నట సామ్రాట్ ఎస్వీ రంగారావు- దేవిక కాంబినేషన్లో రూపొందిన సినిమా 'పాపం పసివాడు'. 1972 సెప్టెంబరు 29న విడుదలై మంచి విజయం సాధించింది. హాలీవుడ్ చిత్రం 'లాస్ట్ ఇన్ ది డిసర్ట్' ఆధారంగా దీనిని తెరకెక్కించారు. అయితే ఈ చిత్ర నిర్వాహణ బాధ్యతలు చూసుకున్న ఎ.పూర్ణచంద్రరావు గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడూతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
రాజస్థాన్‌లోని జైసాల్మేర్ దగ్గర్లోని ఎడారి ప్రాంతంలో 27 రోజుల పాటు షూటింగ్ చేశారు. చిత్రీకరణ జరిగినన్ని రోజులు అక్కడే గుడారాలు వేసుకుని ఉన్నారు. తాగడానికి దగ్గరలో నీళ్లు కూడా ఉండేవి కావు. ఎక్కడో బావులుంటే తోడించి, ఒంటెల చేత తెప్పించుకునేవారని తెలిపారు పూర్ణచంద్రరావు. ప్రతి రోజూ 300 మైళ్ల దూరం ఉన్న పట్నం నుంచి ట్రక్కులు ద్వారా డ్రమ్ముల్లోనూ నీళ్లు తెప్పించుకునేవారని చెప్పారు. నిర్మాణ వ్యయంలోని ఎక్కువ భాగం ఎడారి ప్రాంతంలోని షూటింగ్‌కే ఖర్చయిందని తెలిపారు.
విదేశాల్లో చికిత్స కోసం పైలట్ అయిన మేనమామతో కలిసి చార్డెడ్ విమానంలో బయలుదేరిన ఒక చిన్న పిల్లవాడు, విధి వశాత్తూ విమానం కూలిపోయి ఎడారి పాలవుతాడు. ఆ విపత్కర పరిస్థితులను ఎదుర్కొని తిరిగి తన తల్లిదండ్రులను ఎలా చేరుకున్నాడు? అనేదే ఈ చిత్ర కథాంశం. ఈ సినిమా ప్రచారం కోసం వినూత్నంగా హెలికాప్టర్ ద్వారా కరపత్రాలు పంచి పెట్టడం విశేషం. కథ, చిత్రానువాదం, మాటలు గొల్లపూడి మారుతీరావు అందించారు.
ఇదీ చూడండి : నటనను శాసించిన యశస్వి మన 'ఎస్వీ'