బుల్లితెర వ్యాఖ్యాతగా అందరికీ సుపరిచితుడైన ప్రదీప్ మాచిరాజు హీరోగా నటిస్తున్న తొలి చిత్రం '30రోజుల్లో ప్రేమించటం ఎలా?'. ఫణి ప్రదీప్ దర్శకుడు. యస్.వి.బాబు నిర్మించారు. అమృత అయ్యర్ కథానాయిక. జనవరి 29న థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో ప్రదీప్ మాట్లాడారు.
"నటుడవ్వాలనేది నా కల. అది తీరడానికి పదేళ్లు పట్టింది. మున్నా చెప్పిన కథ.. నా పాత్ర చాలా ఆసక్తికరంగా అనిపించి సినిమా ఒప్పుకొన్నా. సినిమా చూసిన ప్రతిఒక్కరూ చిరునవ్వులతో బయటకొస్తారని మాటిస్తున్నా. అనూప్ స్వరాలు, చంద్రబోస్ సాహిత్యం, శివేంద్ర విజువల్స్ చిత్రానికి ప్రధాన ఆకర్షణ".
- ప్రదీప్ మాచిరాజు, వ్యాఖ్యాత, నటుడు
"నీలీ నీలీ ఆకాశం' పాట ఎంత పెద్ద హిట్ అయిందో.. సినిమా అంతే హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాం" అని చిత్ర దర్శకుడు ఫణి ప్రదీప్ అన్నారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. "కథకు తగ్గట్లుగా స్వరాలు సమకూర్చా. అన్నీ మంచి హిట్టయ్యాయ"న్నారు. "ఈ చిత్రంలో నాలుగు పాటలు రాశా. 'నీలీ నీలీ ఆకాశం' పెద్ద హిట్టయ్యింది. నేనూ ఈ సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంద"న్నారు గీత రచయిత చంద్రబోస్. "యువి, జీఏ2 వంటి పెద్ద సంస్థలు మా చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నా" నిర్మాత అన్నారు.
ఇదీ చూడండి: 'ఆచార్య'లో చెర్రీకి జోడీగా జిగేలు రాణి!