భూమిక చావ్లా.. యువకుడు సినిమాతో తెలుగు యువకుల గుండెల్ని కొల్లగొట్టిన తార. తెరపై కనిపిస్తే చాలు సినీప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరైపోయేవారు. అంతలా ప్రేక్షకుల మనస్సుల్లో బలమైన స్థానం సంపాదించుకున్న ఈ అందాల మిస్సమ్మ పుట్టిన రోజు శనివారం(ఆగస్టు 21). ఈ సందర్భంగా ఆమె గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.
వ్యక్తిగత జీవితం..
భూమిక చావ్లా అసలు పేరు రచనా చావ్లా. వీరిది న్యూదిల్లీలో స్థిరపడిన పంజాబీ కుటుంబం. భూమిక తండ్రి ఆర్మీ ఆఫీసర్‌గా పని చేసేవారు. భూమికకు ఒక అన్నయ్య, ఒక అక్క ఉన్నారు. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం చేసిన తరువాత ముంబయికి వీరు మకాం మార్చారు. అక్కడ యాడ్ ఫిలిమ్స్, హిందీ మ్యూజిక్ వీడియో ఆల్బమ్స్‌తో కెరీర్‌ని మొదలుపెట్టారు భూమిక. జీ టీవీ సిరీస్ 'హిప్ హిప్ హుర్రే'లో తొలిసారిగా భూమికకు అవకాశం వచ్చింది.
కెరీర్..
తెలుగులో రూపుదిద్దుకున్న యువకుడు సినిమాతో భూమిక తన సినీ కెరీర్‌ను మొదలుపెట్టింది. సుమంత్ సరసన జోడీగా ఈ సినిమాలో నటించింది. ఈ చిత్రం తరువాత 'ఖుషీ' చేసింది. పవన్ కల్యాణ్‌కు జంటగా భూమిక నటించిన ఈ సినిమా బాక్సాఫిసు వద్ద పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం తరువాత తెలుగులో భూమికకు హీరోయిన్‌గా మంచి గుర్తింపు వచ్చింది. ఆమె నటించిన ఒక్కడు, సింహాద్రి సినిమాలు ఒకే ఏడాది విడుదలై ఆ ఏడాది తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో చోటు సంపాదించాయి.
తెలుగులో పవన్ కల్యాణ్, ప్రీతి జింగానియా, అదితి గోవిత్రికర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తమ్ముడు సినిమాకు రీమేక్‌గా తమిళంలో బద్రి తెరకెక్కింది. ఈ సినిమాతో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టింది భూమిక. ఆ తరువాత 'రోజా కూట్టం' అనే సినిమాలో శ్రీకాంత్‌కు జోడిగా నటించింది. ఆ తరువాత కూడా భూమిక తమిళంలో ఎన్నో సినిమాలలో నటించి ఆ పరిశ్రమలో కూడా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
అనేక సినిమాలు..
కాన్సర్ వ్యాధి ఉన్న మహిళా వ్యాపారవేత్తగా మిస్సమ్మ సినిమాలో భూమిక పాత్రకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇలా తెలుగులో, తమిళ్లో తన నటనతో, అభినయంతో మంచి పేరు సంపాదించుకున్న భూమిక బాలీవుడ్‌కు కూడా ఎంట్రీ ఇచ్చింది. 'తేరే నామ్' అనే సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో భూమిక పర్ఫార్మెన్స్‌కు ఎంతో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఆ తరువాత వరుసగా హిందీ సినిమాలలో అవకాశాలు వచ్చాయి. తమిళ సినిమా హిందీ రీమేకైన 'రన్', 'దిల్ నే జిసే అప్నా కహా', 'దిల్ జో భీ కహే' వంటి ఎన్నో హిందీ సినిమాలలో నటించింది. అలాగే తెలుగులో కూడా మంచి అవకాశాలను రాబట్టుకుంది. నా ఆటోగ్రాఫ్, జై చిరంజీవ వంటి సినిమాలలో నటించింది.
'సిల్లును ఒరు కాదల్' అనే తమిళ సినిమాలో నిజజీవితంలో భార్యాభర్తలైన సూర్య, జ్యోతికలతో తెరను పంచుకుంది. ఈ చిత్రం పెద్ద హిట్టయింది. తెలుగులో అనసూయ చిత్రంలో ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పంజాబీ, మలయాళీ సినిమా పరిశ్రమలలో కూడా భూమిక అడుగుపెట్టారు. పంజాబీలో 'యారియాన్' అనే సినిమాలో, మలయాళంలో 'భ్రమరం' అనే చిత్రంలో నటించింది.
సీనియర్ హీరోలతోనూ..
తెలుగులో భూమిక యువ హీరోలతోనే కాదు సీనియర్ హీరోలతో కూడా నటించింది. నాగార్జునతో స్నేహమంటే ఇదేరా, వెంకటేశ్‌తో వాసు, రవితేజాతో నా ఆటోగ్రాఫ్, చిరంజీవితో జై చిరంజీవ, జగపతిబాబుతో స్వాగతం సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. భూమిక ఎక్కువ నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లోనే కనిపించింది.
తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్..
తెలుగులో భూమిక ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేసింది. న్యాచురల్ స్టార్ నాని నటించిన 'ఎంసీఏ' చిత్రంలో వదిన పాత్రలో నటించింది. ఆ తరువాత 'యూ టర్న్', 'సవ్యసాచి' చిత్రంలోనూ ప్రధాన పాత్రలు పోషించింది. విశ్వక్ సేన్ పాగల్ చిత్రంలోనూ భూమిక ప్రత్యేక పాత్రలో కనిపించింది.
ఇదీ చదవండి : అభిమానులకు 'మెగా' బొనాంజా.. 153వ చిత్రం ఫస్ట్‌లుక్