'పుండరీకుడు' అనే పేరుగల వ్యక్తి సర్వ వ్యసనాలు గలవాడు. తరువాత అతను భక్తుడిగా మారి మోక్షం పొందాడు. ఇది జరిగిన కథో, కల్పనో తెలియదు గాని, ఆ పాత్రతో 'హరిదాస్' అనే తమిళ చిత్రం 1944లో విడుదలై విజయాలమీద విజయాలు సాధించింది. త్యాగరాజ భాగవతార్ ముఖ్యనటుడు. దక్షిణ దేశంలో 'హరిదాస్' ఒకే థియేటర్లో ఏకబిగిన మూడు సంవత్సరాలు ఆడింది.. ఆశ్చర్యంగాలేదూ? రోజుకు మూడు ఆటలు చొప్పున. ఈ సినిమా మన తెలుగుదేశంలోనూ ప్రదర్శితమై, జనాకర్షణకీ ధనాకర్షణకీ మారుపేరుగా నిలబడింది. ఇందులో త్యాగరాజ భాగవతార్ పాడిన 'కృష్ణాముకుందా మురారే' పాట సుప్రసిద్ధమైంది.
ఇదే కథని ఎన్.టి.రామారావు తీసుకొని 'పాండురంగ మహత్యం' పేరుతో నిర్మించి 1957లో విడుదల చేశారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం. ఎన్.టి.ఆర్, అంజలిదేవి ముఖ్యపాత్రధారులు. విశేషం ఏమిటంటే 'హరిదాస్'లోని అదే పాటని అదే వరుసతో 'పాండురంగ మహాత్యం'లో ఉపయోగించారు. చిత్రీకరణలో తేడాలున్నాయి. పాట నిడివి ఎక్కువ నిమిషాలున్నా ప్రేక్షకులు ఆనందించారు. ఈ పాట పాడిన ఘంటసాలకి మరింత పేరొచ్చింది. కానీ, ఈ సినిమాలో టైటిల్స్‌లో ఆయన పేరు లేదు! అయితేనేం సినిమా హిట్టు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">