లు చెబుతుంటే అందరూ నవ్వుతున్నారు. షాట్ గ్యాప్‌లో నేను అలాగే ఇసుకలో ఉండిపోయా. ఈలోగా అక్కడకు కుక్క వచ్చింది. ఏదో అనుకుని కాలు ఎత్తుతుందేమోనని భయపడిపోయా. ఆ సన్నివేశాన్నే అప్పటికప్పుడు 'కుక్క వచ్చి కాలు ఎత్తినా, ఇంకా ఏం చేసినా, నేను చెప్పుకొనే పరిస్థితి లేదు. నన్ను వదిలిపెట్టండి మహాప్రభో' అనే డైలాగ్‌గా రాశారు. జంధ్యాలగారితో పరిచయం ఏర్పడిన తర్వాత ఆయన దర్శకత్వం వహించిన అన్నీ సినిమాల్లోనూ చేశా.
మీరు నటించిన సినిమాలు థియేటర్‌కు వెళ్లి చూడటం ఇష్టపడరట!
బ్రహ్మానందం: అదేమీ కాదు. చిన్నప్పుడు సెకండ్ షోకు వెళ్తే ఇంటికి రాగానే దెబ్బలు పడేవి. అలా సినిమాకు వెళ్లడం అంటే కాస్త భయం ఏర్పడింది. అది కాకుండా మనం సినిమాకు వెళ్తే 'ఆహా.. ఓహో'అని పొగుడుతారు. లేదంటే 'అక్కడ ఆ పాత్ర సరిగా లేదండీ' అని చెబుతారు. అవన్నీ మనకెందుకు.
మనదిద్దరం కలిసి ఒక సినిమాకు వెళ్లాం గుర్తుందా?
బ్రహ్మానందం: నా జీవితం పుట్టిన దగ్గరి నుంచి ఇప్పటివరకూ అన్నీ నాకు గుర్తే. జీవిత చరిత్ర కూడా రాస్తున్నా. మనిద్దరం కలిసి రాజమండ్రిలో షూటింగ్‌కు వెళ్లాం. అప్పుడు 'మనీ' సినిమా విడుదలైంది. దానికి మంచి పేరు వచ్చింది. అప్పటి వరకూ 'బ్రహ్మానందం కామెడీ అంటే మొనాటినీ అయిపోతోంది' అని అందరూ అనుకున్నారు. నేను కూడా ఎప్పుడు వెళ్లిపొమ్మంటే అప్పుడు అత్తిలి వెళ్లిపోదామని మూటాముల్లె సర్దుకుని రెడీగా ఉండేవాడిని. ఆ సమయంలో రాంగోపాల్‌వర్మ నిర్మాతగా, శివనాగేశ్వరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా 'మనీ'. ఆ సినిమాలో నేను బాగా చేశానని అందరూ అనుకుంటున్నారు. 'వినిపించే సంగీతం కంటే, వినిపించని నిశ్శబ్దం ఎంతో ఆనందంగా ఉంటుంది' అన్నట్లు ఒకసారి సినిమా చూస్తే 'ఇదేనా' అనుకుంటాం. అందుకని నీతో కలిసి ఆ సినిమాకు వచ్చా. నేను కనిపించే సన్నివేశం మొదలైన దగ్గరి నుంచి ప్రతిసారీ థియేటర్‌లో చప్పట్లు కొడుతూనే ఉన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'బాబాయ్ హోటల్'లో అంత సీరియస్ క్యారెక్టర్ చేయడం అవసరమా?
బ్రహ్మానందం: అప్పుడు సీరియస్ పాత్ర చేస్తున్నామా? కామెడీ పాత్ర చేస్తున్నామా? అన్నది ముఖ్యం కాదు. ఎందుకంటే జంధ్యాలగారు దర్శకుడు. కె.ఎస్.రామారావు నిర్మాత. ‘బాబాయ్ హోటల్’ సినిమా. భగవంతుడు అవకాశం ఇస్తాడంతే. ఆ పని మనం చేసుకుంటూ వెళ్లాలంతే. ఫలితం ఏదైతే అది వస్తుంది. 'మేరా నామ్ జోకర్' స్థాయిలో ఆయన సినిమా చేయాలనుకున్నారు.
మీరు ఎక్కడికైనా వెళ్లాలంటే కాంబినేషన్ అడుగుతారట. మీ కాంబినేషన్ ఎవరు?
బ్రహ్మానందం: ఇంకెవరు ఆలీ. బయటకు వెళ్లినప్పుడు నేను పారాసైట్. ఎవరిపైనైనా ఆధారపడి బతుకుతుంటా. ఎవరినో నమ్మి బయటకు వెళ్లలేను కదా! 'జయం మనదేరా' షూటింగ్ సమయంలో 15రోజులు యూరప్‌లో తిరిగాం. రోజుకొక దేశం తిరిగేవాళ్లం. ఎల్బీ శ్రీరామ్ 'అదేంటండీ కాఫీ కోసం రూ.లక్ష తీసుకున్నాడు' అని ఆశ్చర్యపోయారు. స్విట్జర్లాండ్‌లో వాచీ కొనుక్కోవాలని ఎల్బీ అనుకున్నారు. దానికి తనికెళ్ల భరణి 'నువ్వు పోయినా వాచీ పోదు' అని సరదాగా ఆటపట్టించారు. మలేషియా వెళ్లినప్పుడు ఆలీ మాట్లాడిన ఇంగ్లిష్ విని సెక్యురిటీ వాళ్లు భయపడిపోయారు. ఆ రోజులు మళ్లీరావు.
ఎప్పుడంటే అప్పుడు నిద్రలేచి స్నానాలు చేసి, రెడీ అయిపోయేవాళ్లం. అందుకే చాలా మంది 'బ్రహ్మానందం 9గంటలకు వస్తాడండీ. ఆరు గంటల తర్వాత వెళ్లిపోతాడండీ. మధ్యాహ్నం 1గంట నుంచి 2 గంటల వరకూ పనిచేయడండీ' అంటారు. ఇది నూటికి నూరుపాళ్లు నిజం. 35ఏళ్ల పాటు రోజుకు మూడు, నాలుగు షిఫ్ట్‌లు పనిచేశా. రోజూ మూడు రాష్ట్రాల్లో చేసేవాడిని. తిని, తినక తిప్పలు పడి, తిన్నది అరగక వాంతులు అయ్యే పరిస్థితులు కూడా ఎదుర్కొన్నా. ఇంతకాలం శరీరం కష్టపడిన తర్వాత దానికి కూడా విశ్రాంతినివ్వాలి కదా! డబ్బులు వస్తున్నాయి కదాని షూటింగ్‌లు చేయకూడదు. భగవంతుడు ప్రాణంతో పాటు శరీరం కూడా ఇచ్చాడు. దాన్ని కాపాడుకోవాలి. అందుకే ‘నేను ఈ సమయానికి వస్తా. ఇప్పటివరకే పనిచేస్తా. ఇష్టమైతే పెట్టుకోండి. లేకపోతే లేదు’ అని నన్ను నేను తగ్గించుకున్నా.
ఒక అద్భుతమైన బొమ్మ గీసి ఏ ధైర్యంతో ఆ దర్శకుడికి చూపించారు?
బ్రహ్మానందం: బొమ్మలు వేయటం చిన్నప్పటి నుంచి అలవాటు. అలా ఒకరోజు బొమ్మగీసి కీ.శే.బాపుగారికే చూపించా. చిత్రలేఖనంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అతి తక్కువ మంది కళాకారుల్లో బాపుగారు ఒకరు. తన గీతలతో ఏ భావాన్నైనా పలకించగలరు. అలాంటి మహానుభావుడి దగ్గరకు వెళ్లి బొమ్మ చూపించా. వెంటనే ఆయన 'బాగుంది' అనవచ్చు కదా! 'బ్రహ్మానందంగారు చాలా బాగా వేశారు. మీరిలా బొమ్మలు వేస్తే నాలాంటి వాళ్ల బొచ్చెలో రాయి వేసినట్టే కదా! మా నోళ్లు ఎందుకు కొడతారు' అని సరదాగా ఆటపట్టించారు. ఆయన అన్నమాటలకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.
బ్రహ్మానందం అంటే హ్యాపీనా. బ్రహ్మిగాడు అంటే హ్యాపీనా?
బ్రహ్మానందం: మీమ్స్ చూసినప్పుడు 'ఏవండీ మీపై మీమ్స్ చేస్తారు కదా మీకు కోపం రాదా' అని అడుగుతారు. సెక్రటేరియట్ ఎదురుగా ఒక సినిమా షూటింగ్ చేస్తున్నాం. అందరూ అరుస్తున్నారు. వాళ్లలో ఒకడు వచ్చి 'మాస్టారు, అత్తిలిలో మీ స్టూడెంట్‌ను. సెక్రటేరియట్‌లో పనిచేస్తున్నా' అన్నాడు. ఆ శబ్దం చాలా ఆనందంగా అనిపించింది. భగవంతుడుని అనేక రకాలుగా పిలుస్తారు. అలాగే ఎవరు ఎలా పిలిచినా నవ్వించడమే కదా మన బాధ్యత. మీమ్స్ తయారు చేసేవాళ్లను పిలిచి 'అలా ఎందుకు చేశారు. నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా' అని ఎప్పుడూ అనలేదు. మీమ్స్ క్రియేటర్స్ నన్ను కలిసి 'మీరు మా దేవుడండీ' అన్నారు. నేను వాళ్లకు థ్యాంక్స్ చెప్పాలి. వాళ్లకు ఎప్పుడూ రుణ పడి ఉంటా. నా చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. కొన్ని కారణాల వల్ల ఇటీవల నేను సినిమాల్లో నటించలేకపోయినా, నన్ను మర్చిపోకుండా చేసింది వాళ్లే. నేను ఏ సినిమాలో ఏ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చానో గుర్తు పెట్టుకుని ప్రస్తుత పరిస్థితులకు తగినట్లు క్రియేట్ చేసిన వాళ్ల కృషికి నా నమస్కారం.
ఇదీ చూడండి: 'ప్రతి ఒక్కరూ డబ్బుకు విలువ ఇవ్వాలి.. నాపై ఆ విమర్శలు నిజమే'