మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని అందుకుని భవిష్యత్ బాలీవుడ్‌లో తనశకం మొదలైనదంటూ స్పష్టమైన సంకేతాన్నిచ్చారు ఆయనే... మిథున్ చక్రవర్తి. అసలు పేరు గౌరంగ్ చక్రవర్తి.
ప్రతిభ బహుముఖం
మిథున్ చక్రవర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెరపై నటుడిగా కనిపించే ఆయనలో అనేక కళలు దాగున్నాయి. రచయిత, గాయకుడు, నిర్మాత, సామాజికవేత్త, వ్యాపారవేత్త, టెలివిజన్ ప్రజంటర్‌గా ఆయన సేవలు అమోఘం. అంతేనా! ఆయన రాజకీయవేత్తగా కూడా రాణించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు.
వ్యక్తిగతం
అప్పడు ఈస్ట్ బెంగాల్‌లో, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉన్న బరిసాల్ గ్రామంలో మిథున్ చక్రవర్తి 1950 జూన్ 16న జన్మించారు. కోల్‌కత్తా స్కాటిష్ చర్చి కాలేజ్‌లో చదువుకున్న మిథున్ చక్రవర్తి కెమిస్ట్రీలో డిగ్రీ పొందారు. ఆ తరువాత ఆయన పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ పొందారు. ఆ తరువాత నక్సలైట్ భావజాలానికి ఆకర్షితులై కొన్నాళ్లు అందులో చురుగ్గా పనిచేశారు. ఇంట్లో సోదరుడి మరణం తరువాత మళ్లీ ఇంటికి వచ్చిన మిథున్ ఫిలిం ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకుని విజయాలను అందుకున్నారు.
మృణాల్ సేన్ చెక్కిన నటశిల్పం
దర్శకుడు మృణాల్ సేన్ 'మృగయా' సినిమా ద్వారా మిథున్ చక్రవర్తి తెరంగేట్రం చేసారు. ఈ సినిమా అప్పట్లో నవ్య సంచలనాలు లిఖించింది. 'మృగయా' అంటే వేట. వేట అంటే మక్కువ ఎక్కువైన బ్రిటిష్ పాలకుడికి గ్రామస్థులకు మధ్య నడిచే ఉత్కంఠభరిత ఇతివృత్తం ఇది. రొటీన్ కమర్షియల్ చిత్రాల ఒరవడి సాగుతున్న సందర్భంలో 'మృగయా' అభిరుచిగల ప్రేక్షకులకు ఊరటనిచ్చింది. మృణాల్ సేన్ వాస్తవ కధలకు తెర రూపం ఇచ్చే దర్శకుడిగా ప్రత్యేక ముద్ర ఉంది. ఈ సినిమా భగభతి చరణ్ పాణిగ్రాహి రచన షికారి ఆధారంగా నిర్మితమైనది. విడుదలైన అన్ని కేంద్రాల్లో విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ చూరగొన్న ఈ చిత్రం అనేకానేక అవార్డులు, రివార్డులు అందుకుంది. జాతీయస్థాయిలో ఉత్తమ చిత్రంగా, ఈ చిత్రం ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా మిథున్ చక్రవర్తి అవార్డులు అందుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
డిస్కో డాన్సర్‌గా
ప్రత్యేక గుర్తింపు ఇక అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకొనవసరం లేకుండా సినీ జగత్తులో తన ఉనికిని బలంగా చాటుకున్నారు. మిథున్ చక్రవర్తి ఖాతాలో పడిన మరో విజయవంతమైన చిత్రం 1982లో విడుదలైన 'డిస్కోడాన్సర్'. డిస్కో డాన్స్‌లు అప్పటి యువతరాన్ని బాగా ఊపేస్తున్న తరుణంలో ఆ డాన్సర్ పాత్ర చుట్టూ అల్లిన కధ 'డిస్కో డాన్సర్' చిత్రంగా మారింది. ఇద్దరు నిర్మాతల్లో ఒకరైన బబ్బర్ సుభాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి యువతకు దగ్గరైన కథానాయకుడిగా విశ్వరూపం ప్రదర్శించారు. డిస్కో డాన్సర్ మిథున్ చక్రవర్తికి మరోపేరుగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రం భారత దేశంలోనే కాకుండా రష్యాలో కూడా విజయవంతంగా ప్రదర్శితమైనది. అప్పట్లో రాజకపూర్, మిథున్ చక్రవర్తి మాత్రమే ఈ దేశపు గొప్ప నటులుగా రష్యా లాటి దేశాల్లో కీర్తిని ఆర్జించారు. ఈ సినిమాలో పాటలన్ని జనప్రాచుర్యం పొందినవే. ఐ యామ్ ఏ డిస్కో డాన్సర్, జిమ్మీ జిమ్మీ జిమ్మీ ఆజా, యాద్ ఆ రహా హై, గోరోంకీ నా కాళోమ్కీ..అనే పాటలు ప్రజాబాహుళ్యానికి బాగా నచ్చినవే. బప్పీలహరి సంగీతం ఆకట్టుకుంది.
అనేక చిత్రాలు...అనేక విజయాలు
మిథున్ చక్రవర్తి పేరు తలవగానే చటుక్కున గుర్తొచ్చే సినిమాలు చాలానే ఉన్నాయి. 'సురక్ష', 'సాహస్ వార్ దత్', 'వాంటెడ్', 'బాక్సర్', 'ప్యార్ జ్యూక్తా నహీ', 'ప్యారీ బెహనా', 'అవినాష్', 'డాన్స్ డాన్స్', 'ప్రేమ్ ప్రతిజ్ఞ', 'ముజ్రిమ్', 'అగ్నిపధ్, యుగంధర్', 'ది డాన్', 'జల్లద్' సినిమాల్లో ఆయన ప్రదర్శించిన నటన అప్పటి ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.
'స్వామి వివేకానంద'లో రామకృష్ణగా కీర్తి పతాక
వాణిజ్య విలువలున్న సినిమాలు చేస్తూనే మిథున్ చక్రవర్తి తనదాకా వచ్చే కొన్ని మంచి చిత్రాలను కూడా అంగీకరించారు. అందువల్ల, మిథున్ చక్రవర్తిని కేవలం కమర్షియల్ హీరోగా మాత్రమే చూడనక్కరలేదని విమర్శకులు ప్రశంసిస్తూ ఉంటారు. మిథున్ చక్రవర్తి నట జీవితంలో 'స్వామి వివేకానంద' గొప్ప చిత్రంగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. టి.సుబ్బరామిరెడ్డి నిర్మాతగా జీవి అయ్యర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఎక్కడ చూసినా ఈ సినిమాపై చర్చోపచర్చలు. జీవి అయ్యర్ 11 సంవత్సరాలపాటు వివేకానందుడి జీవితాన్ని పరిశోధించిన తరువాత చిత్రకథ సిద్ధం చేసుకున్నారు. సర్వథమన్ బెనర్జీ స్వామి వివేకానందుడిగా నటించిన ఈ చిత్రంలో రామకృష్ణ పాత్రలో మిథున్ చక్రవర్తి రక్తి కట్టిస్తారు. ఈ చిత్రం ద్వారా మిథున్ చక్రవర్తి మూడోసారి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.
అవార్డులు...పురస్కారాలు
మిథున్ చక్రవర్తి మూడు సార్లు జాతీయ పురషారాలను అందుకున్నారు. తొలిసారిగా చిత్రం 'మృగయా' ద్వారా ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. 1992లో 'తహెడర్' కధ చిత్రానికి మరోసారి ఉత్తమ నటుడిగా జాతీయ స్థాయిలో విజేతగా నిలిచారు. 1995లో 'స్వామీ వివేకానంద' సినిమాలో కనబరిచిన ప్రతిభకుగాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.
ఫిలిం ఫేర్ అవార్డులు
1991లో ‘అగ్నిపధ్’ చిత్రంలో నటనకుగాను ఉత్తమ సహాయ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. 1996లో 'జల్లాడ్' సినిమాలో పోషించిన ప్రతినాయకుడి పాత్రకుగాను ఉత్తమ నటుడిగా మరోసారి ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. 2008లో ‘గురు’ సినిమాకిగాను ఉత్తమ సహాయనటుడి విభాగంలో నామినేట్ అయ్యారు. ‘జల్లాడ్’ సినిమాలో నటనకుగాను ఉత్తమ విలన్‌గా స్కీన్ర్ అవార్డు పొందారు.
జీవన సాఫల్య పురస్కారం
స్టార్ డస్ట్ అవార్డుల్లో భాగంగా 2007లో జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. అదే సంవత్సరం స్టార్ డస్ట్ మిథున్ చక్రవర్తికి రోల్ మోడల్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందించింది. 1977లో ‘మృగయా’ సినిమాకిగాను బిఎఫ్ జె ఏ ఉత్తమ నటుడిగా అవార్డుతో సత్కరించింది. ఇంకా అనేకానేక సాంస్కృతిక సంస్థలు ప్రతిష్టాత్మకమైన అవార్డులతో మిథున్‌ని గౌరవించాయి.
- పి.వి.డి.ఎస్.ప్రకాష్