రోడ్డు ప్రమాదంలో ప్రముఖ కన్నడ నటుడు సంచారి విజయ్ కన్నుమూశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు విజయ్ స్నేహితుడు నవీన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిర్లక్ష్యంగా వాహనం నడపడం, వ్యక్తి మృతికి కారణమైనందుకు అతనిపై ఐపీసీ 279, 338 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రకారం 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకూ జైలు శిక్షతో పాటు జరిమానా పడే అవకాశం ఉంది.
ఈనెల 12(శనివారం)న విజయ్ తన స్నేహితుడు నవీన్‌తో కలిసి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నారు. రాత్రి 11.30గంటల సమయంలో బెంగళూరు జేపీఎనగర్‌లోని ఎల్‌అండ్‌టీ సౌత్‌సిటీ వద్ద వాళ్లు ప్రయాణిస్తున్న ద్వికచక్ర వాహనం అదుపు తప్పింది. విద్యుత్తు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో విజయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా సోమవారం ఉదయం ఆయనను బ్రెయిన్‌డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. విజయ్ అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు.
2011లో 'రంగప్ప హోగ్బట్నా' సినిమాతో చిత్రసీమకు పరిచయమైన సంచారి విజయ్ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించి తనదైన నటనతో అందరితో శెభాష్ అనిపించుకున్నారు. 2015లో వచ్చిన 'అవనల్ల అవళు' చిత్రంలో ఆయన హిజ్రాగా నటించి అందర్నీ ఆకట్టుకున్నారు. అంతేకాదు.. ఆ సినిమాలో ఆయన నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం లభించింది.