దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, నటుడు ఆలీ.. టాలీవుడ్‌లో ఈ కలయికకు మంచి పేరుంది. ఈ ముగ్గురు కలిసి తీసిన చిత్రాలు (యమలీల, ఘటోత్కచుడు, మాయలోడు) ప్రేక్షకులకి కొత్త అనుభూతి పంచాయి. కొన్నాళ్ల విరామం అనంతరం మరోసారి ఈ ముగ్గురు ప్రతిభావంతులు ఓ చిత్రం కోసం కలిశారు.. 'అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి' అనే చిత్రాన్ని ఆలీ నిర్మిస్తూ, ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి ఈ చిత్రంలో అతిథి పాత్రల్లో నటించనున్నారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న చిత్ర షూటింగ్‌లో వీరు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ "ఆలీ తొలిసారి నిర్మాతగా మారి నిర్మిస్తున్న ఈ చిత్రం కచ్చితంగా హిట్ అవుతుంది" అని అన్నారు. ముగ్గురు కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.
ఈ చిత్రంలో నటుడు నరేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. 2019 మలయాళ చిత్రం 'వికృతి'కి ఇది రీమేక్. కొచ్చి మెట్రో రైలులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఆద్యంతం హస్యభరితంగా ఉండే ఈ సినిమా మలయాళ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఆలీ స్నేహితుడు శ్రీపురం కిరణ్ ఈ రీమేక్‌ను తెరకెక్కిస్తుండగా.. అబాన్, మౌర్యానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.