'ఏయ్ నువ్వు నంద అయితే, నేను బద్రి.. బద్రినాథ్.. అయితే ఏంటి?' ఈ ఒక్క డైలాగ్ 20 ఏళ్ల కిందట యువతను ఓ ఊపు ఊపేసింది. పవన్ కల్యాణ్ అభిమానులను కాలరెగరేసుకునేలా చేసింది. ఎక్కడ విన్నా, ఎవరి నోట విన్నా, 'ఏ చికిత కొమస్తాస్...', లేకపోతే 'బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే..' ఇవే పాటలు. సినిమా చూసిన వాళ్లందరూ ఎవరా దర్శకుడు? అంటూ ప్రశ్నలు. 'ఎవరో పూరి జగన్నాథ్ అట. మావోడిని మామూలుగా చూపించలేదుగా...' అంటూ పవన్ అభిమానుల దిల్ ఖుష్ అయిపోయారు. ఆ సినిమానే 'బద్రి'. పూరి జగన్నాథ్ తొలిసారి దర్శకత్వం వహించిన 'బద్రి' ఏప్రిల్ 20 నాటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. అంటే దర్శకుడిగా పూరి తన ప్రస్థానాన్ని ప్రారంభించి రెండు దశాబ్దాలు.
ఈ 20 ఏళ్ల కెరీర్‌లో హిట్‌లు.. సూపర్ హిట్‌లు.. బ్లాక్‌బస్టర్‌లు ఎన్నోచూశారు. అదే సమయంలో ఫ్లాప్‌లు.. అట్టర్‌ప్లాప్‌లూ ఎదురుపడ్డాయి. 'జీవితం ఎవ్వరినీ వదిలి పెట్టదు.. అందరి సరదా తీర్చేస్తుంది' పూరి అనుభవంలో నుంచి వచ్చిన డైలాగ్ అనుకుంటా. మరి అన్ని ఎత్తు పల్లాలు చూసిన పూరి మొదటి చిత్రం 'బద్రి'కి ఎలా కష్టపడ్డారు? పవన్‌ను ఎలా ఒప్పించారు?

పవన్‌ను కలవడానికి...
సహాయ దర్శకుడిగా రాంగోపాల్ వర్మ దగ్గర పనిచేసి పూరి జగన్నాథ్ సొంతంగా ఒక కథను తయారు చేసుకున్నారు. పవన్ కల్యాణ్‌తో సినిమా చేద్దామని ఆయన మేనేజర్ చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. అయినా ఫలితం దక్కలేదు. దీంతో గతంలో దూరదర్శన్ ద్వారా పరిచయం ఉన్న శ్యామ్ కె.నాయుడిని కలిసి 'పవన్‌కు కథ చెప్పే అవకాశం ఇప్పించండి' అని కోరారు.

శ్యామ్ ఈ విషయాన్ని చోటా కె.నాయుడుకి చెప్పారు. అప్పటికే చోటాకు పవన్ మంచి స్నేహితుడు. దీంతో పూరి వెళ్లి చోటాను కలిస్తే 'పవన్‌కు మంచి కథ చెప్పకపోతే నా పరువు పోతుంది. ముందు ఆ కథ నాకు చెప్పు' అని చోటా అనడం వల్ల తన దగ్గర ఉన్న 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం' కథ చెప్పారు పూరి. అది చోటాకు నచ్చి.. ఇదే కథ చిన్న పాయింట్‌గా పవన్‌కు చెప్పి పూరి కలిసేందుకు పవన్‌ను ఒప్పించారు.
అర గంట సమయం ఇచ్చిన పవన్
కథ చెప్పేందుకు పవన్‌కల్యాణ్ నుంచి పూరి జగన్నాథ్‌కు పిలుపు వచ్చింది. అదీ తెల్లవారుజామున 4 గంటలకు రమ్మన్నారు. అంతేకాదు, కేవలం అరగంట సమయం మాత్రమే ఇచ్చారు. తెల్లవారుజామున పవన్ ఇంటికి వెళ్లిన పూరి కథ చెప్పడం మొదలు పెట్టారు. అరగంట గడిచిపోయి గంట అయింది. గంట కాస్తా నాలుగు గంటలైంది. పవన్ కథ వింటూనే ఉన్నారు. పవన్‌కు చాలా నచ్చింది. కానీ, క్లైమాక్స్ మార్చమని సలహా ఇచ్చారు. 'హమ్మయ్యా.. ఎలాగో కథ అయితే ఒకే అయింది. క్లైమాక్స్ సంగతి చూద్దాం' అంటూ పవన్‌కు ఒకే చెప్పి బయటకు వచ్చేశారు.

క్లైమాక్స్ మార్చని పూరి
క్లైమాక్స్ మార్చమని పవన్ కల్యాణ్ సూచించడం వల్ల దానిపై కసరత్తు మొదలుపెట్టారు. ఒకరోజు.. రెండు రోజులు.. అలా వారం అయింది. అయినా క్లైమాక్స్ మాత్రం తనకు నచ్చినట్లు రావడం లేదు. వారం తర్వాత మళ్లీ వెళ్లి పవన్‌ను కలిశారు. 'ఏమైంది క్లైమాక్స్ మార్చావా' అని పవన్ అడిగారు. 'ప్రయత్నించాను. కానీ, కొత్త వెర్షన్ నాకే నచ్చలేదు' అని పూరి సమాధానం ఇచ్చారు. 'నా గురించి నువ్వు క్లైమాక్స్ మారుస్తావా? లేదా చూద్దామని అలా అడిగాను. ఇదే బాగుంది' అని పవన్ అనడం వల్ల పూరికి ఎక్కడలేని సంతోషం. అప్పుడే పవన్ ఓ బాంబు పేల్చారు. 'అన్నట్లు చోటాకు ఈ కథ కాదు కదా నువ్వు చెప్పింది. ఇప్పుడు నువ్వు చెప్పిన కథ పూర్తి భిన్నంగా ఉంది' అంటూ ప్రశ్నించాడు. 'అవకాశం పోతుందని ఆయనకు ఆ కథ చెప్పా' అని పూరి నిజం చెప్పేశారు.

అసలు 'బద్రి' కథేంటి?
బద్రి (పవన్‌కల్యాణ్) యాడ్ ఏజెన్సీ యజమాని. అతడి తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారు. తన కుటుంబానికి చాలా దగ్గరైన వెన్నెల (రేణు దేశాయ్), బద్రి ప్రేమించుకుంటారు. ఇరువురికి పెళ్లి చేసేద్దామని రెండు కుటుంబాలు అనుకుంటాయి. ఒక రోజు వెన్నెల, బద్రి కూర్చొని మాట్లాడుకుంటుండగా.. 'నా కంటే ఈ ప్రపంచంలో ఎవరూ నిన్ను గొప్పగా ప్రేమించలేరు...' అంటూ బద్రికి వెన్నెల సవాల్ విసురుతుంది. దాంతో వెన్నెల తాను చూపించిన అమ్మాయిని (అమీషా పటేల్/సరయు) నెల రోజుల్లో ప్రేమలో పడేయాలని చెబుతుంది. దీనికి బద్రి ఒప్పుకొంటాడు. మరి సరయును ప్రేమించడానికి బద్రి ఏం చేశాడు? బద్రి ప్రేమ విషయం తెలిసి సరయు అన్నయ్య నంద (ప్రకాష్‌రాజ్) ఎలాంటి అవాంతరాలు కల్పించాడు? చివరకు బద్రి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అన్నదే కథ.

ఎవరి పాత్రలో వాళ్లు ఒదిగిపోయారు
ఈ సినిమాలో పవన్, అమీషా పటేల్, రేణు దేశాయ్, ప్రకాష్‌రాజ్... పాత్రలే కీలకం. బద్రిగా పవన్ నటన, స్టైల్, ఫైట్స్ అన్నీ మెప్పిస్తాయి. ముఖ్యంగా ప్రకాష్‌రాజ్ తన ఆఫీస్‌కు వచ్చి వార్నింగ్ ఇచ్చే సన్నివేశంలో తిరిగి పవన్ చెప్పే 'బద్రి.. బద్రినాథ్' డైలాగ్ ఎవర్‌గ్రీన్. ఇక కథానాయికలుగా అమీషా పటేల్, రేణుదేశాయ్ నటించారు. అమీషా పటేల్‌కు ఇదే తొలి తెలుగు చిత్రం. ఇక చిత్రంతోనే పరిచయమైన రేణు దేశాయ్‌ను ఆ తర్వాత పవన్ వివాహం చేసుకున్నారు. తొలి సినిమాతోనే దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పూరి జగన్నాథ్. పవన్‌ను చూపించిన విధానం అభిమానులకు బాగా నచ్చింది. ఆ తర్వాత పూరికి వరుస అవకాశాలు వచ్చాయి.

రమణ గోగుల సంగీతం హైలెట్
పవన్ నటించిన 'తమ్ముడు' చిత్రానికి పని చేసిన రమణ గోగులనే 'బద్రి' సినిమాకు సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఆయన ఇచ్చిన పాటలు యువతను ఓ ఊపు ఊపేశాయి. 'బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే..', 'ఏయ్ చికిత.. కొమస్తాస్' పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వాటిని తెరకెక్కించిన విధానమూ కొత్తగా ఉంటుంది. ఇక ఈ చిత్రం 85 సెంటర్లలో 50 రోజులు, 47 సెంటర్లలో 100 రోజులు విజయవంతంగా ఆడింది.
బ్రహ్మానందం.. మల్లికార్జునరావుల కామెడీ అదుర్స్
ఇక సినిమాలో బ్రహ్మానందం.. మల్లికార్జునరావుల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. 'సీఎం' రికమండేషన్‌తో వచ్చానంటూ బ్రహ్మానందం దగ్గర మల్లికార్జునరావు జాబ్‌లో చేరడం.. మోడల్స్ ఫొటోలు తీయడం సన్నివేశాలన్నీ కితకితలు పెడతాయి.

యూట్యూబ్‌లో చూస్తూనే ఉన్నారు
ఈ సినిమా ఇప్పటికీ టీవీల్లో వస్తోందంటే.. కుర్రాళ్లు టీవీకి అతుక్కుపోతుంటారు. దానికి ఒక కారణం పవన్ అయితే, మరో కారణం పూరి డైలాగ్స్. అంతేనా.. ఈ సినిమాను యూట్యూబ్‌లో లక్షల మంది చూస్తున్నారు... చూస్తూనే ఉన్నారు. యూట్యూబ్‌లో ఈ సినిమాలో నాలుగైదు ఛానల్స్‌లో అందుబాటులో ఉంది. అవన్నీ కలిపి 90 లక్షల వ్యూస్ ఉన్నాయి. ఈ నెంబరు ఇప్పుడు పెద్ద విషయం కాకపోవచ్చు కానీ.. అప్పటి సినిమాకి ఈ నెంబరు పెద్దదే కదా. అన్నట్లు ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందంటూ క్లైమాక్స్‌లో వెన్నెల పాత్రతో చెప్పిస్తారు. ఆ తర్వాత ఎప్పుడూ 'బద్రి 2' గురించి ఎక్కడా వినిపించలేదు. ఇటీవల పవన్ - పూరి సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. అది 'బద్రి 2'నే అంటూ పుకార్లు వచ్చాయి. 20 ఏళ్ల పూర్తయిన ఈ శుభ సందర్భంలో ఈ శుభవార్త చెప్తారేమో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు
ఇదీ చూడండి.. చిరుకు నమ్మినబంటుగా బన్నీ!