'అంజలి' చిత్రంతో బాలనటుడిగా తెలుగు ప్రేక్షకులను పరిచయమై.. 'నువ్వేకావాలి' చిత్రంతో హీరోగా అలరించారు హీరో తరుణ్. కథానాయకుడిగా తొలి సినిమాతోనే సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. రెండు దశాబ్దాలుగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి 'లవర్ బాయ్'గా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్.. గతరెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం 'నువ్వేకావాలి' విడుదలై మంగళవారంతో 20 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తన మూడో ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నట్లు 'ఈటీవీ-భారత్'కు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని.. వచ్చే ఏడాది జనవరిలో తన పుట్టినరోజున దానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. అన్నీ కుదిరితే 'నువ్వేకావాలి' చిత్రబృందంతో మరోసారి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తరుణ్ స్పష్టం చేశారు.