తమిళ నటుడు పాండు(74) కరోనా బాధపడుతూ గురువారం కన్నుమూశారు. ఇటీవలే కొవిడ్ బారిన పడిన ఆయన.. చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యి.. గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నిర్మాత జీ ధనంజయన్ ట్విట్టర్లో వెల్లడించారు. పాండు.. తమిళంతో పాటు తెలుగులోనూ అనేక చిత్రాల్లోని హాస్యపాత్రల్లో నటించి మెప్పించారు. నటుడు పాండు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
హాస్యనటుడు పాండు.. 1970లో తమిళంలో విడుదలైన 'మనావన్' చిత్రంలో విద్యార్థి పాత్ర ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. 'కరాయిల్లెం షెన్‌బగపూ' అనే తమిళ చిత్రం ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీటితో పాటు 'కాదల్ కొట్టై', 'పనకరన్', 'దేవా వాకు', 'రాజాది రాజా రాజా', 'నాట్టమై', 'ఉల్లాతై అల్లిత', 'వాలి', 'జోడి', 'ఎన్నవాలే', 'సిటిజెన్' వంటి సినిమాల్లో నటించారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటుడు ఎంజీ రామచంద్రన్ స్థాపించిన అన్నాడీఎంకే పార్టీ లోగోను రూపుకల్పనలో నటుడు పాండు పాత్ర కూడా ఉంది.

ఇదీ చూడండి: తారల పాలిట శాపంగా మారిన కరోనా!