కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలిపింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ఓ స్పెషల్ సాంగ్ కోసం ఓ దర్శకుడు తనను లో దుస్తులతో నటించమన్నాడని చెప్పింది. అయితే ఆ దర్శకుడి పేరును వెల్లడించలేదు.
"దర్శకుడు తొలుత లో దుస్తులతో నటించాలని చెప్పలేదు. కానీ ఆ తర్వాత సెట్లో ఉన్నప్పుడు ఈ విషయాన్ని చెప్పాడు. కెరీర్ ప్రారంభంలో ఇది జరగడం వల్ల ఎదురుచెప్పలేకపోయాను. అప్పుడు నేను చాలా భయపడ్డాను. అతని మాటలను అడ్డు చెప్పకపోవడం నా జీవితంలో ఏకైక చింతించదగ్గ విషయం. భారతీయ చిత్రసీమలో ఎంతో మంది నటీమణులు ఇలాంటి సందర్భాల్ని ఎదుర్కొంటుంటారు. చాలా మంది దర్శకులు ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు తమ మనసులో ఉన్న విషయాలు చెప్పరు. ఆ తర్వాత సెట్లో ఉన్నప్పడు ఇలాంటి సన్నివేశాల్ని చేయాలని చెప్తారు. అప్పుడు కుదరదని చెప్తే ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. ఇప్పటికి కానిచ్చేద్దం.. సౌకర్యంగా లేకపోతే ఎడిటింగ్‌లో తీసేద్దాం అని అంటుంటారు" అని చోప్రా వివరించింది.
తమిళ చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించిన ప్రియాంక.. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం హాలీవుడ్‌లోనూ అవకాశాలను దక్కించుకుని వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 'మ్యాట్రిక్స్', 'టెక్స్ట్ ఫర్ యు' సినిమాల్లో నటిస్తోంది.
ఇదీ చూడండి: 'ఐదేళ్లు అందులోనే.. ఎలా బయటపడాలో తెలియలేదు'