1991 జులై 18. సినిమా పేరు 'ఆదిత్య 369'. హీరో బాలకృష్ణ రెండు, మూడు గెటప్పుల్లో కనిపిస్తున్నారు. పోస్టర్ చూసి, శ్రీకృష్ణదేవరాయలు బహుశా ఇంత అందంగా ఉంటాడేమోనని అనుకుంటూ ప్రేక్షకుడు టికెట్ కొనుక్కొని థియేటర్‌లోకి వెళ్లి కూర్చొన్నాడు. సినిమా మొదలైంది. కాసేపటికి టైమ్ మెషీన్ కూడా స్టార్ట్ అయింది. అంతే హీరో బాలకృష్ణ, హీరోయిన్ మోహిని, సుత్తివేలుతో పాటు థియేటర్‌లో సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు కృష్ణదేవరాయల కాలానికి వెళ్లిపోయాడు. అష్టదిగ్గజాలతో కలిసి సభలో కూర్చొని కృష్ణ కుమారుడు చేసే అల్లరిని ఆస్వాదించాడు. 'మేకకొక తోక' పద్యానికి పగలబడి నవ్వాడు. అక్కడి నుంచి భవిష్యత్‌లోకి వెళ్లాడు. అణు యుద్ధంతో భూమి అంతా నాశనమై, భూగర్భంలో బతుకుతున్న మానవజాతిని కలిశాడు. టెక్నాలజీ సాయంతో మనుషులు ఎలా బతుకుతున్నారో ఆసక్తిగా గమనించారు. ఆఖరికి టైమ్ మెషీన్ పేలిపోయింది. నిట్టూరుస్తూ ఇంటికి వచ్చాడు. అయినా, మనసంతా టైమ్ మెషీన్ చుట్టూనే తిరిగింది. అంతలా ప్రేక్షకుడి మనసుపై ముద్రవేసిన క్లాసిక్ మూవీ 'ఆదిత్య 369'. ఇప్పటికీ టీవీలో ప్రసారమైనా, యూట్యూబ్ సజెసన్ వీడియోగా వచ్చినా వదిలి పెట్టకుండా చూసేవాళ్లు ఎందరో. అలా ఈ చిత్ర విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. అసలు 'ఆదిత్య 369' ఆలోచన ఎలా పుట్టింది? ఎలా ముందుకు తీసుకెళ్లారో తెలుసా?
అలా మొదలైంది..
వైవిధ్య చిత్రాలను ప్రేక్షకులకు చూపించాలని తపన పడే దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. అలా ఆయన ఒక రోజు 'టైమ్ మెషీన్' నవల చదివారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని, తెలుగు ప్రేక్షకులకు, నేపథ్యానికి అనుగుణంగా సినిమా తీయాలని భావించారు. కథానాయకుడు భూతకాలంలోకి, భవిష్యత్‌లోకి ప్రయాణిస్తే, అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్న ఆలోచనతో కొంత స్క్రిప్ట్ రాసుకున్నారు. భూతకాలంలో కృష్ణదేవరాయల కాలానికి వెళ్లాలని ముందుగానే అనుకున్నారు. అయితే, భవిష్యత్‌లోకి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్నదానిపై మాత్రం శ్రీనివాసరావుకు పెద్దగా ఆలోచన లేదు. దీంతో మరింత సమాచారం కోసం మద్రాసులోని అమెరికన్ లైబ్రరీకి వెళ్లి మరికొన్ని పుస్తకాలను అధ్యయనం చేశారు. ముఖ్యంగా భవిష్యత్‌లో నగరాలన్నీ భూమి లోపల నిర్మితమై ఉంటాయని, మనసులో అనుకున్న మాటలన్నీ పైకి స్పీకర్‌లో వినపడటం, ఇలా అనేక సన్నివేశాలు అనుకొని సేకరించిన సమాచారంతో కథను సిద్థం చేశారు.
ఇక ఈ సినిమా ఎవరితో చేద్దామా? అన్న ఆలోచనలో ఉండగా, ఒకరోజు చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు సింగీతం శ్రీనివాసరావు విమానంలో కనిపించారు. ఆ మాటా.. ఈ మాటా.. మాట్లాడుకుంటుండగా తాను ఒక స్టోరీలైన్ అనుకున్నానని, టైమ్ మెషీన్ చుట్టూ కథ తిరుగుతుందని సింగీతం చెప్పారు. టైమ్ మెషీన్ సాయంతో కథానాయకుడు భూత, భవిష్యత్ కాలాల్లోకి వెళ్తాడని, భూత కాలంలో శ్రీకృష్ణదేవరాయల నేపథ్యాన్ని తీసుకుందామని కథ వివరించారు. బాలూకీ కథ నచ్చింది. అదే సమయంలో ఆయన దగ్గరి బంధువైన శివలెంక కృష్ణప్రసాద్ వద్ద బాలకృష్ణ డేట్స్ ఉన్నాయి. ఈ కథ బాలకృష్ణకు బాగుంటుందని అన్నారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు పాత్రకు బాలయ్య బాగుంటారని అభిప్రాయపడ్డారు.
కథానాయికగా విజయశాంతిని అనుకుంటే!
కథానాయకుడిగా బాలకృష్ణ ఓకే. హీరోయిన్‌గా విజయశాంతిని అనుకున్నారు. కానీ, ఆమె డేట్లు సర్దుబాటు చేయలేపోవడం వల్ల పీసీ శ్రీరాంకు పరిచయం ఉన్న మోహినిని ఎంపిక చేశారు. ఇక సినిమాలో టైమ్ మెషీన్ తయారు చేసే శాస్త్రవేత్తగా విభిన్నంగా ఉంటారని హిందీ నటుడు టినూ ఆనంద్‌ను తీసుకున్నారు. మిగిలిన పాత్రలకు అమ్రిష్‌పురి, గొల్లపూడి మారుతీరావు, బాబూమోహన్, తనికెళ్ల భరణి, సుత్తివేలు, చంద్రమోహన్, చలపతిరావు, సిల్క్‌స్మిత, శుభలేఖ సుధాకర్, బ్రహ్మానందం తదితరులను ఎంపిక చేశారు. మరోపక్క బాల నటులుగా తరుణ్, రాశి నటించారు. మాటలతో గారడీ చేసి, ప్రేక్షకుల మంత్రముగ్ధులను చేయగల రచయిత జంధ్యాలతో మాటలు రాయించారు. సంగీత దర్శకుడిగా మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజాను తీసుకున్నారు. కెమెరామెన్‌గా పీసీ శ్రీరామ్‌ను అనుకున్నా, ఇతర కారణాల వల్ల ఆయన తప్పుకొన్నారు. దీంతో వీఎస్‌ఆర్ స్వామి, కబీర్‌లాల్‌లకు ఆ బాధ్యతలు అప్పగించారు.
వేరే కథతో రాయలవారి కాలం..
రాయలవారి కాలానికి వెళ్లిన తర్వాత అక్కడ తొలుత అనుకున్న కథ వేరే ఉంది. శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే కదా! వారి మధ్య నెలకొన్న రాజకీయ వివాదాలను, విషయాలను ప్రధానంగా చర్చించాలని సింగీతం అనుకున్నారు. అయితే అది వివాదాస్పదమవుతుందని, చరిత్రను వక్రీకరించారంటూ వివాదాలు మొదలవుతాయని అనుకున్నారు. దీంతో సరదా సన్నివేశాలతో చిత్రీకరణ జరిపారు. అలా వచ్చినవే.. రాయలవారి దర్బారులో వచ్చే మేకతోకకు మేక.. తోక మేకకు తోక.. మేక తోక.. మేక.. మేక తోక.. సన్నివేశం, 'సురమోదం..' పాటలో మధ్యలో రంపంప రంప రంప.. అంటూ సాగే ర్యాప్‌తో పాటు సుత్తివేలు, శ్రీలక్ష్మిల మధ్య సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి.
బాలకృష్ణ చాలా కష్టపడ్డారు..!
ఈ సినిమా కోసం బాలకృష్ణ చాలా కష్టపడ్డారు. కృష్ణ కుమారుడిగా, శ్రీకృష్ణదేవరాయలుగా రెండు పాత్రలు పోషించారు. ముఖ్యంగా రాయలవారి పాత్రకోసం ఉదయం 8గంటలకు మేకప్‌తో వచ్చి కొన్నిసార్లు మరుసటి రోజు వరకూ పనిచేసేవారు. బరువైన కిరీటంతో గంటల పాటు పనిచేయాల్సి వచ్చేది. కొన్ని సన్నివేశాలు తెరకెక్కించడానికి మధ్యాహ్నం వరకూ సమయం ఉండేది. దర్శకులు కూడా బాలకృష్ణకు మధ్యాహ్నం షూటింగ్‌కు రమ్మనేవారు అయితే బాలకృష్ణ మాత్రం ఉదయం 8 గంటలకే షూటింగ్‌కు వచ్చేవారు. పని విషయంలో అంత క్రమశిక్షణతో ఉండేవారు. కృష్ణదేవరాయల కాలం నాటి సన్నివేశాలను అన్నపూర్ణ స్టూడియోలో, తొలుత ‘టైమ్ మెషీన్’ కనపడే సన్నివేశాలకు మద్రాసు వాహినీ స్టూడియోల్లో సెట్స్ వేసి తెరకెక్కించారు. కొన్ని సన్నివేశాల కోసం టైమ్‌మెషీన్‌ను పెద్ద లారీలో వేసుకుని తలకోన అడవులకు కూడా తీసుకెళ్లారు. ఇక భవిష్యత్‌లోకి వెళ్లిన తర్వాత తెరకెక్కించాల్సిన సన్నివేశాలను వీజీపీ గోల్డెన్ బీచ్‌లో సెట్‌వేశారు.
ప్రత్యేక వీడియో..
ఆదిత్య 369 సినిమా.. 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది చిత్రబృందం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
టైటిల్ 'కాలయంత్రం' అని పెడదామనుకున్నారు!
సినిమా మొత్తం పూర్తవడానికి 110 రోజులు పట్టింది. అనంతరం గ్రాఫిక్స్ కోసం లండన్ వెళ్లారు. ఇక మూవీకి ఏ పెడదామని చాలా ఆలోచించారు. చాలామంది 'కాలయంత్రం' పెడతారనుకున్నారు. 'యుగ పురుషుడు' అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ చివరకు కాలంతో పయనించే సూర్యుడికి మరో పేరు ఆదిత్యుడు. మెషీన్‌కు నెంబర్ ఉండాలి కదా అని 369. ఇలా 'ఆదిత్య 369'గా పేరు పెట్టారు. మొత్తం సినిమా పూర్తవడానికి రూ.1.60కోట్లు ఖర్చు అయింది.
అలా 1991 జులై 18న 'ఆదిత్య 369' విడుదలైంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంది. బాలకృష్ణ సినీ ప్రస్థానంలో మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా 'ఆదిత్య 999' త్వరలోనే పట్టాలెక్కిస్తానని బాలకృష్ణ ఇటీవల ప్రకటించారు. మరి ఈ సినిమా కథ ఏంటి? దర్శకుడు ఎవరు? బాలకృష్ణతో పాటు నటించే ఇతర నటీనటులు ఎవరు? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న నేపథ్యంలో 'ఆదిత్య 999'పై భారీ అంచనాలే ఉన్నాయి.