కరోనా కారణంగా సినిమా షూటింగులు నెలల తరబడి ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇటీవలే పరిస్థితులు కాస్త మెరుగుపడటం వల్ల తగు జాగ్రత్తలతో చిత్రీకరణలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమిర్ ఖాన్ నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా' సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. దీనిని పూర్తి చేసేందుకు తాజాగా ఆమిర్ టర్కీ వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అంతకుముందు తూర్పు లద్దాఖ్‌లో భారత్- చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా షెడ్యూల్ నిలిపి వేయాల్సి వచ్చింది. దిల్లీలో జరగాల్సిన షూటింగ్ కూడా భద్రతా సమస్యల దృష్ట్యా రద్దయింది.


ఈ సినిమాను సాధారణంగా ఆమిర్‌కు కలిసొచ్చిన క్రిస్మస్ రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళికలు రచించింది చిత్రబృందం. అయితే, అప్పటికి షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో విడుదల తేదీ వాయిదా పడింది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. 1994లో వచ్చిన 'ఫారెస్ట్ గంప్' చిత్రానికి రీమేక్‌గా 'లాల్ సింగ్ చద్దా' రూపొందిస్తున్నారు. అద్వైత్ దర్శకత్వం వహించగా.. కరీనా కపూర్, మోనా సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.