ఆమిర్ ఖాన్.. నేడు దేశంలో అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్న స్టార్. పాత్ర కోసం ఎంత కష్టాన్నైనే భరించేతత్వం ఆయనది. అందుకే అందరూ 'మిస్టర్ పర్‌ఫెక్ట్' అని పిలుస్తుంటారు. అయితే తన కెరీర్ ఆరంభంలో ఎన్నో సమస్యలు, సవాళ్లను ఎదుర్కొన్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ విషయాలను ఇప్పుడు ఓ సారి నెమరువేసుకుందాం.
'ఖయామత్ సే ఖయామత్ తక్' చిత్రంతో ఆమిర్ కథానాయకుడిగా అరంగేట్రం చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. అయితే ఆ తర్వాత కొన్నాళ్లు అవమానాలు ఎదుర్కొన్నట్లు ఆమిర్ చెప్పారు.
"ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమా తర్వాత దాదాపు ఎనిమిది సినిమాలకు సంతకం చేశా. కేవలం కథలను నమ్ముకుని ఒప్పుకున్నా. అంతా కొత్త దర్శకులు, అప్పట్లో నాకు ఆ విషయం తెలియదు. ఈ సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పొందాయి. అందరూ నన్ను 'వన్ ఫిల్మ్ వండర్' అని పిలవడం మొదలుపెట్టారు. నా కెరీర్ ఇక ముగిసిపోయిందని ఆవేదన చెందా. నేను ఊబిలో కూరుకుపోయిన భావన కలిగింది. ఎంతో బాధపడ్డా.. ఇంటికెళ్లి తెగ ఏడ్చేవాడిని" అని ఆమిర్ తెలిపారు.
"నా తొలి చిత్రం విడుదలైన రెండేళ్లలోనే జీవితంలో అతి బలహీనమైన దశను అనుభవించా. నేను నటించిన చిత్రాలు విడుదలై.. ఒక్కదాని తర్వాత మరొకటి ప్లాప్ అవుతూ వచ్చాయి. నాపై వస్తున్న విమర్శలు వింటూ నేను బతకలేను అనుకున్నా. చిత్రాన్ని తెరకెక్కించే విధానం బాగోలేక అవి ఆడటంలేదని అర్థం చేసుకున్నా. అప్పటి వరకు నేను సంతకం చేసిన సినిమాల కోసం పనిచేస్తున్న వారికి వృత్తిపట్ల అంకితభావం లేదని, వాళ్లు కంటెంట్‌కు కనెక్ట్ కాలేదని తెలుసుకున్నా. ఆ సినిమాల్లో నటించానే కానీ, సంతృప్తి లభించలేదు. అందుకే.. గొప్ప దర్శకుడు, కథ, నిర్మాతతో కూడిన ప్రాజెక్టు వస్తే తప్ప నటించకూడదని నిర్ణయించుకున్నా" అని ఆమిర్ గతాన్ని గుర్తు చేసుకున్నారు.
ఆమిర్.. కెరీర్లో 3ఇడియట్స్,తారే జమీన్ పర్, దిల్, లగాన్, రంగ్ దే బసంతి, సర్ఫరోష్, మంగళ్ పాండే, ఫనా, గజిని, పీకే వంటి హిట్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన 'లాల్ సింగ్ చద్దా'లో నటిస్తున్నారు. హాలీవుడ్ చిత్రం 'ఫారెస్ట్ గంప్'కు హిందీ రీమేక్ ఇది.
ఇదీ చూడండి: అమ్మాయి నో చెప్పిందని గుండు చేయించుకున్న ఆమిర్!