దక్షిణాదితో పాటు ఉత్తరాది చిత్రాల్లోనూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ పూజా హెగ్డే. 'ఎనిమిదేళ్ల సినీప్రయాణంలో మీకు దక్కిన ప్రత్యేక ప్రశంస ఏంటి?' అని అడగ్గా ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది.
"నటిగా ఇంత వరకు చాలా ప్రశంసలు అందుకున్నా. కానీ, ప్రత్యేకంగా గుర్తుండిపోయింది మాత్రం తొలిసారి నేను తెలుగులో డబ్బింగ్ చెప్పినప్పుడు దక్కిన ప్రశంసే" అంటోంది పూజ.
"ఆయా భాషల్లో ఏదో ఒక పాత్రతో అందరి మెప్పు పొందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ, తొలిసారి తెలుగులో డబ్బింగ్ చెప్పుకొన్నప్పుడు దక్కిన ఓ ప్రశంస నాకు చాలా గుర్తుండిపోయింది. తెలుగులో నేను తొలిసారి నా స్వరాన్ని వినిపించింది 'అరవింద సమేత' సినిమాలోనే. ఆ చిత్రం విడుదలయ్యాక ఓ కథానాయిక నుంచి నాకు మెసేజ్ వచ్చింది. 'నీకు ఎవరు డబ్బింగ్ చెప్పారు? చాలా బాగుంది. నా సినిమాలో పాత్రకు ఆమెతోనే డబ్బింగ్ చెప్పిస్తా' అంది. ఆ నాయిక ఎవరన్నది నేను బయటపెట్టను. కానీ, ఆరోజు నాకు చాలా సంతోషంగా అనిపించింది" అని చెప్పింది పూజా హెగ్డే.
ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' చిత్రంలో అల్లు అర్జున్ సరసన నటించి ఘనవిజయాన్ని అందుకుంది పూజ. ప్రస్తుతం ప్రభాస్ సరసన 'రాధేశ్యామ్', 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.