* 'వెంకీమామ'తో 2019ని విజయవంతంగా ముగించారు. ఈ కొత్త ఏడాదిలో 'డిస్కోరాజా'తో సందడి చేస్తున్నారు. చిత్ర ఫలితం ఎలా అనిపిస్తోంది?
కొత్త సంవత్సరంలో ఇంత పెద్ద చిత్రంతో మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. అదీ రవితేజ గారితో చేసిన సినిమా కావడం మరింత ఆనందాన్నిచ్చింది. నేను ఆయనకు వీరాభిమానిని. నేనిందులో చేసిన హెలెన్ పాత్ర నా కెరీర్‌లో గుర్తిండిపోతుంది. చాలా భిన్నమైనది నటనకు ప్రాధాన్యమున్న పాత్ర అది. సినిమాలో నా నిడివి తక్కువే అయినప్పటికీ మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
* ఈ చిత్రంలో మీరు బధిర యువతిగా నటించారు కదా. ఆ పాత్ర కోసం ఎలా సిద్ధమయ్యారు? మీకెదురైన సవాళ్లేంటి?
మాట్లాడకుండా.. కేవలం అభినయంతోనే హావభావాలు పలికించడం, మనం చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పగలడం చాలా కష్టమైన పని. ఇందులో నా పాత్రకు వినబడదు, మాట్లాడలేదు అనగానే కాస్త భయంగా అనిపించింది. కానీ, నాకిలాంటి సవాల్‌తో కూడిన పాత్రలంటే ఇష్టం. అందుకే ఆనంద్ ఈ పాత్ర గురించి చెప్పగానే ఎప్పుడెప్పుడు సెట్స్‌లోకి వెళ్తానా? అని ఆసక్తిగా ఎదురుచూశా. ఈ పాత్ర చేయడానికి ముందు బధిరులు నేర్చుకునే సంజ్ఞ భాషలో శిక్షణ తీసుకున్నా. సెట్లో ఆ పాత్ర చేసే సమయంలోనూ నాకు ఓ శిక్షకురాలిని పెట్టారు. నేను చేస్తున్న సంజ్ఞలు సరైనవేనా? కావా? అన్నది పర్యవేక్షించడం తన పని. ఇప్పుడు ప్రేక్షకులు చాలా తెలివిగా ఉన్నారు. మన నటనలో ఏ చిన్న పొరపాటున్నా ఇట్టే పట్టేసుకుంటారు. అందుకే ఈ పాత్రకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.
* 80ల కాలం నాటి యువతిగా కనిపించేందుకు లుక్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
ఈ పాత్ర లుక్ విషయంలో అమ్మ సలహాలు, సూచనలు పాటించా. కథ వినగానే అమ్మకు నా పాత్ర గురించి చెప్పా. వేసుకునే దుస్తులు ఎలా ఉండాలి? హెయిర్ స్టైల్ ఏ తరహాలో ఉండాలి? ఎలా నడవాలి? వంటివన్నీ తనే చెప్పింది. నేను ఆ పాత్రలో మేకప్ అయ్యాక అమ్మ నన్ను చూసి చాలా సంతోషించింది. 'ఎంత అందంగా ఉన్నావో' అంటూ పొగిడేసింది. నేను ఆ వేషధారణతో అమ్మతో కలిసి ఓ ఫొటో దిగా. త్వరలోనే దాన్ని అభిమానులతో పంచుకుంటా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
* రవితేజతో కలిసి నటించడం ఎలా అనిపించింది?
నా దృష్టిలో ఆయనొక రాక్‌స్టార్. ఎప్పుడూ ఎంతో హుషారుగా ఉంటారు. సెట్స్‌లో ప్రతిఒక్కరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. నటనలో నాకెన్నో విలువైన సలహాలు, సూచనలు ఇస్తూ ఓ గురువులా ఉండేవారు.
* కెరీర్ ఆరంభంలోనే మీకన్నా ఎక్కువ వయసున్న అగ్ర హీరోలతో ఆడిపాడుతున్నారు. యువ స్టార్ హీరోలతో చేసే అవకాశాలు కోల్పోతామన్న భయం లేదా?
అలాంటిదేం లేదు. నా దృష్టిలో వయసన్నది ఓ సంఖ్య మాత్రమే. నిజంగా కెరీర్ ఆరంభంలోనే బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ వంటి అనుభవమున్న నటులతో చేసే అవకాశం ఎంత మందికి దొరకుతుంది. నేను నా కెరీర్ ఆరంభంలోనే ఈ కలల్ని నెరవేర్చుకున్నా. చిత్రసీమలోని అందరు అగ్రహీరోలతోనూ నటించాలనుంది. మంచి పేరున్న పెద్ద హీరో.. చక్కటి కథ.. ఇలా రెండు ఒకేసారి కలసివచ్చినప్పుడు ఎవరూ వదులుకోవాలనుకోరు.
* అటు నాయికా ప్రాధాన్య చిత్రాలు చేస్తున్నారు.. ఇటు హీరోయిన్‌గా చేస్తున్నారు. రెండింటిలో నటిగా తేడా ఎలా అనిపిస్తుంది?
కథానాయికగా చేసేటప్పుడు కేవలం నా బాధ్యత నటిగా నా పాత్రకు న్యాయం చేయడం వరకే పరిమితం. కానీ, నాయికా ప్రాధాన్య చిత్రమంటే చిత్ర బరువు బాధ్యతలన్నీ మనమే మోయాల్సి ఉంటుంది. నటిగా కెరీర్ ప్రారంభంలోనే ఈ తరహా ప్రయత్నాలు చేయడమే పెద్ద సవాల్. కానీ, ఏం చేసినా విజయం కోసం వందశాతం కష్టపడతాం. చిత్ర ఫలితమన్నది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. 'ఆర్డీఎక్స్' విషయానికొస్తే.. కథ పరంగా, నా పాత్ర పరంగా అది చాలా మంచి చిత్రం. కానీ, ఫలితం ఆశించిన విధంగా రాలేదు. దానికి కారణమేంటన్నది ఇప్పటికీ అంతుచిక్కలేదు.
* బోల్డ్ ఇమేజ్‌పై మీ అభిప్రాయం?
'ఆర్‌ఎక్స్ 100' నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. నేనీరోజు ఇలా ఉన్నానన్నా.. ఇన్ని కోట్ల మంది ప్రేక్షకుల ఆదరణ.. అదంతా ఆ చిత్రం వల్లే. నాకొచ్చిన ఈ గుర్తింపును కోరి తెచ్చుకున్నది కాదు. ప్రేక్షకులిచ్చారు. దీన్ని వదులుకోవాలని లేదు. అది మంచిదా చెడ్డదా అన్నది పక్కకు పెడితే.. నాకు కావల్సినంత ఆదరణ దక్కింది. ఇది మంచిదే కదా. 'వెంకీమామ', 'డిస్కోరాజా'లో భిన్నమైన పాత్రలు పోషించా కదా.
* కొత్త చిత్రాల కబుర్లు?
ప్రస్తుతం ప్రణదీప్ అనే నూతన దర్శకుడితో ఓ నాయికా ప్రాధాన్య చిత్రం చేస్తున్నా. నేనందులో ఐపీఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తా. తమిళంలో నా తొలి చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ, మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నా.
ఇదీ చూడండి.. కొత్త హంగులతో 'అనకొండ' మళ్లీ వస్తోంది..!