సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన 'లక్కీ' చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన నటి స్నేహా ఉల్లాల్. ఐశ్వర్య రాయ్ పోలికలతో కనిపించి.. అందాల భామగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'అలా మొదలైంది', 'సింహా' చిత్రాలతో విజయాలను అందుకున్న స్నేహా ఉల్లాల్ పుట్టినరోజు నేడు.
ఒమన్‌లోని మస్కట్‌లో 1987 డిసెంబరు 18న జన్మించింది స్నేహా ఉల్లాల్. ఆమె తండ్రి మంగళూరుకి చెందినవారు కాగా, తల్లి సింధీ మూలాలున్న మహిళ. కొన్నాళ్లు మస్కట్‌లోనే చదువుకున్న స్నేహా ఆ తరువాత తల్లితో కలిసి ముంబైకి వచ్చింది. అక్కడ డ్యూర్‌లో కాన్వెంట్ హైస్కూల్‌లోనూ, వార్తక్ కాలేజీలోనూ చదువుకొంది.
స్నేహా కాలేజీలోనే సల్మాన్‌ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ చదువుకొనేవారు. అలా సల్మాన్ దృష్టిలో పడిన స్నేహాఉల్లాల్‌కి మొదటి సినిమా అవకాశం లభించింది. హిందీ, తెలుగుతోపాటు కన్నడ, బెంగాలీ సినిమాల్లోనూ నటించింది స్నేహా. కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆమె కెరీర్ సాగలేదు. 2015 తరువాత ఆమె సినిమాల్లో కనిపించలేదు.
ఇదీ చూడండి: కొంటె కనుల చిన్నది.. కొణిదెల అమ్మాయి