సుమారు ముప్పైరెండేళ్లక్రితం 'మైనే ప్యార్ కియా'తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దేశవ్యాప్తంగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి భాగ్యశ్రీ. ఆ తరువాత చాలా తక్కువ సినిమాల్లో నటించి తెరమరుగైనా... మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌తో తెరంగేట్రం చేస్తోన్న సందర్భంగా తన గురించి చెప్పుకొస్తోందిలా...
ప్రభాస్.. ఇట్టే కలిసిపోతాడు
'బాహుబలి' చూశాక.. ప్రభాస్ మాటతీరు కాస్త గంభీరంగా ఉంటుందనీ, అందరి దృష్టీ తనవైపు ఉండేలా అతిశయంతో వ్యవహరిస్తాడనీ అనుకునేదాన్ని. కానీ సెట్లో మొదటిసారి అతన్ని చూశాక.. ఇంత నిరాడంబరంగా ఉంటాడా అనిపించింది. అందరితో ఇట్టే కలిసిపోవడానికి ఇష్టపడతాడు. ఓ టీంప్లేయర్‌లా వ్యవహరిస్తాడు. నేను కొన్నేళ్ల విరామం తరువాత షూటింగ్‌లో పాల్గొనడం వల్ల కాస్త కంగారుగా అనిపించింది కానీ సెట్లో ప్రభాస్‌తో మాట్లాడాక మామూలైపోయా. ఇద్దరం మంచి ఆహార ప్రియులం కావడం వల్ల రకరకాల వంటకాల గురించి అదేపనిగా చర్చించుకునేవాళ్లం.
విధినే నమ్మేదాన్ని
నేనూ మా ఆయన హిమాలయా దాసాని.. స్కూల్‌మేట్స్. నేను క్లాస్‌లీడర్‌ను. తనేమో బాగా అల్లరి చేసేవాడు. దాంతో రోజూ మేమిద్దరం కొట్టుకునేవాళ్లం. అయితే స్కూలు అయిపోయే సమయానికి ఒకరిపట్ల మరొకరికి ప్రేమ ఉందని అర్థమైంది. ఆ తరువాత మా మధ్య దూరం పెరిగినా.. విధి అనేది ఉంటే.. రాసిపెట్టి ఉంటే మేమిద్దరం మళ్లీ కలుస్తామనుకున్నా. అలాగే జరిగింది.
నాన్న ఒప్పుకోలేదు..
మాది మహారాష్ట్రలోని సంగ్లీ. మా నాన్న విజయ్‌సింగ్‌రావ్ మాధవ్‌రావ్ పట్వర్ధన్. మా ఊరికి రాజు. చాలా ఉన్నత కుటుంబం మాది. ముగ్గురు అమ్మాయిల్లో నేనే పెద్దదాన్ని. నేను ఒకతన్ని ప్రేమిస్తున్నానని తెలియగానే ఇంట్లో కట్టడి చేశారు. ఫోను మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదు. ఓ రోజు ఇంట్లో ఇదే విషయంపైన పెద్ద చర్చ జరిగింది. నేను ఇష్టపడే వ్యక్తితో పెళ్లి చేయరని అర్థమైపోయింది. దాంతో హిమాలయ దాసానికి ఫోన్ చేసి... ‘నేను ఇల్లు విడిచి వచ్చేస్తున్నా. నువ్వు కూడా వచ్చేస్తావా’ అని అడిగా. అతను పదిహేను నిమిషాల్లో నా ముందు ఉన్నాడు. అలా సల్మాన్‌ఖాన్, మైనే ప్యార్ కియా దర్శకుడు, మా అత్తమామలు, మరికొందరు స్నేహితుల సమక్షంలో ఓ ఆలయంలో మేం పెళ్లి చేసుకున్నాం. ఆ తరువాత ఎప్పటికో మా నాన్న మమ్మల్ని అర్థం చేసుకున్నారు.
ఏడాదిన్నర దూరంగా...
పెళ్లయ్యాక కొంతకాలం పాటు అంతా సజావుగా సాగినా... కొన్ని కారణాల వల్ల నేనూ, ఆయనా ఓ ఏడాదిన్నర పాటు దూరంగా ఉండాల్సి వచ్చింది. అప్పుడు మాత్రం ఇద్దరం విడిపోయామేమో అనేంతగా బాధపడ్డా. అసలు మళ్లీ మేమిద్దరం ఒక్కటవుతామా లేదా అనీ భయపడేదాన్ని. తరువాత మేం మళ్లీ కలిశాం కానీ అలాంటి రోజులు మాకు రాకూడదని ఎన్ని దేవుళ్లకు మొక్కుకున్నానో...
ఆయనతోనూ నటించా...
‘మైనే ప్యార్ కియా’ చేశాక... నాకు వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. అయితే వేరే హీరోలతో కాకుండా మా వారితోనే కలిసి చేయాలనుకున్నా. అలా ఇద్దరం కలిసి రెండుమూడు సినిమాల్లో నటించాం కానీ... బాబు అభిమన్యు పుట్టడం వల్ల సినిమా ఛాన్స్‌లను వద్దనుకున్నా. ఇది తెలిసి చాలామంది నా నిర్ణయం తప్పని అన్నారు కానీ... నాకు కెరీర్ కన్నా ఓ ఇల్లాలిగా భర్త, పిల్లల అవసరాలు చూడటంలోనే ఆనందం అనిపించింది. అందుకే ఇంటికే పరిమితమయ్యా. ఇప్పుడు కొన్ని బాధ్యతలు తీరాయి. దానికితోడు కొన్ని అవకాశాలు కూడా వస్తుండటంతో ఎందుకు నటించకూడదని అనిపించింది. అందుకే 'తలైవి', 'రాధేశ్యామ్' సినిమాలను ఒప్పుకొన్నా.
కోర్సులు చేశా..
ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైనా పిల్లలు పెద్దయ్యేకొద్దీ నాకంటూ కొంత సమయం దొరికింది. దాంతో పోషకాహారం, పిల్లల ఆరోగ్యం, ఫిట్‌నెస్ వంటి అంశాలకు సంబంధించిన కోర్సుల్ని పూర్తిచేశా. అవి నాకెంతో ఉపయోగపడ్డాయి. అంతేకాదు ఆ అవగాహనతో ఇప్పుడు రకరకాల కార్య క్రమాలు నిర్వహిస్తూ ఎంతోమందికి శిక్షణ కూడా ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది.
పిల్లల ఆరోగ్యం, విద్య, క్యాన్సర్ బారిన పడిన చిన్నారులకోసం ఫండ్‌రైజింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటా. ఇలాంటివి ఏర్పాటు చేయడంలో ఉన్న ఆనందం మరెందులోనూ ఉండదు. వివిధ ప్రాంతాలు తిరగడం.. వాటిగురించి రాయడం అన్నా చెప్పలేనంత ఇష్టం.