పాత తరం తెలుగు నటుడు రాజేశ్ కూతురైన ఐశ్వర్య రాజేశ్.. చిన్నతనంలోనే తన తండ్రిని పోగొట్టుకొని అష్టకష్టాలు పడింది. కుటుంబానికి భారం కాకుండా.. ఆ బాధ్యతలను పంచుకోవడానికి తాను మేకప్ వేసుకోవాల్సి వచ్చిందని, ఈ క్రమంలో తనకెన్నో సవాళ్లు ఎదురయ్యాయని అంటోంది. తనకెవరూ అండగా నిలవకపోయినా.. అమ్మ ప్రోత్సాహం, స్వీయ ప్రేరణ, కృషి, పట్టుదలతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పుకొచ్చింది. మొన్నామధ్య తమిళనాడులోని తిరుచిరాపల్లి ఐఐఎంలో నిర్వహించిన 'టెడ్‌ఎక్స్ టాక్‌షో' వేదికపై ప్రసంగించిన ఐశ్వర్య.. ఆ వీడియోను ఇటీవలే ట్విట్టర్‌లో పంచుకుంది. ఇందులో భాగంగా తన జీవిత ప్రయాణంలో తనకెదురైన కష్టాలు, చేదు అనుభవాలు, వాటిని దాటుకుంటూ సక్సెస్ సాధించిన వైనాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురైంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
హీరోయిన్‌గా పనికిరావన్నారు!
"సాధారణంగా సినిమా రంగంలో నటీమణులపై లైంగిక వేధింపుల గురించి మనం వింటూనే ఉంటాం. కానీ ఇక్కడున్న సమస్య ఇదొక్కటే కాదు.. చర్మ ఛాయ, శరీరాకృతి, డ్రస్సింగ్.. వంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. నేనూ ఈ సమస్యల్ని ఎదుర్కొన్నా. ముఖ్యంగా ఉత్తరాది అమ్మాయిల్లా దుస్తులు ధరించడం, ముస్తాబు కావడం నాకు రాదు. అంతేకాదు.. నాకు తమిళం రాదన్న ఉద్దేశంతో కొందరు నన్ను తిరస్కరించారు కూడా! ఇంకొందరు దర్శకులు.. 'నువ్వు హీరోయిన్‌గా పనికిరావు, చిన్న చిన్న పాత్రలు, సహాయక పాత్రల్లో అవకాశమిస్తాం.. అందులో నటించు' అనేవారు. మరో దర్శకుడైతే.. హాస్య నటుల సరసన నటించమన్నారు. కానీ అలాంటి పాత్రలు చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే సినిమాలో హీరోయిన్‌గా నటించాలనేది నా కల. అలా రెండు మూడేళ్ల పాటు ఎలాంటి అవకాశాలు రాకుండా ఖాళీగా ఉన్నా. ఆ తర్వాత 'అట్టకత్తి'లో చిన్న పాత్రలో నటించా. అందులో నా నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి" అని ఐశ్వర్య చెప్పింది.
అదే నా కెరీర్‌లో టర్నింగ్ పాయింట్!
"ఆ తర్వాత నేను నటించిన 'కాకా ముట్టై' సినిమాతో నా కెరీర్ పూర్తి మలుపు తీసుకుంది. అందులో ఇద్దరు చిన్నారులకు తల్లిగా నటించా. ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా నా సహనటుల దగ్గర్నుంచి నటనకు సంబంధించిన బోలెడన్ని విషయాలు నేర్చుకున్నా. అంతేకాదు.. ఈ సినిమా నాకు ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర ఫిలిం అవార్డును అందించింది. అలాగే ఉత్తమనటిగా ఫిలింఫేర్ అవార్డుకు నన్ను నామినేట్ చేసింది. ఆపై విజయ్ సేతుపతి (ధర్మ దురై), ధనుష్ (వడ చెన్నై) వంటి పెద్ద పెద్ద నటులతో కలిసి నటించే అవకాశం నన్ను వరించింది. ఆపై కణా (తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తి)తో మహిళా ప్రాధాన్య సినిమాల్లో సైతం నటించి మెప్పించగలనని నిరూపించా. అందులో నేనే హీరో అని చెప్పడానికి గర్వపడుతున్నా. ఇదంతా నాపై నేను నమ్మకముంచి, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగడం వల్లే సాధ్యమైందని చెబుతా"నని ఐశ్వర్య రాజేశ్ తెలిపింది.
మనం అంత సమర్థులం కావాలి!
"మీరు నమ్ముతారో, లేదో కానీ సినిమాల్లో నేను నిలదొక్కుకోవడానికి నాకెవ్వరూ సపోర్ట్ చేయలేదు. నాపై నేను పూర్తి విశ్వాసం ఉంచడమే నా సక్సెస్ సీక్రెట్ అని చెబుతా. అలాగే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించే క్రమంలో నా చర్మ ఛాయ, శరీరాకృతిపై ఎన్నో విమర్శలొచ్చాయి. లైంగిక వేధింపులూ ఎదురయ్యాయి. అయితే వాటన్నింటినీ ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. ప్రతి మహిళ కూడా తమకు ఎదురైన సమస్యల్ని సమర్థంగా ఎదుర్కొనేంత బలంగా తయారుకావాలి. ఎవరో వచ్చి తమను కాపాడతారని అనుకోకుండా ఎవరిని వారే రక్షించుకునేంత ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. అలాగే ఇతరులపై ఆధారపడకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఎదగగలిగే నేర్పు సొంతం చేసుకోవాలి.. మహిళలందరికీ నేను చెప్పేది ఇదే.
ఐశ్వర్యా తెలుగులో నటించిన తొలి చిత్రం 'కౌసల్యా కృష్ణమూర్తి'తోనే సక్సెస్ సాధించింది. అంతకు ముందు రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన 'రాంబంటు'లో బాలనటిగా వెండితెరకు పరిచయమైంది. ఆపై తమిళ సినిమాలకే పరిమితమై, ఇటీవల కాలంలో 'మిస్‌మ్యాచ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి తెలుగు సినిమాలతో అలరించింది.