ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అకాడమీ అవార్డుల(ఆస్కార్) ప్రదానోత్సవంలో 'చెంపదెబ్బ' ఘటన ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్‌పై ఆస్కార్ విజేత విల్ స్మిత్ చేయిచేసుకున్నారు. తన భార్య అనారోగ్యం గురించి క్రిస్ స్టేజ్‌పై మాట్లాడుతూ హాస్యం చేసినందుకు విల్ అతడి చెంప చెల్లుమనిపించాడు. ఈ సంఘటనపై స్పందించిన పలువురు సెలబ్రిటీలు విల్‌స్మిత్‌కు మద్దతు నిలుస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై నటి సమీరా రెడ్డి కూడా స్పందించింది. తాను కూడా స్మిత్ భార్య ఎదుర్కొంటున్న అలోపేసియా సమస్యతో గతంలో బాధపడినట్లు తెలిపింది. ఈ వ్యాధి గురించి వివరించింది.
"ప్రతిఒక్కరు జీవితంలో వ్యక్తిగతంగా కొన్ని సమస్యలతో బాధపడుతుంటారు. ఇటీవలే జరిగిన ఆస్కార్ వివాదం దీనిపై నేను మాట్లాడేలా చేసింది. ఇంతకీ అలోపేసియా అంటే ఏమిటో తెలుసా? ఇది ఆటో ఇమ్యూన్ వ్యాధి. దీని వల్ల జట్టు కుదుళ్ల నుంచి ప్యాచ్‌లుగా ఊడిపోతుంది. 2016లో నేను ఈ వ్యాధితో బాధపడ్డాను. ఓ రోజు నా తల వెనక భాగంలో జుట్టు ఊడిపోవడం నా భర్త అక్షయ్ గమనించారు. ఒక నెలలోనే రెండు మూడు సార్లు ఇలా జరిగింది. ఇది అంటూ వ్యాధి కాదు, ఇది మనల్ని ఎలాంటి అనారోగ్యానికి కూడా గురి చేయదు. కానీ జుట్టు రాలిపోవడం అంటే మానసికంగా కుంగిపోతాం. ఈ అలోపేసియా ఎందుకు వస్తుందో కచ్చితమైన కారణం తెలియదు. కానీ ఎట్టకేలకు ఈ సమస్య నుంచి బయపడ్డాను. "అని సమీర పేర్కొంది. ఇక సమీర విషయానికొస్తే.. తెలుగులో 'జై చిరంజీవా', 'అశోక్, 'సూర్య సన్ఆఫ్ క్రిష్ణన్' సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
ఇదీ చూడండి: సాగర తీరాన సోఫీ చౌదరి సెగలు.. ర్యాంప్‌పై ఊర్వశి హొయలు