Brahmanandam about MS Narayana: తెలుగు సినీ పరిశ్రమలో హాస్యనటులకు కొదవేలేదు. ఎంతోమంది నటులు తమదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తున్నారు. అయితే, వారిలో కొంతమంది కమెడియన్లు ఇప్పుడు మన మధ్య లేకపోయినప్పటికీ సినీ ప్రియుల హృదయాల్లో మాత్రం వారికి ప్రత్యేక స్థానం ఉంది. అలా ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వారిలో ఎమ్మెస్ నారాయణ ఒకరు. తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' షోకు విచ్చేసి ఎన్నో ఆసక్తికర సంగతుల్ని తెలిపిన హాస్యనటుడు బ్రహ్మానందం.. ఎం.ఎస్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆస్పత్రి బెడ్‌పై చికిత్స పొందుతూ చనిపోయే గంట ముందు కూడా తనను చూడాలని ఎమ్మెస్ తపించారని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు! ఆయనంటే తనకెంతో ఇష్టమని, అంతకుమించి అని చెప్పారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"ఎమ్మెస్ నారాయణ కేవలం హాస్యనటుడు మాత్రమే కాదు, ఆయనలో చాలా ప్రతిభ ఉంది. ఆయన చెప్పే చిన్న చిన్న జోకులు వింటే చాలా నవ్వు తెప్పిస్తాయి. ఓ సారి నేను ఎల్బీ శ్రీరామ్, ఎంఎస్ కలిసి నటిస్తున్నాం. ఓ ఇంట్లోని మెట్ల మీద షూటింగ్ జరుగుతోంది. అప్పుడు ఎల్బీ మాట్లాడుతూ.. 'బ్రహ్మానందంగారు నాకు ఉదయం లేవగానే ఇలాంటి మెట్ల మీద కూర్చొని టీ తాగాలని ఉంటుంది' అని చెప్పారు. 'మీ ఇంటి దగ్గర మెట్లు ఉంటాయి కదా అక్కడ కూర్చొని తాగండి' అని ఎమ్మెస్ బదులిచ్చారు. తన ఇంటి దగ్గర మెట్లు ఉండవని చెప్పారు ఎల్బీ. 'అయితే రోజూ ఉదయాన్నే లేచి పేపర్ కొనుక్కొని నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి టీ తాగి వెళ్లిపోండి' అని ఎమ్మెస్ కామెడీ చేశారు. ఇలాంటివి వందల జోక్‌లు ఆయన దగ్గర ఉంటాయి. ఆయనంటే నాకు చాలా ఇష్టం. అంతకుమించి. ఆయన్ను అద్భుతమైన కమెడియన్ అనడం కన్నా అంతకన్నా ఎక్కువ అని చెపొచ్చు. 'అన్నయ్య నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు బాగా చదువుకున్నావ్. గొప్పవాడివి. ఓ కమెడియన్ నీ లాగా ఉండాలనేది నా కోరిక' అని నాతో ఎప్పుడూ అనేవారు. ఆయన చనిపోయే చివరి రోజు కిమ్స్ ఆస్పత్రిలో ఉన్నారు. ఇంకో గంటలో చనిపోతాడనగా పేపర్ తీసుకుని దాని మీద 'బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని ఉంది' అని రాశారు. అది నాకు తెలీదు. అప్పుడు నేను ఆరడగుల బుల్లెటు సినిమా షూటింగ్లో ఉన్నాను. అప్పుడు ఎమ్మెస్ కూతురు నాకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పింది. వెంటనే నేను ఆస్పత్రికి వెళ్లి కలిశాను. రాగానే నా చేయి గట్టిగా పట్టుకొని 'అన్నయ్య' అంటూ ఏదో చెప్పబోయాడు. నోట్లో నుంచి మాట రావట్లేదు. అది చూస్తుంటే నా కాళ్లు చేతులు ఆడలేదు. వాళ్ల అబ్బాయి వచ్చాడు. ఇక నేను తట్టుకోలేక బయటకు వచ్చాను. అలా వచ్చిన 15-20నిమిషాల్లోనే ఆయన చనిపోయారు. అందుకేనేమో ఆయన కమెడియన్ కన్నా ఎక్కువ అనిపిస్తుంది."
-బ్రహ్మానందం, హాస్యనటుడు.
ఈ విషయంతో పాటు తన కెరీర్ గురించి ఎన్నో సంగతులను తెలిపారు బ్రహ్మానందం. ప్రస్తుతం తాను పవన్‌కల్యాణ్ 'భీమ్లానాయక్' సహా ఆరు సినిమాల్లో నటిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: ఆ ముగ్గురికి నా జీవితంలో ప్రత్యేక స్థానం: బ్రహ్మానందం