"నేను కథానాయకుడిని కాదు. ఓ సహనటుడిని. మా అబ్బాయి.. ఓ మంచి పాత్రతోనే తెరపై కనిపిస్తే బాగుంటుందనుకున్నా. బలమైన పాత్రలతోనే ప్రేక్షకులకు బాగా చేరువవుతామనేది నా గట్టి నమ్మకం" అని అన్నాడు బ్రహ్మాజీ. ప్రతినాయకుడిగా, సహనటుడిగా, హీరోగా... ఇలా పలు కోణాల్లో కనిపించి ప్రేక్షకుల్ని అలరించిన నటుడీయన. ఇటీవల 'ఓ పిట్టకథ'లో కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రంతోనే బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌రావు పరిచయమవుతున్నాడు. విశ్వంత్, నిత్యాశెట్టి ప్రధాన పాత్రధారులు. చెందు ముద్దు దర్శకుడు. భవ్య క్రియేషన్స్ నిర్మించింది. ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకొస్తోందీ సినిమా. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్లతో బ్రహ్మాజీ బుధవారం ముచ్చటించాడు.
"నటుడిగా చాలా రోజులుగా పరిశ్రమలో కొనసాగుతున్నా. దాంతో మా అబ్బాయికి ఈ రంగంపై మక్కువ ఏర్పడింది. మర్చంట్ నేవీలో పనిచేసే తను ఓ రోజు, నేను నటుడిగా పరిచయమవుతా అన్నాడు. సంజయ్ గురించి దర్శకుడు కృష్ణవంశీకి చెప్పా. అప్పుడే తను 'నక్షత్రం' సినిమాను ప్రారంభిస్తున్నాడు. సంజయ్‌ను ఆ సినిమాకు సహాయ దర్శకుడిగా నియమించాడు. అది నటుడిగా ఈ సినిమాకు బాగా ఉపయోగపడింది".
"దర్శకుడు చెందు ముద్దును నాకు సాగర్ చంద్ర పరిచయం చేశారు. పది రోజుల తర్వాత ఓ కథతో నా దగ్గరికొచ్చి సినిమా చేద్దామన్నాడు. అదే... 'ఓ పిట్టకథ'. ఇందులో నాది సీరియస్‌గా కనిపిస్తూనే హాస్యం పండించే పాత్ర. అమలాపురంలో ఉండే ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్ర. ఓ అమ్మాయి ఎలా మిస్ అయ్యిందనే కోణంలో పరిశోధన చేస్తుంటాడు. ఇప్పటివరకు మనం చూడని ఓ ఆసక్తికరమైన కథనంతో ఆద్యంతం థ్రిల్‌కు గురిచేస్తూ సాగుతుందీ చిత్రం".
"పరిశ్రమలో అందరూ మంచోళ్లే. హీరోలంతా స్నేహితులే. అందరితోనూ మంచి అనుబంధం ఉంది. అందుకే అడగ్గానే చిరంజీవిగారు మొదలుకుని మహేశ్, త్రివిక్రమ్, కొరటాల శివ... ఇలా అందరూ ఈ సినిమా ప్రచారానికి సహకారం అందించారు. నాకు సినిమాపై పూర్తి ధైర్యం ఉంది, మంచి సినిమా అనుకున్నాను కాబట్టి అగ్ర కథానాయకులు, దర్శకుల్ని ఈ సినిమా కోసం తీసుకొచ్చా".
- " class="align-text-top noRightClick twitterSection" data="">