'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే!'లో త్రిష చెల్లిగా, వెంకటేశ్‌ని ప్రేమిస్తున్న వన్‌సైడ్ లవర్‌గా, అమాయకమైన పాత్రలో నటించి ఆకట్టుకుంది కలర్స్ స్వాతి. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో కథానాయికగాను నటించి మెప్పించింది. అందులో ఒకటి 'కార్తికేయ'. ఈ సినిమా మంచి ఫలితాన్నే రాబట్టింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'కార్తికేయ 2' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో స్వాతి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుందని సమాచారం.
ఇప్పటికే ఈ చిత్రంలో ప్రధాన కథానాయికగా అనుపమ పరమేశ్వరన్‌ని తీసుకున్నారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. స్వాతి 2017లో వచ్చిన 'లండన్ బాబులు' చిత్రం తర్వాత మళ్లీ ఇప్పటి వరకు తెలుగు తెరపై కనిపించలేదు.